పక్కా ప్లాన్​ ప్రకారమే.. పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతిపెట్టిన్రు : డైరెక్టర్ శాంతారాం

పక్కా ప్లాన్​ ప్రకారమే.. పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతిపెట్టిన్రు : డైరెక్టర్ శాంతారాం
  • కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి
  • దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినం
  • నలుగురిని అదుపులోకి తీసుకున్నం.. నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని వెల్లడి

ఆసిఫాబాద్ / కాగ జ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ రేంజ్ నల్లకుంట వద్ద పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నామని కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతా రాం,ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. మంగళవారం శాంతారాం, నీరజ్​కుమార్​తో కలిసి కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ లో ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 14న రాత్రి 10 గంటలకు పెద్దపులి కరెంట్ షాక్​కు గురై చనిపోయిందని, దాన్ని ఏడేండ్ల వయసున్న ఆడ పులిగా గుర్తించామని చెప్పారు. ఘటనకు ముందు కే8 అనే పెద్దపులి బెజ్జూర్‌‌ మండలంలో కెమెరాకు చిక్కిందని, ఆ తర్వాత అది కనిపించలేదని అన్నారు.  పక్కా ప్లాన్​ ప్రకారమే వేటగాళ్లు కరెంట్​ తీగలు అమర్చడంతో షాక్ తగిలి పెద్దపులి ఈనెల 14న చనిపోయిందని తెలిపారు. 

ఈ విషయం తెలుసుకుని వేటగాళ్లు 15న అక్కడికొచ్చారని, పులి మృతదేహాన్ని 300 మీటర్ల దూరంలోని చిన్న వాగు దగ్గరకు తరలించారని చెప్పారు. వాగు దగ్గరే పులి చర్మం, గోళ్లు, దంతాలు , దవడలు తీశారని వివరించారు. పులి డెడ్​బాడీని అక్కడే పాతి పెట్టిన నిందితులు .. దాని గోళ్లు, చర్మం, దంతాలు మరోచోట పాతిపెట్టి పారిపోయారని తెలిపారు. ఈ ఘటనపై 3 బృందాలతో విచారణ చేపట్టామని, దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద వేటగాళ్లు పాతి పెట్టిన చర్మం, గోళ్లను సోమవారం రికవరీ చేశామని తెలిపారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పులిని చంపింది పాత నేరస్తులేనని, కనీసం 15 మంది ఈ కేసులో ఉన్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. 

ఎక్కడా సిబ్బంది నిర్లక్యం లేదు 

కరెంట్​ తీగలు తగిలి పులి చనిపోయిన ఘటనలో ఫారెస్ట్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదని, ఎవరి మీదా యాక్షన్​ తీసుకోవడంలేదని శాంతా రాం, నీరజ్ కుమార్ టిబ్రెవాల్ వెల్లడించారు. కాగజ్ నగర్ డివిజన్ లో పులుల రక్షణకు సంబంధించి ఏడాదిగా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు.  మంచిర్యాల సర్కిల్ అఫీస్ లో టైగర్ రిజర్వ్ కు సంబంధించి పులుల ట్రాకింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ప్రతి పులి కదలికల సమాచారం అందుతుందని చెప్పారు. 

జిల్లాలో 300 కిలో మీటర్ల ఇల్లీగల్ కరెంటు లైన్ 

 ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 300 కిలోమీటర్ల మేర ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు వేశారని, ఈ లైన్లు కచ్చితంగా తొలగిస్తామని శాంతా రాం, నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. విద్యుత్ లైన్లు వేసేటప్పుడే అటవీ శాఖ అనుమతి నిరాకరించిందని చెప్పారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఈ కరెంటు తీగలు తొలగించాలని లేఖ రాసినా.. విద్యుత్​ శాఖ స్పందించలేదన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు, స్తంభాలు వేసిన వాళ్ల మీద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమంగా లైన్లు వేయడంవల్లనే వన్యప్రాణులు బలవుతున్నాయని తెలిపారు.

మహారాష్ట్ర వేటగాళ్ల ప్రమేయం..

ఈ ఘటనలో మహారాష్ట్ర కు చెందిన వేటగాళ్ల ప్రమేయం కూడాఉన్నట్టు సమాచారం వస్తున్నదని శాంతారాం, నీరజ్​కుమార్ తెలిపారు. వేటగాళ్ల నేర చరిత్ర తెలుసుకుంటామని, వారికి ఇతర రాష్ట్రాల వేటగాళ్లతో సంబంధాలున్నాయా? అన్నది తెలుసుకునేందుకు జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ విచారణ బృందాలకు వివరాలు షేర్​ చేస్తామని చెప్పారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని వెల్లడించారు. 

విచారణ ఇంకా కొనసాగుతున్నందున నిందితుల వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు. ఈ ఘటన రెవెన్యూ ఏరియాలో జరిగిందని, తాము కేవలం ఫారెస్ట్ కేసు మాత్రమే నమోదు చేశామని, హత్య, ఇతర నేరాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలిపారు.  విచారణలో కీలకంగా పనిచేసిన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, పెంచికల్ పేట్ అటవీ సిబ్బందిని అభినందించారు. వీరితో పాటు చెన్నై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ జై ప్రకాశ్​, వెటర్నరీ డాక్టర్ రాకేశ్​, ఎఫ్ఆర్ వో అనిల్ కుమార్, ఫీల్డ్ బయాలజిస్ట్ ఎల్లం ఉన్నారు.