- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
- కలెక్టర్ హామీతో ప్రారంభమైన శోభాయాత్ర
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా వాహనాలను త్వరగా తీసుకెళ్లాలని పోలీసులు ఒత్తిడి చేశారని, బ్యాండ్ బృందంపై దాడి చేశారని ఆరోపిస్తూ గణేశ్ మండప నిర్వాహకులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేయడంతో శనివారం ఉదయం 10 గంటల వరకు గణేశ్ విగ్రహాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై కలెక్టర్ విచారణ జరిపించాలని, యువకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆందోళన విరమించి, శోభాయాత్రను తిరిగి ప్రారంభించారు.
