జకార్తా: ఇండోనేసియా, శ్రీలంక, థాయ్ లాండ్‌లో గత వారం వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1230కు చేరుకుంది. 800 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ ప్రకృతి బీభత్సంతో ఇండోనేసియాలో 659 మంది, శ్రీలంకలో 390 మంది, థాయ్‌లాండ్‌లో 181 మంది మరణించారని మంగళవారం అధికారులు తెలిపారు.
గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టడానికి రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఇండోనేసియాలో రోడ్లు కొట్టుకుపోయి వంతెనలు కూలిపోయాయి. సుమత్రా ద్వీపంలోని గ్రామాలకు చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇండోనేసియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ప్రకారం 475 మంది తప్పిపోయారు.
