
మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్ గొత్తికోయ ఆవాసాలను శుక్రవారం ఫారెస్ట్ ఆఫీసర్లు కూల్చివేశారు. అడవిని నరికి కొత్తగా పోడు చేయడంతో పాటు గుడిసెలు నిర్మించుకుంటున్నారంటూ.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది శాంతినగర్‌కు చేరుకొని గుడిసెలను ధ్వంసం చేశారు.
కూల్చివేతను సోయం సురేశ్ అనే యువకుడు ఫొటోలు తీయడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అతడి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. దీంతో సురేశ్ తన ఫోన్ ఇవ్వాలని, గుడిసెల కూల్చివేత ఆపాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంత సేపటి తర్వాత పురుగుల మందు డబ్బాతో వచ్చిన సురేశ్.. తాను పురుగుల మందు తాగానని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్‌పై దాడికి యత్నించాడు.
గమనించిన ఫారెస్ట్ సిబ్బంది అతడిని పక్కకు లాగేయడంతో ఆఫీసర్ల జీప్‌కు అడ్డంగా పడుకొని ఆందోళనకు దిగాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్లిపోతుండగా.. కొంత దూరం వారిని వెంబడించిన సురేశ్ శాంతినగర్ సమీపంలోని సండ్రోని ఒర్రె వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతడిని స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు, అక్కడి నుంచి ఏటూరునాగారం, అటు నుంచి ములుగు జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు తరలించారు.
అటవీ విధ్వంసానికి పాల్పడుతున్నందునే చర్యలు : ఫారెస్ట్ ఆఫీసర్లు
శాంతినగర్‌లోని గుత్తికోయలు కొత్తగా పోడు చేస్తూ, అటవీ విధ్వంసానికి పాల్పడుతున్నందునే చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ ఆఫీసర్లు అశోక్, కోటేశ్వరరావు చెప్పారు. గతంలో పోడు చేసి నిర్మించుకున్న ఇండ్లలో ఉండకుండా కొత్తగా 18 హెక్టార్ల అడవిని ధ్వంసం చేశారన్నారు. అందుకే వారి గుడిసెలను కూల్చివేశామని చెప్పారు.