సాగునీటి ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

సాగునీటి ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ :  గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
  •     గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, అందులో భాగంగానే వాటిపై అవగాహన కోసం ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. కృష్ణా బేసిన్ లో ఉన్న  ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లు, నీటి సామర్థ్యం, లిఫ్ట్ ఇరిగేషన్లు, సాగు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు లిఫ్ట్ లోని ర్యాలంపాడు, గుడ్డం దొడ్డి రిజర్వాయర్లను  పరిశీలించారు. 

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మంగళవారం గట్టు మండల పరిధిలోని ఆరగిద్ద గ్రామంలో పలువురు చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లిన కలెక్టర్ మగ్గాలను పరిశీలించారు. చేనేత చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. రుణాలు రాలేదని సంఘం అధ్యక్షుడు నర్సప్ప కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బ్యాంక్ ఆఫీసర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట పీజేపీ ఎస్ సీ రహిముద్దీన్, ఎంపీడీవో చెన్నయ్య, చేనేత జౌళి శాఖ డీవో సుధారాణి తదితరులు ఉన్నారు.