
బిజినెస్ డెస్క్, వెలుగు: మెడికల్ డివైజస్ ఇండస్ట్రీ.. ఇప్పుడు ఇండియాలో ఓ వెలుగు వెలుగుతోంది. కరోనా మహమ్మారి ముందు వరకు మెడికల్ డివైజ్‌ల కంపెనీలు ఇండియాలో చాలా తక్కువ. అసలు పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్‌మెంట్(పీపీఈ) కిట్స్, క్లినికల్ థెర్మోమీటర్స్ తయారు చేసే కంపెనీలు ఒక్కటి కూడా లేవు. కరోనా మహమ్మారితో పీపీఈ కిట్స్, టెస్టింగ్ కిట్స్, క్లినికల్ థర్మోమీటర్స్, గ్లోవ్స్, ఎన్–95 మాస్క్‌లు, ఆక్సిజన్ మాస్క్‌లు, వెంటిలేటర్లు తయారు చేయడం పెద్ద సవాలుగా మారింది. వీటి కొరత కూడా ఏర్పడింది. గత ఆరేళ్లలో 10 వేల వెంటిలేటర్స్ అమ్ముడుపోతే.. వాటిలో కేవలం వెయ్యి మాత్రమే మేడిన్ ఇండియావి ఉండేవని ఇండియన్ వెంటిలేటర్ మాన్యుఫాక్చరర్స్ డేటా చెబుతోంది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్‌గా కరోనా మహమ్మారి మన దేశంలోకి ఎంటర్ కాక ముందు.. ఇండియన్ మెడికల్ డివైజ్‌లు, బయోమెడికల్ కంపెనీలు రీసెర్చ్‌లపై అత్యధికంగా ఇన్వెస్ట్ చేయాలని, డివైజ్‌ల తయారీ పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలోనే వైరస్ దేశంలోకి ఎంటరయ్యింది. ఈ మహమ్మారి మెడ్ టెక్ స్పేస్‌లోని చిన్న, మధ్య తరహా కంపెనీలకు అద్భుతమైన అవకాశాలను అందించింది. 2020 సెప్టెంబర్ నాటికి ఇండియాలో 1,100 మంది లోకల్ పీపీఈ కిట్స్ మాన్యుఫాక్చరర్స్ పుట్టుకొచ్చారు. ఈ నెంబర్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. వెంటిలేటర్ కంపెనీలు తయారీ కోసం ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ వరకు రెండింతలు పెరిగాయి. అప్పుడు 8 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరింది. నాన్ కరోనా మెడికల్ డివైజ్‌ల సేల్స్ తగ్గినప్పటికీ, మెడికల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్‌పై ఫోకస్ బాగా పెరిగిందని ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ చెప్పారు. బెంగళూరులో స్టెంట్స్, కాథ్ ల్యాబ్స్ తయారు చేసే ఇన్నోవేషన్ ఇమేజింగ్ టెక్నాలజీస్(ఐఐటీపీఎల్) కూడా వెంటిలేటర్స్ తయారు చేస్తోంది. మైసూరుకు చెందిన స్కాన్‌రే టెక్నాలజీస్ అత్యంత తక్కువ టైమ్‌లోనే లక్ష వెంటిలేటర్స్ తయారు చేసి ఇస్తానని ప్రకటించింది.
