తెలంగాణ నూతన కేబినెట్​లో నలుగురు రెడ్లు

తెలంగాణ నూతన కేబినెట్​లో నలుగురు రెడ్లు
  • ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు
  •     బ్రాహ్మణ, వెలమ, కమ్మ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు
  •     ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురికి పదవులు
  •     ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్​ జిల్లాల నుంచి ఇద్దరిద్దరికి అవకాశం

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గంలో సీఎం సహా నలుగురు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు... బ్రాహ్మణ, వెలమ, కమ్మ, ఎస్టీ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్ తో పాటు మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్ రెడ్డి ఉన్నారు. 

ఎస్సీ కేటగిరీలో మల్లు భట్టి విక్రమార్క(డిప్యూటీ సీఎం), దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు. బీసీల్లో నుంచి పొన్నం ప్రభాకర్ (గౌడ్), కొండా సురేఖ (పద్మశాలి) ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో సీతక్క, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు, కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజికవర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు చాన్స్ ఇచ్చారు. 

ఆరు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం..  

మంత్రివర్గంలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. వీరిలో మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్​(పొన్నం ప్రభాకర్, శ్రీధర్​బాబు), ఉమ్మడి వరంగల్​(కొండా సురేఖ, సీతక్క), ఉమ్మడి నల్గొండ (ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రివర్గంలో చోటిచ్చారు.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్​తో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ ​నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ ​కుమార్​కు స్పీకర్​గా అవకాశం ఇచ్చారు.