ఎందుకిలా.. ఏం జరిగింది : గగన్ యాన్ రాకెట్ స్టార్ట్ అయ్యి ఆగింది.. మంటలు వచ్చి ఆరిపోయాయి..!

ఎందుకిలా.. ఏం జరిగింది : గగన్ యాన్ రాకెట్ స్టార్ట్ అయ్యి ఆగింది.. మంటలు వచ్చి ఆరిపోయాయి..!

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా నిర్వహించిన టీవీ-డీ1 ఫ్లయిట్ టెస్ట్ ప్రయోగం స‌క్సెస్ అయ్యింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగం మొదలుపెట్టాలని ఇస్రో సైంటిస్టులు భావించారు. అయితే.. ప్రయోగం ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే అలర్ట్​అయిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగా వాయిదా వేశామని స్వయంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వివరించారు. గగన్‌యాన్ టెస్ట్​ ఫ్లైట్ TV D1 షెడ్యూల్‌లో లిఫ్ట్‌ఆఫ్‌కు అడ్డంకిగా ఉన్న సమస్యను గుర్తించి.. ప్రయోగాన్ని నిలిపివేశారు.

లోపాన్ని త్వరగా అర్థం చేసుకుని... క్షణాల్లో ప్రయోగాన్ని సరిదిద్దడంలో ఇస్రో బృందం చేసిన కృషికి  సోమనాథ్​ప్రశంసలు కురిపించారు. గగన్‌యాన్ కార్యక్రమం ప్రయోగానికి ముందు.. ఇది ఇస్రో బృందానికి ఒక పరీక్షలాంటిదని చెప్పారు. సిస్టమ్‌లో పర్యవేక్షణ లోపం కారణంగా సాంకేతిక లోపం తలెత్తిందని, తాము దాన్ని చాలా వేగంగా గుర్తించామని ఇస్రో చైర్మన్ చెప్పారు.

శనివారం (అక్టోబర్​ 21న) ఉదయం 8 గంటలకు ప్రయోగం లాంచ్​ చేయాలని భావించారు. 8.30కి చేపట్టాలని ప్రయత్నించారు. మళ్లీ వాతావరణం అనుకూలించకపోవడంతో 8.45 నిమిషాలకు వాయిదా పడింది. లిఫ్ట్‌-ఆఫ్‌కు ఐదు సెకన్ల సమయం ఉండగా, లోపం కారణంగా ప్రయోగం ఆగిపోయింది. ప్రయోగం మొదలై, కౌంట్ డౌన్ మైనస్ 5 సెకెన్ల వరకూ అంతా సవ్యంగా సాగింది. కానీ.. ఇంజిన్‌ను స్టార్ట్ చేసే కమాండ్ ఇవ్వాల్సిన ఆటోమెటిక్ లాంచింగ్ సీక్వెన్స్ (ALS) ఆదేశాలతో ఇంజిన్ ఇగ్నిషన్ అనుకున్నట్లుగా జరగలేదని సోమనాథ్ తెలిపారు.

శనివారం (అక్టోబర్​ 21న)  ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నుంచి విడిపోయిన క్రూ ఎస్కేప్ మాడ్యుల్ సురక్షితంగా కిందకు చేరుకుంది. క్రూ ఎస్కేప్ మాడ్యుల్ నుంచి పారాచ్యూట్లు తెరుచుకుని సురక్షితంగా సముద్రంలో దిగింది. దీంతో TV D1 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ప్రయోగాన్ని వీక్షిస్తున్న శ్రీహరికోటలోని శాస్త్రవేత్తలు, సిబ్బంది చప్పట్లు కొడుతూ.. తమ సంతోషం వ్యక్తం చేశారు.

44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 TV-D1 రాకెట్.. షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్​..  క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి తీసుకెళ్లింది.

ప్రయోగంలో ఏం జరిగింది?

ఈ ప్రయోగంలో రాకెట్.. తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచి పెట్టింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో షార్‌కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ దిగింది. అప్పటికే.. బంగాళాఖాతంలో రెడీగా ఉన్న నౌకా దళ సిబ్బంది.. క్రూ మాడ్యూల్‌ని స్వాధీనం చేసుకొని, ఒడ్డుకి తీసుకొచ్చారు. ఇదంతా కేవలం 8 నిమిషాల్లో ముగిసింది.

ఎందుకంటే...? 

త్వరలో ఇస్రో క్రూ మాడ్యూల్‌లో మనుషులను ఉంచి, రోదసిలోకి పంపాలనుకుంటోంది. అలా పంపాలంటే.. క్రూ మాడ్యూల్ సరిగా పని చేస్తోందో లేదో ముందుగా టెస్ట్ చేయాలి. ఇందుకోసం జరిపినదే ఇవాళ్టి ప్రయోగం అని చెప్పాలె. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది కాబట్టి.. అబార్ట్ మిషన్-1 TVD-1 ద్వారా మనుషులతో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ని త్వరలోనే నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

రెండు గంట‌లు ఆల‌స్యంగా ప్రయోగం జ‌రిగినా.. ఆ ఫ‌లితాలు ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని నింపింది. భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం చేస్తున్న ప్రయోగాల‌ను మ‌రింత ఊతం ద‌క్కింది. అనుకున్నట్లు పేలోడ్స్ స‌ముద్రంలో దిగిన‌ట్లు సోమ‌నాథ్ తెలిపారు. గ‌గ‌న్‌యాన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భూక‌క్ష్యకు వ్యోమ‌గాములను తీసుకెళ్లేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. మూడు రోజుల పాటు ఆ వ్యోమ‌గాములు ఆ క‌క్ష్యలో గ‌డ‌ప‌నున్నారు. 2025లో గ‌గ‌న్‌యాన్ ప‌రీక్ష చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.