
మిన్నియాపాలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి హత్యతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. నిరసనకారుల ఆందోళనలు వాషింగ్గన్ సహా 150 నగరాలకు తాకాయి. కాగా, ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కొన్ని క్లినికల్ డీటెయిల్స్ ను అధికారులు బుధవారం విడుదల చేశారు. వీటిలో ఫుల్ అటాప్సీ రిపోర్ట్ లో ఫ్లాయిడ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. అతడి కుటుంబ అనుమతితో హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం 20 పేజీల ఈ నివేదికను విడుదల చేసింది.
ఫ్లాయిడ్ ఉదంతం పై ఓ వీడియో మీడియాలో బాగా వైరల్ అయింది. దీంట్లో మిన్నియాపాలిస్ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ తన మోకాలిని ఫ్లాయిడ్ మెడపై ఉంచి బలంగా నొక్కుతూ కనిపించాడు. తాను శ్వాస తీసుకోలేకపోతున్నంటూ ఫ్లాయిడ్ అరిచినా.. డెరెర్ తన మోకాలును తీయలేదు. అతడు తన మోకాలును తీసే దాకా నొప్పిని తట్టుకోలేని ఫ్లాయిడ్ ఏడుస్తూ కనిపించాడు. దాదాపు ఎనిమిది నిమిషాల తర్వాత అతడు మోకాలిని తీసినా.. జార్జి స్పృహ కోల్పోయాడు. అతణ్ని దగ్గర్లోని మెడికల్ సెంటర్ కు తరలించారు. కానీ అప్పటికే ఫ్లాయిడ్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. జార్జి ఫ్లాయిడ్‌ది హత్యేనని అధికారిక పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. జార్జ్ చనిపోయిన తీరును బట్టి హోమిసైడ్ (నరహత్య) అని మినియాపొలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఉదంతంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఫ్లాయిడ్ హెల్త్ పై ఏప్రిల్ 3న జరిపిన క్లినికల్ డీటేయిల్స్ ను తాజాగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ విడుదల చేశారు. ఆ టెస్టుల్లో ఫ్లాయిడ్ కు కరోనా పాజిటివ్ గా తేలినప్పటికీ.. ఎలాంటి లక్షణాలు లేని అసింప్టోమాటిక్ గా వచ్చింది. అలాగే ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు హెల్తీగా కనిపించినప్పటికీ, అతడి గుండెలో ధమనులు సంకుచితంగా ఉన్నాయని తేలింది. కాగా, మిన్నియాపాలిస్ అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్ బుధవారం డెరెక్ చౌవిన్ పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలను అప్ గ్రేడ్ చేశారు. ఘటనా స్థలంలో డెరెక్ కు సహకరించారని మరో ముగ్గురు అధికారులపై అభియోగాలు మోపారు.