
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మధ్య నార్మల్ ఎయిర్ ట్రాఫిక్ ఆపరేషన్లు మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. అన్ని సివిల్, కమర్షియల్ ఫ్లైట్స్ తన గగనతలాన్ని(ఎయిర్‌స్పేస్) వాడుకునేందుకు అనుమతిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. బాలాకోట్ దాడుల తర్వాత.. అంటే సుమారు నాలుగున్నర నెలల కిందట పాకిస్తాన్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. పబ్లిష్ అయిన ఏటీఎస్( ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాలైన సివిల్ ట్రాఫిక్‌కు అనుమతిస్తూ ఎయిర్ స్పేస్‌ను రీ ఓపెన్ చేసినట్టు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్‌మెన్‌కు నోటీసు(నోటమ్) జారీచేసింది. పాకిస్తాన్ నిర్ణయం వెలువడిన వెంటనే మనదేశం కూడా రివైజ్డ్ ‘నోటమ్’ ఇష్యూ చేసింది. రెండు దేశాల మధ్య నార్మల్ ఎయిర్ ట్రాఫిక్ ఆపరేషన్లు ప్రారంభమైనట్టు కన్ఫర్మ్ చేసింది. పాక్ మూసేసిన ఆకాశ మార్గాల్లో విమానాలు బయల్దేరినట్టు మన సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. పాక్ నిర్ణయం విమానయాన సంస్థలు, పాసెంజర్లకు పెద్ద రిలీఫ్ అని ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ లో తెలిపింది. పాకిస్తాన్ చర్యతో యూఎస్, యూరప్ వెళ్లే ఫ్లైట్స్ ఆపరేషన్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. మంగళవారం రాత్రి నుంచే పాత షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు మొదలవుతాయన్నారు.
ఎందుకు మూతపడిందంటే?
ఈ ఏడాది ఫిబ్రవరి 14లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని జైషే మహ్మద్ టెర్రిస్టు ట్రైనింగ్ క్యాంప్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదే నెల 26న ఎటాక్ చేసింది. దాడిని నిరసిస్తూ పాకిస్తాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న తన ఎయిర్ స్పేస్‌ను మూసేసింది. 11 మార్గాల్లో కేవలం రెండు రూట్లను మాత్రమే ఓపెన్ చేసింది. బాలాకోట్ దాడుల తర్వాత ఇండియన్ ఎయిర్ స్పేస్‌పై టెంపరరీగా విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది మే 31న ప్రకటించింది.
పాకిస్తాన్ నిర్ణయం వెనుక..?
అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎయిర్ స్పేస్‌ను మూసేయడంతో మరింత నష్టపోయింది. రోజుకు సుమారు 400 విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. దీనివల్ల పాక్ రూ.16 బిలియన్లు నష్టపోయింది. రూట్ నేవిగేషన్, ఎయిర్ స్పేస్ వాడుకున్నందుకు, మెయింటెనెన్స్, రీఫ్యూయిలింగ్ కోసం ఫ్లైట్స్ లాండింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వేసే చార్జ్‌ల వల్ల పాకిస్తాన్‌కు మంచి ఆదాయం వస్తోంది. టర్మినల్ నేవిగేషన్, లాండింగ్ కోసం ఎయిర్ స్పేస్‌ను వాడుకున్నందుకు రెగ్యులర్ బోయింగ్ 737 పాసెంజర్ విమానం నుంచి పాకిస్తాన్ రోజుకు 600-–700 డాలర్లను వసూలుచేస్తుంది. ఇలా 400 ఫ్లైట్స్ ఎయిర్‌స్పేస్‌ను వాడుకుంటే గనక ఆదేశానికి రోజుకు3 లక్షల డాలర్లు ఆదాయం వస్తుంది. పాకిస్తాన్ ఏవియేషన్ సెక్టర్‌కు సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఆర్థికంగా నష్టపోవడాన్ని సీరియస్ తీసుకున్న పాక్ ఈమేరకు తన ఎయిర్‌స్పేస్ క్లోజర్ నిర్ణయంపై పునరాలించుకోవాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
మనకు నష్టమెంత?
పాక్ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల ఎయిర్ ఇండియా జులై రెండు నాటికి 491 కోట్లమేర నష్టపోయింది. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ 30.73 కోట్లు, ఇండిగో 25.1 కోట్లు, గోఎయిర్ 2.1 కోట్లు నష్టపోయాయి. సివిల్ ఏవియేషన్ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఈనెల మూడో తేదీన ఈ వివరాలను రాజ్యసభకు చెప్పారు. పాక్ చర్యల వల్ల ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన ఇండిగో.. ఢిల్లీ నుంచి ఇస్తాన్‌బుల్ డైరెక్ట్ ఫ్లయిట్‌ను నడపలేకపోయింది. ఈ ఏడాది మార్చిలోనే ఇండిగో ఈ సర్వీసు ప్రారంభించింది. పాక్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో అరేబియన్ సముద్రం మీదుగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడమేకాదు.. రీఫ్యూయిలింగ్ కోసం ఖతార్‌లోని దోహా ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి వచ్చేది.