
గుంటూరు జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంతోషంగా పెళ్లికి వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తుండగా… మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా.. ఈ ఘోరం జరిగింది.
చుండూరు మండలం మాలపల్లి నుంచి 50 మంది ట్రాక్టర్ లో పెళ్లికి వెళ్లారు. తెనాలిలో జరిగిన పెళ్లి చూసుకుని.. అంతా ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. మండలంలోని చింతపల్లి గ్రామం సమీపంలోని అంబేద్కర్ నగర్ వద్ద మలుపు తిరుగుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ లో మొత్తం 50 మంది ఉండగా వారిలో చాలా మందికి గాయాలయ్యాయి. ఘటనను గమనించి పొలాల్లో ఉన్నవాళ్లు, స్థానికులు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు.