
- నిజామాబాద్ జిల్లా పెర్కిట్ బైపాస్ వద్ద ప్రమాదం
- మరో మూడు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఆర్మూర్, వెలుగు : బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ బైపాస్ వద్ద ఆదివారం జరిగింది. సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్మూర్ పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన బంజ విశ్వనాథ్ తన కొడుకు ఓంకార్ (13), అతడి ఫ్రెండ్ ఎండ్రికాయ భానుప్రసాద్ (13)తో కలిసి బైక్‌పై పెర్కిట్ శివారులోని ఫంక్షన్‌హాల్‌లో జరిగిన పెండ్లికి హాజరయ్యాడు.
తిరిగి ఆర్మూర్ వస్తున్న క్రమంలో పెర్కిట్ బైపాస్ వద్దకు రాగానే నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓంకార్, భానుప్రసాద్ అక్కడికక్కడే చనిపోగా విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు విశ్వనాథ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఓంకార్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.
కారు ఢీకొని మూడేండ్ల బాలుడు మృతి
గోదావరిఖని, వెలుగు : కారు ఢీకొని చిన్నారి చనిపోయిన ఘటన గోదావరి పట్టణంలోని గంగానగర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని నియోజకవర్గంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్‌టీయూలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య సంధ్యకు ఇటీవల పాప పుట్టడంతో ఆమె కొడుకు శివరాజ్‌కుమార్ (3)తో కలిసి గోదావరిఖని గంగానగర్‌లోని తల్లిగారింటి వద్ద ఉంటోంది.
ఆదివారం ఉదయం శివరాజ్‌కుమార్ ఇంట్లో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో మంచిర్యాల వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టి, బాలుడి పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని మొదట ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి..
సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి బస్టాప్ వద్ద శనివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. హత్నూర ఎస్సై సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర గ్రామానికి చెందిన నింగన్నగారి దశరథ (57), అదే గ్రామానికి చెందిన జంగ సువర్ణ దౌల్తాబాద్‌లో పనికి వచ్చారు.
అక్కడ పని ముగిసిన తర్వాత బైక్‌పై ఇంటికి వెళ్తూ దేవులపల్లి బస్టాప్ వద్దకు రాగానే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన శ్రీశైలం బైక్‌పై ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. దశరథ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మిగతా ఇద్దరూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
బైక్‌కు మంటలు.. యువకుడు మృతి
వంగూర్, వెలుగు : బైక్‌కు మంటలు అంటుకొని ఓ యువకుడు చనిపోగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మెహిదీపట్నంకు చెందిన జువేద్ (32), ఇమ్రాన్ కలిసి బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. మార్గమధ్యలో వంగూర్ గేటు సమీపంలోకి రాగానే బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో జువేద్ అక్కడికక్కడే చనిపోగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఇమ్రాన్‌లో అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు మహేందర్ తెలిపారు.