
అప్పటివరకు తోటి ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఆడాడు. ఛాతీలో నొప్పిగా ఉందని రెఫరీకి చెప్పి కూలబడ్డాడు. అంతలోనే విషాదం. ఫుట్‌బాల్ ఆడుతూ ఆట మధ్యలో గ్రౌండ్‌లోనే ఓ ఆటగాడు చనిపోయన ఘటన కేరళలో జరిగింది. తూర్పు బెంగాల్ మాజీ ఆటగాడు, మోహున్ బాగన్ అథ్లెటిక్ క్లబ్ డిఫెండర్ ఆర్ ధనరాజన్(39) ఆదివారం రాత్రి మ్యాచ్ ఆడుతూ కుప్పకూలి గ్రౌండ్‌లోనే మరణించాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్‌మన్నలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
పెరింతల్‌మన్నలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా నెహ్రూ స్టేడియంలో పెరింతల్‌మన్నఫుట్‌బాల్ క్లబ్ మరియు శాస్తా మెడికల్స్ త్రిస్సూర్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆదివారం రాత్రి 9 గంటలకు మ్యాచ్ మొదటి సగం ముగిసే సమయానికి, ధనరాజన్ కొన్ని నిమిషాలు ఆటను ఆపాలని రెఫరీని కోరాడు. ఆ తర్వాత కాసేపటికే ధనరాజన్ ఛాతీ నొప్పి కలుగుతుందని ఫిర్యాదు చేసి కుప్పకూలిపోయాడు. స్టేడియం స్టాండ్‌బైలో ఉన్న వైద్యలు ధనరాజన్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ధనరాజన్ మరణించారని నిర్వాహకుల్లో ఒకరైన అబ్దుల్ అజీజ్ తెలిపారు. అనంతరం అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారు.
ధనరాజన్ గత ఏడు సంవత్సరాలుగా సెవెన్స్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. గతంలో ధనరాజన్ సంతోష్ ట్రోఫీ టోర్నమెంట్‌లో కేరళ తరఫున కూడా ఆడాడు. మోహున్ బాగన్, తూర్పు బెంగాల్, వివా కేరళ మరియు చిరాగ్ యునైటెడ్ వంటి పెద్ద పెద్ద క్లబ్‌ల తరపున ధనరాజన్ మ్యాచులు ఆడాడు. అంతేకాకుండా, 2014లో మంజేరిలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో మహమ్మదీయన్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ధనరాజన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధన్‌రాజన్ మొదట డివిజన్ క్లబ్‌లలో ఫుట్‌బాల్ ఆడుతూ తన వృత్తిని ప్రారంభించాడు. 2010లో మోహన్ బాగన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఎంపికయ్యాడు. పాలక్కాడ్‌లోని కొట్టేక్కాడ్‌కు చెందిన ధన్‌రాజన్.. దివంగత రాధాకృష్ణన్, మారి దంపతుల కుమారుడు. ఆయనకు భార్య అర్చన, కుమార్తె శివానీ ఉన్నారు.
For More News..