గ్రూప్​–1 మెయిన్స్​లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది జనరల్​ ఎస్సే

గ్రూప్​–1 మెయిన్స్​లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది జనరల్​ ఎస్సే

గ్రూప్​–1 మెయిన్స్​లో అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది జనరల్​ ఎస్సే. ఈ పేపర్​లో కనీసం 90కి తక్కువ కాకుండా 100–120 మధ్య మార్కులు సాధించిన వారు అత్యున్నత పోస్టు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే జనరల్​ ఎస్సేపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే జనరల్​ ఎస్సేలో మంచి మార్కులు పొందుతున్నారంటే మిగిలిన పేపర్లలో కూడా మంచి మార్కులొస్తాయని అర్థం. ఎందుకంటే గ్రూప్​–1 మెయిన్స్​లోని అన్ని పేపర్లు కూడా ఎస్సే రూపంలో ఉంటాయని గమనించాలి. 

మూడేసి ప్రశ్నలు

మెయిన్స్​లోని ఆరు పేపర్లలో మొదటిది జనరల్​ ఎస్సే. మొత్తం మూడు సెక్షన్లతో ఒక్కో సెక్షన్​లో మూడేసి ప్రశ్నలు ఇస్తాయి. అభ్యర్థికి సెక్షన్​కు ఒకటి చొప్పున మొత్తం మూడు జనరల్​ ఎస్సేలను మూడు గంటల్లో రాయాలి. మొత్తం 150 మార్కులు అంటే ఒక్కో ఎస్సేకి 50 మార్కులు చొప్పున ఉంటాయి.  అభ్యర్థి ఒక్కో ఎస్సేను  800–1000 పదాల నిడివితో ఒక గంటలో రాయాల్సి ఉంటుంది. గ్రూప్​–1 ప్రధాన పరీక్షలో పేపర్​–1 జనరల్​ ఎస్సే. అంతేగానీ ఎస్సే కాదు. ఈ రెండింటికి మధ్య తేడాను అభ్యర్థులు గమనించాలి. జనరల్​ అనే విశేషణం ఎస్సే ముందు చేర్చారు. ఇక్కడ జనరల్​ అంటే సాధారణం, ప్రావీణ్యం అవసరం లేదని అర్థం.   

ఉదాహరణకు సైబర్​ సెక్యూరిటీ గురించి చర్చించాల్సి వస్తే సైబర్​ సెక్యూరిటీలో పీజీ  స్టూడెంట్​ తన పరిశోధనా వ్యాసంలో ఎక్కువ శాస్త్ర సాంకేతిక అంశాలతో ఎస్సే రాస్తాడు. అదే జనరల్​ ఎస్సే రాసే అభ్యర్థి అంతలోతుగా చర్చించాల్సిన అవసరం ఉండదు. కాని సైబర్​ సెక్యూరిటీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇతర రంగాల్లో ఎలాంటి ప్రభావాలు కలిగి ఉంటుందనే విషయాన్ని రాయాల్సి ఉంటుంది. ప్రధాన పరీక్షలను ఆరు జీఎస్​ పేపర్లు వ్యాసరూప ప్రశ్నాపత్రాలే. అంటే ఎవరైతే జనరల్​ ఎస్సేను సమర్థవంతంగా రాయగలుగుతారో వారికి మిగిలిన వ్యాసరూప ప్రశ్నాపత్రాల జీఎస్​ పేపర్లలో కూడా మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే వారే ప్రశ్నలకు మంచి కూర్పుతో చక్కగా ఇచ్చిన సమయంలో రాయగలుగుతారు.  

ఇలా చేయండి

మొదట 2500 పదాలతో కూడిన ఒక వ్యాసాన్ని రాయండి. దాదాపు అన్ని పాయింట్లనూ కవర్​ చేయండి. మీకై మీరుగా చదివిన విషయాలను రాయండి. ఆ వ్యాసాన్ని సగానికి సగం 1250 పదాలకు కుదించండి. మళ్లీ దాన్ని 800 పదాలకు కుదించండి. ఇప్పుడు కూడా అన్ని పాయింట్లు కూడా కవర్​ అవ్వాలి. ఈ పద్ధతి అసలు ఉద్దేశమేంటంటే 2500 పదాలు రాసినప్పుడు అన్ని పాయింట్లు వకర్​ అయినట్లే, 800 పదాలకు కుదించినప్పుడు కూడా అన్ని పాయింట్లు కూడా రావాలి. 

యూపీఎస్సీ తరహాలో..

