మీటింగ్ అని పిలిచి, బంధించిన్రు.. భోజనం చేసి, గోడ దూకి వెళ్లిపోయిన్రు

మీటింగ్ అని పిలిచి, బంధించిన్రు.. భోజనం చేసి, గోడ దూకి వెళ్లిపోయిన్రు

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీలో ఓ ఆశ్చర్యకర సన్నివేశం చోటుచేసుకుంది. మీటింగ్ కు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశంలోకి రాకుండా భోజనం చేసి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు గేట్లు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇలా తాళాలేసి ఉంచడం పట్ల సమావేశానికి వచ్చిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వీచిన ఈదురుగాలులు, వడగళ్ల వానలతో పంట నష్టం జరిగిందని, మామిడి కాయలు కింద రాలిపోయినా అలాగే వదిలేశామని, కనీసం చేతికొచ్చిన వాటినైనా కాపాడుకుందామంటే.. ఈ మీటింగ్ కు రమ్మని, ఇలా తాళాలేస్తే ఎలా అని నిలదీశారు. ఒకవేళ అక్కడ చినుకులు పడి మళ్లీ తడిస్తే బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. 
 
ఈ క్రమంలోనే కొందరు రైతులు, కార్యకర్తలు గేట్లు వేయడంతో గోడదూకి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు తినడానికి ప్లేట్లు దొరకకపోవడంతో చిన్నపాటి గొడవ,  తోపులాట జరిగినట్టు సమాచారం. కొందరు ప్లేట్లు లేక బేసిన్లలో అన్నం వేసుకుని తిన్నారు. 

కరీంనగర్ ప్లీనరీ దగ్గర సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మీటింగ్ నుంచి బయటకు వెళ్లకుండా గేట్లు వేయడంతో వాగ్వాదానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు వాగ్వాదానికి దిగారు. తాము పొలాల దగ్గరకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.