
రంగులు ఎమోషన్స్‌ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బాధగా ఉన్నప్పుడు కొన్ని రంగుల్ని చూస్తే మనసు కాస్త కుదుటపడుతుంది. కానీ, ఆ ఊళ్లో రంగులు ప్రజల మనసుల్లో ఉన్న బాధల్ని తీసేయడంతోపాటు బతుకుదెరువును కూడా చూపించాయి. ఊరికి రంగులు వేస్తే అవి ఆ ఊరి ప్రజల జీవితాల్లో రంగులు నింపాయి. ఆ ఊరి పేరే ‘రెయిన్ బో విలేజ్’.
ఒకప్పుడు మురికివాడలో బతికిన ఆ ఊరు.. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. కనీస వసతులు లేక అల్లాడిన ఆ ఊరి ప్రజలు, ప్రస్తుతం టూరిస్ట్‌లకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఒకరి ఆలోచన ఆ ఊరి ప్రజల రాతనే మార్చేసింది.
అది ఇండోనేసియాలోని ‘జావా’ ఐలాండ్. అక్కడ కాంపుంగ్ పెలాంగి అనే ఒక చిన్న గ్రామం ఉంది. అసలు పేరుకంటే ‘రెయిన్బో విలేజ్’గానే పాపులర్ అయింది. ఆ గ్రామంలో దాదాపు 200కు పైగా ఇండ్లు ఉంటాయి. కానీ, ఒకప్పుడు ఆ కొద్ది జనానికి కూడా కనీస వసతులు లేవు. ఇండ్లు పాతబడిపోయి, సగం కూలిపోయి ఉండేవి. రకరకాల చెత్త అంతా డ్రైనేజీలోనే కలుస్తుంది. దానివల్ల ఎన్నోసార్లు అనారోగ్యాల బారిన పడేవాళ్లు. అంత అధ్వాన పరిస్థితిలో ఉన్నా, ఆ ఊరి వాళ్లు తమ పిల్లల్ని చదివించేవాళ్లు. అందుకనే ఆ ఊళ్లో చదువుకున్నవాళ్లు ఉన్నారు. అయితే, వాళ్ల సంపాదన వాళ్లకే సరిపోయేది. దాంతో తమ ఇంటిని లేదా ఊరిని బాగు చేసుకుందామనే ఆలోచన చేయడానికి ధైర్యం సరిపోయేది కాదు.
మాస్టారు మార్చారు..
ఎవరూ ఊహించని విధంగా ఆ ఊరిని మార్చేసింది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ ఊరిని చూస్తే హరివిల్లు నేల మీద విరిసిందా అనిపిస్తుంది. అక్కడి వాళ్ల ఇల్లు, వస్తువులు, షాపులు అన్నీ రంగులమయమే. దీనికి కారణం ఒక స్కూల్ ప్రిన్సిపల్‌కి వచ్చిన ఆలోచన. అదే ఊళ్లో స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేసేవాడు స్లామెట్ విడొడొ. ఆయనకి వచ్చిన ఆలోచన చాలా చిన్నది. కానీ, దాని వల్ల జరిగిన మార్పు వందల మంది జీవితాలను మార్చేసింది. అయితే... ఆలోచన చేయడానికి ఖర్చు ఉండదు. కానీ, దాన్ని అమలు చేయాలంటే మాత్రం చాలా డబ్బు కావాలి. నలుగురూ కలిసి పనిచేయాలి. అప్పుడే మార్పు సాధ్యం అవుతుంది. అందులోనూ ఆ ఊరి వాళ్లు ఎక్కడా వెనకడుగు వేయలేదు. మాస్టారుకి తోడుగా నిలిచి, పని పూర్తి చేశారు. స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్, ఊళ్లో కొందరు వ్యక్తులు అంతా పెయింట్ డబ్బాలు, బ్రష్‌లు పట్టుకున్నారు. ఊరంతా తిరిగి ప్రతి ఇంటికి, చోటుకి రంగులు వేశారు. హరివిల్లు రంగులతో పాటు అద్భుతమైన పెయింటింగ్స్ కూడా వేశారు. గోడలకే కాదు, రోడ్డు మీద కూడా రంగులద్దారు. ఇప్పుడు ఎటు చూసినా రంగులే రంగులు.
మార్పుకు ప్రభుత్వం సైతం..
ఇదంతా చేయడానికి డబ్బు ఎలా వచ్చిందంటే.. వాళ్ల పరిస్థితిని గవర్నమెంట్‌కి చెప్పి సాయం అడిగారు. దాంతో ప్రభుత్వం ముందుకొచ్చి దాదాపు 20 వేల డాలర్లు ఇచ్చింది. రంగులే కాదు, ఆ ఊళ్లో ఇండ్లు, పైకప్పులు, బ్రిడ్జ్‌లు వంటి కావాల్సిన వసతులన్నీ ఇవ్వమని ఆదేశాలిచ్చింది. మురికివాడని రంగులతో కొత్త ఊరిలా మార్చేయాలి అని చెప్పింది. ఇంకేముంది.. ఆదేశాలు అమలు చేయడం మొదలైంది. ఆలోచన ఆచరణలోకి వచ్చింది. కళ్లముందే అద్భుతం జరిగిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల ఆ ఊళ్లో షాపులు, హోటల్స్ వెలిశాయి. లోకల్ బిజినెస్‌లతో పాటు ట్రాన్స్పోర్ట్, మొబిలిటీ, షిఫ్టింగ్, భూముల అమ్మకం వంటివి పెరిగాయి. అంతేకాదు టూరిస్ట్‌ల కోసం రోడ్‌మ్యాప్ ఉంది.
టూరిస్ట్‌లు అక్కడి వాళ్లతో కమ్యూనికేట్ అవ్వడం... అలా సోషల్‌గా, ఎకనామికల్‌గా డెవలప్ అయింది రెయిన్బో విలేజ్. ఫ్యూచర్ జనరేషన్‌కి పెద్ద భరోసానిచ్చింది. ఈ గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఇలా చేయడం వల్ల డెవలప్మెంట్ జరుగుతుందా? అసలు ఇలా చేయడానికి ఎంత టైం పడుతుంది? వంటి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఆ గ్రామాలు. అందులో ఆ గ్రామాలు కూడా సక్సెస్ అయ్యాయి. వాటిలో యోగ్యకర్తాలో ఉన్న కాంపుంగ్ కాళికోడ్, మలంగ్, త్రిది, జోడిపన్ వంటివి ఇప్పుడు రంగులతో కళకళలాడుతున్నాయి. మారుమూల ఉన్న ఆ గ్రామాలను వెతుక్కుంటూ ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్‌లు వస్తున్నారు. మార్పు అనే మాటకు అసలైన అర్థాన్ని ఆ ఊళ్లు చాటి చెప్తున్నాయి.