భారత క్రికెట్‌లో విషాదం.. గుండెపోటుతో మాజీ ఆటగాడు మృతి

భారత క్రికెట్‌లో విషాదం.. గుండెపోటుతో మాజీ ఆటగాడు మృతి

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేరళ మాజీ కెప్టెన్‌, కెసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె జయరామన్(67) గుండెపోటుతో కన్నుమూశారు. కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి క్రికెట్‌ అభిమానులు, పలువురు మాజీ దిగ్గజ క్రికెటర్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్న భారత ఆటగాళ్లలో జయరామన్ ఒకరు. 1980లలో కేరళ జట్టులో కీలక ఆటగాడిగా పేరొందిన ఆయన ..1986-87లో రంజీ సీజన్ లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. తద్వారా జాతీయ జట్టులో చోటుదక్కుతుంది అనుకున్నప్పటికీ..  దురదృష్టవశాత్తూ ఆయనకుఆ అవకాశం రాలేదు. జయరామన్ కేరళ సీనియర్, జూనియర్ జట్లకు కెప్టెన్‌గా కూడా పనిచేశారు. తన కెరీర్‌లో 46 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జయరామన్ 29.47 సగటుతో 2,358 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి.

అనంతరం దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జయరామన్ కొన్నేళ్ల పాటు కేరళ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. అదే విధంగా అండర్‌-22, అండర్‌-25 జట్లకు చీఫ్ సెలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2010లో బీసీసీఐ మ్యాచ్‌ రిఫరీగా కూడా జయరామన్ పనిచేశారు. 

ఎర్నాకులంకు చెందిన జయరామన్‌కు భార్య రామ జయరామన్, కుమారుడు అభయ్ జయరామన్ ఉన్నారు.