న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల (బ్యాంకుల) నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ ఇన్‌కమ్ వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.04 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. ఇది కిందటేడాది బడ్జెట్‌లో వేసిన అంచనా రూ.48 వేల కోట్ల కంటే చాలా ఎక్కువ. కిందటేడాది మే లో ఆర్‌బీఐ ఏకంగా రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ) ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల డివిడెండ్ ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల నుంచి రూ.39,961 కోట్ల డివిడెండ్స్‌ను కేంద్రం అందుకుంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్‌బీఐ, ప్రభుత్వ బ్యాంకులు, ఇతర గవర్నమెంట్ కంపెనీల నుంచి కేంద్రానికి రూ. 1,54,407 కోట్ల డివిడెండ్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల కోట్లు అందుతుందని అంచనా.
మార్కెట్ నుంచి ఫండ్స్ సేకరణ..
సెక్యూరిటీల (లాంగ్ టెర్మ్ బాండ్ల) ను ఇష్యూ చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14.13 లక్షల కోట్లను ప్రభుత్వం సేకరిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఫిస్కల్ డెఫిసిట్ (ఖర్చులు మైనస్ ఆదాయం) ను చేరుకోవడానికి డెట్ మార్కెట్ వైపు కేంద్రం చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై 31 నాటికి డేటెడ్ సెక్యూరిటీలను ఇష్యూ చేయడం ద్వారా కేంద్రం రూ.5.77 లక్షల కోట్ల గ్రాస్ అమౌంట్‌ను సేకరించింది.