ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్ల వరద.. 5 నెలలు తరువాత మళ్లీ ఊపు

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్ల వరద.. 5 నెలలు తరువాత మళ్లీ  ఊపు
  • గత నెల 24శాతం పెరిగిన ఇన్​ఫ్లో 
  • రూ. 23,587 కోట్ల పెట్టుబడులు


న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​లోకి గత నెల నికర ఇన్​ఫ్లో (పెట్టుబడులు) 24 శాతం పెరిగి రూ. 23,587 కోట్లకు చేరుకుంది. దీంతో గత ఐదు నెలలుగా కొనసాగిన క్షీణతకు తెరపడింది. అన్ని విభాగాలలో ఈక్విటీ మార్కెట్ బలమైన పనితీరు దీనికి ప్రధాన కారణమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) బుధవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. 

ఈ సెగ్మెంట్లోకి పెట్టుబడిదారుల నుంచి నిధుల ప్రవాహం వరుసగా 52వ నెలలోనూ కొనసాగింది.  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్​) ఇన్​ఫ్లో కూడా జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ వృద్ధిని సాధించి రూ. 27,269 కోట్లకు చేరుకుంది. వీటిలోకి మే నెలలో రూ. 26,688 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ విషయమై మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది మాట్లాడుతూ, "రిటైల్ పెట్టుబడిదారులకు ఎంఎఫ్​లపై నమ్మకం తగ్గలేదు.  పెరుగుతున్న పెట్టుబడులే ఇందుకు రుజువు. ఇది ఎంఎఫ్​ పరిశ్రమకు,  భారతీయ మార్కెట్లకు చాలా ఆరోగ్యకరమైన  సానుకూల పరిణామం” అని అన్నారు.  

ఈక్విటీ- ఆధారిత మ్యూచువల్ ఫండ్స్​లోకి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 23,587 కోట్ల ఇన్​ఫ్లో ఉండగా, మేలో వచ్చిన రూ. 19,013 కోట్ల ఇన్​ఫ్లో కంటే ఇది చాలా ఎక్కువ. నికర ఈక్విటీ ఫండ్ ఇన్​ఫ్లోలో వరుసగా ఐదు నెలల తగ్గుదల తర్వాత ఇది మొదటి పెరుగుదల. నికర ఇన్​ఫ్లోలు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 41,156 కోట్ల నుంచి జనవరిలో రూ. 39,688 కోట్లకు, ఫిబ్రవరిలో రూ. 29,303 కోట్లకు, మార్చిలో రూ. 25,082 కోట్లకు,  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 24,269 కోట్లకు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. అయితే, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్​ఫ్లోలు రూ. 35,943 కోట్లుగా ఉన్నాయి. 

నిఫ్టీ 50 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెరుగుదల  మిడ్-  స్మాల్-క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మరింత బలమైన ర్యాలీ సహా బ్రాడ్​ మార్కెట్ లాభాలు ఈక్విటీ పెట్టుబడులలో ఆసక్తిని తిరిగి పెంచడానికి సహాయపడ్డాయని మార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రీసెర్చ్ ఇండియాలో అసోసియేట్ డైరెక్టర్  హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. పెట్టుబడిదారులకు మ్యూచువల్​ఫండ్స్​పై నమ్మకం తిరిగి వచ్చిందని  ఆయన వివరించారు. 

విభాగాల వారీగా...

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా ఈక్విటీ కేటగిరీలు బలమైన ఇన్​ఫ్లోను సాధించగా, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్​ఎస్​ఎస్​)లో మాత్రమే రూ. 556 కోట్ల ఔట్​ఫ్లో ఉంది. ఈక్విటీ ఫండ్ వర్గాలలో, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా రూ. 5,733 కోట్ల ఇన్​ఫ్లోలను ఆకర్షించాయి.  స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ. 4,024 కోట్లు)  మిడ్ క్యాప్ ఫండ్స్​లోకి (రూ. 3,754 కోట్లు) భారీగానే పెట్టుబడులు వచ్చాయి. 

లార్జ్ క్యాప్ ఫండ్స్​కు రూ. 1,694 కోట్ల పెట్టుబడులు అందాయి. మొత్తంగా, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 49 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్​మెంట్లు వచ్చాయి. ఇది మే నెలలో వచ్చిన రూ. 29 వేల కోట్ల కంటే ఎక్కువ. ఈ ఇన్​ఫ్లోతో పరిశ్రమ ఆస్తుల నిర్వహణ  (ఏయూఎం) విలువ మే చివరిలో రూ. 72.2 లక్షల కోట్ల నుంచి జూన్ నాటికి రికార్డు స్థాయిలో రూ. 74.4 లక్షల కోట్లకు పెరిగింది. 

ఈక్విటీలతో పాటు, హైబ్రిడ్ ఫండ్స్ జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 23,223 కోట్లతో ఇన్​ఫ్లోలో ఊపును కొనసాగించాయి. ఇది మునుపటి నెలలో వచ్చిన రూ. 20,765 కోట్ల కంటే ఎక్కువ. గోల్డ్ ఈటీఎఫ్​లకు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 2,081 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది జనవరి నుంచి అత్యధిక నెలవారీ ఇన్​ఫ్లో.  మేలో రూ. 292 కోట్ల ఇన్​ఫ్లోతో పోలిస్తే  భారీ పెరుగుదల.  డెట్ ఫండ్స్ నుంచి జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 1,711 కోట్ల ఔట్​ఫ్లో ఉంది.