నల్లమలలో కార్చిచ్చు .. వారం రోజుల్లో మూడు చోట్ల చెలరేగిన మంటలు

నల్లమలలో కార్చిచ్చు .. వారం రోజుల్లో మూడు చోట్ల చెలరేగిన మంటలు
  • పర్యాటకులు, పశువుల కాపర్లే కారణమా?  
  • చెంచులు, వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు

నాగర్​కర్నూల్, వెలుగు: వేసవికి ముందే నల్లమల అభయారణ్యంలో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. జనవరి 31న దోమలపెంట రేంజ్​లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మూడు రోజుల వరకు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో 35 ఎకరాల అటవీ ప్రాంతం బుగ్గి పాలైంది.

ఈ నెల 6న రాత్రి దోమలపెంట రేంజ్  అడవిలో మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం మన్ననూర్  రేంజ్  రాంపూర్  బ్లాక్ లో అంటుకున్న మంటలను సిబ్బంది అర్పేశారు. ఇలా వారం రోజుల్లో మూడు చోట్ల మంటలు అంటుకోవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి నల్లమల అటవీప్రాంతం నుంచి వెళ్తుంది. పర్యాటకులతో పాటు పశువుల కాపర్ల అజాగ్రత్త కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయని ఫారెస్ట్​ ఆఫీసర్లు అంటున్నారు.

వానాకాలంలో పెరిగిన గడ్డి ఎండిపోవడంతో చిన్న నిప్పు రవ్వ పడినా అంటుకుంటోంది. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్​ అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగినప్పుడు మంటలు విస్తరించకుండా ఏర్పాటు చేసిన ఫైర్​ లైన్స్​లోనూ గడ్డి దట్టంగా పెరిగింది. మంటలను అదుపు చేయాల్సిన సిబ్బంది పచ్చి కొమ్మలు, బ్లోయర్లపై ఆధారపడడంతో ప్రమాద తీవ్రత పెరుగుతుందని అంటున్నారు.

కలవర పెడుతున్న కార్చిచ్చు..

గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఐదు ప్రాంతాల్లో అడవికి నిప్పంటుకుంది. అమ్రాబాద్, మన్ననూరు, మద్దిమడుగు  రేంజ్​ పరిధిలోని అప్పాపూర్, దోమలపెంట, వటవర్లపల్లి, తుర్కలపల్లి, మన్ననూర్,  మల్లాపూర్, తాడుతారా, తుర్కలపల్లి  ప్రాంతంతో పాటు కొల్లాపూర్​ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి  చెట్లు కాలిపోయాయి. గడిచిన పదేండ్లలో 2,282 హెక్టార్ల అడవి కాలిపోయినట్లు జీపీఎస్​ ద్వారా గుర్తించారు. మంటలు చెలరేగిన ప్రతిసారి వన్యప్రాణులు, పాములు అందులో చిక్కుకొని చనిపోతున్నాయి. బూడిదగా మారిన ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి వన్యప్రాణులు వెళ్తున్నాయి.

గత ఏడాది శ్రీశైలం–-హైదరాబాద్​ మెయిన్​ రోడ్డుకు ఇరువైపులా మంటలు విస్తరించడంతో ఫైర్​ ఇంజిన్​తో అదుపు చేశారు. ఫారెస్ట్ ​కోర్​ ఏరియా,అమ్రాబాద్ టైగర్​ రిజర్వ్​ ఏరియాలో మంటలు వ్యాపించడం ఫారెస్ట్​ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది. లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతమైన రాంపూర్  చెంచుపెంట సమీపంలో గత ఏడాది ఫిబ్రవరిలో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో నాలుగు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.

చిగుర్ల లక్ష్మయ్య, నిమ్మల పాపయ్య, నిమ్మల బాలమ్మకు చెందిన మూడు గుడిసెలతో పాటు మినీ అంగన్​వాడీ సెంటర్  కాలిపోయింది. చెంచు కుంటుబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ఫిబ్రవరి 27న ఇక్కడే మంటలు చెలరేగి చిగుర్ల పెద్ద బయన్న గుడిసె కాలిపోయింది. ఇక అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లిన11 మంది చెంచులు మంటల్లో చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  

ఫారెస్ట్​ సిబ్బందికి సవాల్..

అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా, వాటిని ఎదుర్కోవడానికి ఫారెస్ట్​ అధికారులు, సిబ్బంది ఇంకా పాత పద్దతులనే పాటిస్తున్నారు. ఫైర్​ ఫైటింగ్​ ఎక్విప్​మెంట్స్, లైఫ్​ సేవింగ్​ కిట్స్, అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు అంబులెన్స్​లు కరువయ్యాయి. 2.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐదు జిల్లాల సరిహద్దుల గుండా విస్తరించింది. ఇందులో 1.75లక్షల హెక్టార్లను రాజీవ్​ టైగర్​ జోన్​గా గుర్తించారు.  

ఇంత విస్తీర్ణం ఉన్న అభయారణ్యంలో కార్చిచ్చును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సరైన యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గాలివాటానికి క్షణాల మీద విస్తరించే మంటలతో వాచర్లు, ఫీల్డ్​స్టాఫ్​ పోరాడుతున్నారు. మంటలు చెలరేగినప్పుడు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఏర్పాటు చేసిన ఫైర్​ లైన్స్ గాలి ఉధృతిని అడ్డుకోలేకపోతున్నాయి.

కంపా ఫండ్స్​ ఉన్నా ఫీల్డ్​ స్టాఫ్​ కొరతతో వాటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. క్విక్​ రెస్సాన్స్​ టీమ్స్​ పనిచేస్తున్నా నల్లమల్లలో మంటలు విస్తరించకుండా నిరోధించడంలో విఫలమవుతున్నాయి.  ఇదిలాఉంటే శ్రీశైలం వెళ్లే పర్యాటకులు అడవిలో హైవే పక్కన సిగరెట్లు కాల్చడం, వంటలు చేయకుండా అవగాహన కల్పిస్తున్నామని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. అడవిలో పశువుల కాపర్లు వేసుకుంటున్న చలి మంటలు కార్చిచ్చుకు కారణమవుతున్నాయని అంటున్నారు.