కరోనా పుట్టుకను తేల్చాల్సిందే

కరోనా పుట్టుకను తేల్చాల్సిందే
  • చైనాలో వైరస్ ప్రారంభంపై కొత్త స్టడీ చేయాల్సిందే
  • జీ7 దేశాధినేతల స్పష్టీకరణ  
  • చైనా మానవ హక్కుల అణచివేతను ఆపాలని డిమాండ్ 
  • ముగిసిన జీ7 సమ్మిట్​.. ఉమ్మడి ప్రకటన విడుదల

కార్బిస్ బే (ఇంగ్లాండ్): కరోనా వైరస్ పుట్టుకపై కొత్త స్టడీని చేపట్టాల్సిందేనని, చైనాలో ఈ వైరస్ ప్రారంభం కావడంపైనా అధ్యయనం జరగాల్సిందేనని జీ7 దేశాల ( యూకే, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, అమెరికా, జపాన్​, ఇటలీ)అధినేతలు స్పష్టం చేశారు. కరోనాపై ఇన్వెస్టిగేషన్ కు చైనా సహకరించనందున ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్ సమగ్రంగా లేదని వారు తేల్చిచెప్పారు. చైనాలో వీగర్ ముస్లింలు, ఇతరులపై మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేతల విషయాన్నీ లేవనెత్తారు. ఈ విషయంలో చైనా తీరును తీవ్రంగా ఖండించారు. ఇంగ్లాండ్​లోని కార్న్​వాల్ కౌంటీ కార్బిస్ బేలో మూడు రోజుల పాటు జరిగిన జీ7 దేశాల 47వ సమ్మిట్​ ఆదివారం ముగిసింది. సమ్మిట్​ ముగింపు సందర్భంగా జీ7 దేశాధినేతలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. హాంకాంగ్ కు పూర్తిస్థాయిలో ఆటోనమీని కల్పించాలని, జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపేయాలని, దక్షిణ చైనా సముద్రంలో భద్రతకు భంగం కలిగించే పనులు మానుకోవాలని నేతలు ప్రకటనలో డిమాండ్ చేశారు.

జీ7 సమ్మిట్​ నిర్ణయాలు ఇవే.. 
కరోనా విపత్తుతో అల్లాడుతున్న పేద దేశాలకు వచ్చే ఏడాది చివరినాటికి100 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. వాతావరణ మార్పుల నివారణకు బ్రిటన్ లో ఈ ఏడాదే కాప్ 26 సమ్మిట్​ ను నిర్వహించాలని అంగీకారానికి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం కార్బన్ ఎమిషన్స్ జీ7 దేశాల నుంచే విడుదల అవుతున్నందున, తామే ముందుగా యాక్షన్ లోకి దిగుతామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఓవరాల్ గా చివరిరోజు సమ్మిట్​ ముగిసిన తర్వాత ఆరు కీలక అంశాలపై ఒక అంగీకారానికి వచ్చినట్లు జీ7 దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. కరోనా ప్యాండమిక్​ను అంతం చేసి భవిష్యత్తుకు సిద్ధం కావాలని, రికవరీ ప్లాన్ లు అమలు చేసి ఎకానమీలను మెరుగుపర్చాలని, భవిష్యత్తును సుసంపన్నం చేయడం కోసం న్యాయమైన వాణిజ్యాన్ని అనుసరించాలని, గ్రీన్ రెవెల్యూషన్ కు మద్దతివ్వడం ద్వారా భూమిని కాపాడాలని, దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, డెమోక్రసీ, స్వాతంత్ర్యం, సమానత్వం విలువలను పెంచుకోవాలని జీ7 దేశాలు నిర్ణయించాయి.

చిన్న గ్రూపులతో ప్రపంచాన్ని శాసించలేరు: చైనా 
కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసే చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించే రోజులు పోయాయని జీ7 దేశాధినేతల సమ్మిట్​​ను ఉద్దేశించి చైనా ఆదివారం ఘాటుగా కామెంట్ చేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు జీ7 దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాటిపై డ్రాగన్ తీవ్రంగా స్పందించింది. ‘దేశాలు పెద్దవా? చిన్నవా? బలమైనవా? బలహీనమైనవా? సంపన్నమైనవా? పేదవా? అన్నది కాదు. అన్ని దేశాలతో సంప్రదింపులు జరపడం ద్వారానే ప్రపంచ వ్యవహారాలను హ్యాండిల్ చేయగలం’ అని తాము బలంగా నమ్ముతున్నామని లండన్​లోని చైనీస్ ఎంబసీ స్పోక్స్​ పర్సన్ అన్నారు. కొన్ని దేశాల కూటములు పెట్టే రూల్స్ చెల్లుబాటు కావని, ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రకారం చేసే అంతర్జాతీయ చట్టాలు మాత్రమే చెల్లుతాయని పేర్కొన్నారు.