స్మార్ట్​ఫోన్​ పేలి నలుగురు పిల్లలు మృతి

స్మార్ట్​ఫోన్​ పేలి నలుగురు పిల్లలు మృతి
  •  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన

మీరట్‌: చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ముజఫర్‌‌ నగర్‌‌కు చెందిన జానీ తన కుటుంబంతో కలిసి మీరట్‌లోని జనతా కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం హోలీ పండుగ సందర్భంగా జానీ భార్య బబిత కిచెన్‌లో వంట చేస్తుండగా, వారి పిల్లలు సారిక (10), నిహారిక (8), కుమారులు గోలు (6), కలు (5) మరో రూమ్‌లో ఆడుకుంటున్నారు. 

అదే రూమ్‌లో జానీ తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాడు. ఈ క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మొబైల్‌ ఫోన్‌ పేలి, నిప్పు రవ్వలు పక్కనే ఉన్న బెడ్‌పై పడ్డాయి. దీంతో రూమ్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చి, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆ నలుగురు చిన్నారులు మృతి చెందారు. పిల్లలను కాపాడే క్రమంలో తల్లిదండ్రులు జానీ, బబితకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.