అనాథ బాలికలపై  అయినవాళ్ల అకృత్యాలు

అనాథ బాలికలపై  అయినవాళ్ల అకృత్యాలు

నల్గొండ జిల్లా నకిరేకల్​కు చెందిన 16 ఏళ్ల బాలిక చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి బాబాయి వద్దే ఉంటోంది. ఇటీవల నల్గొండలోని వాళ్ల పెద్దమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ వరుసకు అన్న అయ్యే వ్యక్తి ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  మరోకేసులో సొంత మేనమామ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గడిచిన మే నెలలో ఒక్క నల్గొండ జిల్లాలోనే ఇలా ఏడుగురు అనాథ బాలికలపై అయినవాళ్లే అకృత్యాలకు పాల్పడ్డారు. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. బయటకు రానివి ఎన్నో.

నల్గొండ, వెలుగు: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. బంధువుల ఇళ్లలో తలదాచుకుందామంటే అయినవాళ్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గతంతో పోలిస్తే కొవిడ్ కాలంలో  మైనర్లపై ఆకృత్యాలు పెరిగిపోవడం అధికారులకు సవాల్​గా మారింది. అనాథలకు రక్షణ కల్పించే చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్లకు, సఖి కేంద్రాలకు ఇటీవల కాలంలో వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా లైంగిక వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి.  

అనాథల్లో బాలికలే టాప్..

కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లల కోసం ఇటీవల సర్వే చేపట్టిన  చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు, పనిలో పనిగా ఇతర కారణాలతో అనాథలైన పిల్లల వివరాలను కూడా సేకరించారు.  ఈ సందర్భంగా  33 జిల్లాలో కలిపి 12,082 మంది అనాథలు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఇందులోనూ బాలురతో పోలిస్తే అనాథ బాలికలే ఎక్కువ ఉన్నారు. 5,726 మంది బాలురు ఉంటే, 6,356 మంది బాలికలు ఉన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 766 మంది అనాథలు ఉండగా,  650 మందితో వికారాబాద్​, 624 మందితో నల్గొండ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ పిల్లల్లో చాలా మంది బంధువుల ఇళ్లలో భయంభయంగా బతుకుతున్నారు. అయినవాళ్ల నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండడంతో వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఆఫీసర్లకు తెలియడం లేదు. 

హోమ్​లలో సౌలత్ ల్లేవ్​.. 

అనాథలైన ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్లు, సఖి కేంద్రాలు, స్వధార్ పేరిట హోమ్స్ నిర్వహిస్తోంది. వీటితోపాటు ఉమన్ అండ్ చైల్డ్​వెల్ఫేర్​సపోర్ట్​తో నడుస్తున్న ఉజ్వల లాంటి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికంగా షెల్టర్ కల్పించే సంస్థలు మాత్రమే. లైంగిక వేధింపులతో నష్టపోతున్న బాలికలకు ఇవన్నీ కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి. ఆకృత్యాలకు పాల్పడ్డ వాళ్లపై ప్రివెన్షన్​ఆఫ్ ​చిల్డ్రన్ ​ఫ్రమ్ ​సెక్సువల్​అఫెన్సెస్(పోక్సో) యాక్ట్ కింద కేసులు పెట్టి ఆఫీసర్లు కూడా చేతులు దులిపేసుకుంటున్నారు. 

బంధువుల వద్ద రక్షణ ఉందా? 

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు స్టేట్​వైడ్​199 మంది ఉన్నట్లు  చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ లెక్కతేల్చింది. వీళ్లలో కొందరికి ఆయా జిల్లాల్లోని బాలల సహాయ కేంద్రాల్లో షెల్టర్ కల్పించారు. మరికొందరు సమీప బంధువుల వద్ద ఉంచారు. అయితే బంధువుల సంరక్షణలో ఉంటున్న పిల్లల విషయంలో ప్రభుత్వపరంగా పర్యవేక్షణ అన్నది లేకుండా పోయింది. దాంతో అలాంటి పిల్లలు కొందరు లైంగిక దాడికి గురవుతున్నారు. వీరిని హోమ్స్​కు తరలిద్దామంటే అక్కడ సరైన ఫెసిలిటీస్​ లేవు. అలాగని తాత్కాలిక షెల్టర్లలో కొంత కాలం ఉంచినా తిరిగి వెనక్కి పంపాల్సిందే. అలాకాకుండా శాశ్వత ప్రాతిపదికన షెల్టర్​ ఇవ్వడం గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి గైడ్​లైన్స్​ రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో అనాథ బాలికల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇటీవలి సర్వేలో జిల్లాల వారీగా గుర్తించిన అనాథల వివరాలు ఇవీ

జిల్లాపేరు                                  అనాథల సంఖ్య

ఆదిలాబాద్                               385
ఆసిఫాబాద్                               361
మంచిర్యాల                              225
నిర్మల్                                     231
నిజామాబాద్                            503
జగిత్యాల                                  448
పెద్దపల్లి                                    242
జయశంకర్​భూపాలపల్లి             145
భద్రాద్రి కొత్తగూడెం                     419
మహబూబాబాద్                      186
వరంగల్ రూరల్                       216
వరంగల్ అర్బన్                      189
కరీంనగర్                                275
సిరిసిల్ల                                  132
కామారెడ్డి                               563
సంగారెడ్డి                                502
మెదక్                                    300
సిద్దిపేట                                  404
జనగాం                                  182
యాదాద్రి భువనగిరి                 467
మేడ్చల్                                 311
హైదరాబాద్                            362
రంగారెడ్డి                                766
వికారాబాద్                             650
మహబూబ్​నగర్                     396
జోగులాంబ గద్వాల                 264
వనపర్తి                                  286
నాగర్​కర్నూల్                         373
నల్గొండ                                   624
సూర్యాపేట                              503
ఖమ్మం                                   582
ములుగు                                  91
నారాయణపేట                          499