యూపీఎస్సీ ఆధ్వర్యంలో పబ్లిక్​ సర్వీసు కమిషన్లు అన్నీ గోవా సమావేశంలో తీర్మానించుకున్న విధంగా టీఎస్​పీఎస్సీ కూడా యూపీఎస్సీ జనరల్​ ఎస్సే పేపర్​ను ఆధారంగా చేసుకుని ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇటీవల జరిగిన గ్రూప్​–1 ప్రిలిమినరీ ప్రశ్నలే దీన్ని దృఢపరుస్తున్నాయి. యూపీఎస్సీ తన గెజెట్​లో సిలబస్​ లేకుండా కేవలం క్లుప్తత/ సంగ్రహం, స్పష్టత, మంచి కూర్పు  అనే వాటికే మార్కులు ఇవ్వబడతాయి అని స్పష్టంగా చెప్పింది. అంటే విషయ పరిజ్ఞానంతోపాటు మిగిలిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జనరల్​ ఎస్సే స్వరూప స్వభావం ముఖ్యం. జనరల్​ ఎస్సేకు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు.  సిలబస్​ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది అంతా మిగిలిన ఐదు పేపర్ల సంగ్రహ రూపమే. జనరల్​ ఎస్సే ఎలా రాయాలనేది ముఖ్యం. విషయ పరిజ్ఞానాన్ని మిగిలిన పేపర్లు చదవడం వల్ల గ్రహించవచ్చు. 

ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలన

గత ఐదు సంవత్సరాల యూపీఎస్సీ జనరల్​ ఎస్సే పేపర్లను పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా హైపోథిటికల్​ ప్రశ్నలు. యూపీఎస్సీ ఎస్సే పేపర్​లో ఈ రకం ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రూప్​–1 ఎస్సేకి ఇచ్చిన సిలబస్​ పరిధిలోనే హైపోథిటికల్​గా ప్రశ్నలను ఈసారి చూసే అవకాశం ఉంది. కాబట్టి జనరల్​ ఎస్సేను తక్కువ సమయంలో పూర్తి చేసి అత్యంత ఎక్కువ మార్కులు పొందే ఒక పేపరుగా అభ్యర్థి పరిగణించాలి. దీనికి జనరల్​ ఎస్సే స్వరూపం, లక్షణాలు, దాన్ని ఎలా రాయాలి, ఎక్స్​పెక్టెడ్​ టాపిక్స్​ ఏమిటనే విషయాలపై అభ్యర్థి దృషి నిలిపితే మంచి సర్వీసు ఖాయం.  ఏ కోణం నుంచి ప్రశ్నలు వస్తాయో ఏయే రకంగా అడుగుతారోనని విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ వివిధ అంశాలను చదవాలి. ఎక్కువ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోవాలి. పరీక్ష రోజు వరకు 5 నుంచి ఆరు అంశాలకు సిద్ధపడి ఉండండి. ఇలా అయితే కనీసం ఒక టాపిక్​/ సంబంధిత అంశాన్ని రాయగలుగుతారు.  

జనరల్​ ఎస్సే అంటే సాధారణంగా ఒక అంశం గురించి మంచి నిడివితో సంగ్రహంగా వివరణాత్మకంగా మంచి కూర్పుతో చక్కని భాషతో  ఇచ్చే ఒక సాహిత్య స్వరూపం అని చెప్పవచ్చు. స్థూలంగా ప్రతి జనరల్​ ఎస్సేలో నాలుగు ప్రధాన భాగాలుంటాయి. అవి 1. నిర్మాణం 2. అంశానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం 3. చక్కని భాష 4. ఔచిత్యమైన, హేతుబద్దమైన భావ వ్యక్తీకరణ. పై నాలుగు భాగాలకు ఒక్కోదానికి 25 శాతం చొప్పున మార్కులు ఇస్తాయి. అంటే జనరల్​ ఎస్సే అంటే విషయ పరిజ్ఞానం ఒక్కటే కాదు. దీంతోపాటు మంచి కూర్పు, సృజనాత్మకత, భాషా ప్రావీణ్యం(వాడుక భాష), సంవాదం. ఇచ్చిన అంశంలోని సమస్యను గుర్తించి పరిష్కారం చూపే సామర్థ్యం, క్లుప్తత, ఔచిత్యవంతంగా చెప్పడం లాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి అవసరం.

జనరల్​ ఎస్సే సిలబస్​

విభాగం-1

1. సమకాలీన సామాజిక సమస్యలు, సామాజిక సమస్యలు.

2. ఆర్థిక వృద్ధి, న్యాయ సమస్యలు.

విభాగం-2

1. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.

2. భారతదేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం.

విభాగం-3

1. సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి.

2. విద్య, మానవ వనరుల అభివృద్ధి

- ఎం. గంగాధర్ రావు,

పరివర్తన్ ఇండియా ఐఏఎస్