డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి

డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో  విషాదం జరిగింది. ఓ డ్రైనేజీ కాలువను శుభ్రం చేస్తూ ఐదుగురు వ్యక్తులు మరణించిన ఘటన జిల్లాలోని నందిగ్రామ్ లో జరిగింది. గ్రామంలోని కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న డ్రైనేజీని శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులు అందులోకి దిగారు. కాలువను శుభ్రం చేసే క్రమంలో అందులోని విషవాయువులను పీల్చుకొని, అపస్మారక స్థితిలో పడి విషపూరిత పొగలను పీల్చుకుని మరణించారు.

కాలువలోకి దిగిన వారు ఎంతసేపయినా బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం చెంది.. కాలువ సమీపంలోకి వెళ్లి చూడగా ఓ కార్మికుడు మరణించినట్టు గుర్తించారు. వెంటనే అతన్ని ఆ మురుగు నీటి నుంచి బయటకు తీశారు. ఈ విషయం గురించి పోలీసులకు , జిల్లా అధికారులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలికి చేరుకొని మిగిలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలన్నీ పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వివరాలు ఇంకా తెలియరాలేదు

ఈ ఏడాది జూలైలో కూడా  గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఒక హోటల్ మురుగునీటిని శుభ్రపరిచే సమయంలో నలుగురు పారిశుధ్య కార్మికులతో సహా ఏడుగురు మరణించారు. ఒక శానిటరీ కార్మికుడు సెప్టిక్ ట్యాంక్ నుండి తిరిగి రాకపోవడంతో, మరో ముగ్గురు సిబ్బంది అతనిని వెతకడానికి వెళ్ళి వారు తిరిగిరాలేదు. మరో ముగ్గురు హోటల్ సిబ్బంది కూడా వారికి సహాయం చేయడానికి లోపలికి వెళ్లి,  చివరకి వారు కూడా అపస్మారక స్థితిలో పడి మరణించారు.

నేషనల్ కమీషన్ ఫర్ సఫాయ్ కరంచారిస్ (NCSK) నివేదిక ప్రకారం 1993 నుండి 2019 జూలై 5 వరకు దేశంలో మురుగునీటిని శుభ్రపరిచే క్రమంలో 814 పారిశుధ్య కార్మికులు మరణించారని తెలిపింది. ఎక్కువ మరణాలు తమిళనాడు (206), గుజరాత్ (156) నుండి నమోదయ్యాయని ఆ నివేదిక లో తెలిపింది.