వార్షికంగా 12–15 శాతం వృద్ధి…
ఇండియన్ మెడికల్ డివైజస్ ఇండస్ట్రీలో 1,200 మంది మెడికల్ డివైజ్ మేకర్స్ ఉన్నారు. కొంతమంది మాత్రమే లోతుగా విశ్లేషణ చేసి, ఇనోవేటివ్ డిజైన్లను మార్కెట్‌లోకి తెస్తున్నారు. మిగిలిన వారు కాంపోనెంట్లను ఇంపోర్ట్ చేసుకుని, వాటిని అసెంబుల్ చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ డివైజస్ ఇండస్ట్రీ వాల్యు రూ.38,159 కోట్లు(5.2 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఇవి వార్షికంగా 12 శాతం నుంచి 15 శాతం పెరుగుతుంది. ఏఐఎంఈడీ డేటా ప్రకారం 90 శాతం మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకునేవే ఉన్నాయి. 75 శాతం హాస్పిటల్ ఎక్విప్‌మెంట్, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, డయాగ్నోస్టిక్ రీఏజెంట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్‌లో అమ్మే చాలా డివైజ్‌లు అమెరికా, జర్మనీ, చైనా, సింగపూర్, నెదర్లాండ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన దేశ కంపెనీలకు అద్భుతమైన అవకాశంగా ఉంది. అయితే రెగ్యులేటరీ సమస్యలు, పాలసీ విధానాలు కాస్త ప్రతికూలంగా ఉన్నట్టు కొందరు డివైజ్ మేకర్స్ చెబుతున్నారు. క్యాపిటల్, మార్కెట్ యాక్సస్ ఇండియన్ కంపెనీలకు పెద్ద సమస్యగా ఉన్నట్టు బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందర్ షా అన్నారు. మేడిన్ ఇండియా ట్యాగ్‌తో చౌక చైనీస్ ప్రొడక్ట్‌లు అమ్మే కొంతమంది ప్లేయర్స్ నుంచి బెదిరింపులు వస్తున్నట్టు లోకల్ మాన్యుఫాక్చరర్స్ చెబుతున్నారు. వీరిపై ప్రభుత్వం ఒక కన్నేసి, లోకల్ తయారీదారులను రక్షించాలని కోరుతున్నారు.
ఇంపోర్ట్ డ్యూటీ పెంచాలి…
ఇంపోర్ట్ డ్యూటీ కూడా కొంతమంది ప్లేయర్స్‌కు అడ్డంకిగా నిలుస్తోంది. పూర్తిగా ఇంపోర్ట్‌లను తాము బ్యాన్ చేయాలని కోరడం లేదని కానీ ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే లోకల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయొచ్చని ఏఐఎంఈడీ నాథ్ అన్నారు. ప్రస్తుతం మెడికల్ డివైజ్‌లపై ఇంపోర్ట్ డ్యూటీ 7.5 శాతంగా ఉంది. ఈ డ్యూటీని రెండింతలు చేయాలని ఇండస్ట్రీ కోరుతోంది. ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే ప్రతి మెడికల్ డివైజ్‌ను లోకల్‌గా తయారు చేస్తామని బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ సునిల్ ఖురానా అన్నారు. రీఫర్బిష్డ్ మెడికల్ డివైజ్‌లు ఇండియాలోకి ఎంటర్ కావడం కూడా దేశీయ ఇండస్ట్రీకి సవాలుగా నిలుస్తోంది. రీఫర్బిష్డ్ ప్రొడక్ట్‌లు మన దేశంలోకి రాకుండా చూడాలని తయారీదారులు కోరుతున్నారు. చౌకైన చైనీస్ ఇంపోర్ట్స్ నుంచి ఇండియన్ ఇండస్ట్రీని కాపాడాలన్నారు.
లోకల్ ఇండస్ట్రీకి సవాళ్లు..
- తక్కువ ఇంపోర్ట్ డ్యూటీ
- సెకండ్ హ్యాండ్ రీఫర్బిష్డ్ డివైజ్‌లు
- మేడిన్ ఇండియా ట్యాగ్‌తో చైనీస్ ప్రొడక్ట్‌ల అమ్మకం
- క్యాపిటల్, మార్కెట్ యాక్సస్
ఇండియన్ మెడికల్ టెక్ సెక్టార్..
- ఇండియన్ మెడ్–టెక్ సెక్టార్ వాల్యు… రూ.38,159 కోట్లు
- ఇండియన్ మెడికల్ డివైజ్‌ల ఎక్స్‌పోర్ట్ వాల్యు.. రూ.15,418 కోట్లు
- ఇండియాలో మెడికల్ డివైజ్ తయారీదారులు.. 1,200 మంది
- ఇంపోర్ట్ చేసుకునే మెడికల్ ఎలక్ట్రానిక్స్.. 90 శాతం