సంచలనం..12.1 కోట్ల మంది ఇండియన్​ పేషేంట్ల వివరాలు లీక్

సంచలనం..12.1 కోట్ల మంది ఇండియన్​ పేషేంట్ల వివరాలు లీక్
  • 12.1 కోట్ల మంది ఇండియన్​ రోగుల టెస్టుల ఫొటోలు లీక్​
  • టాప్​లో అమెరికా.. 30.3 కోట్ల ఫొటోలు లీక్​
  • గ్రీన్​బోన్​ రిపోర్ట్​.. పరిస్థితి దారుణమని వెల్లడి
  • ప్రపంచమంతటా 119 కోట్ల రోగుల రిపోర్టుల ఫొటోలు ఆన్​లైన్​లో

ఒంట్లో కొంచెం నలతగా ఉంది.. హాస్పిటల్​కు వెళ్లాం. డాక్టర్​ స్కానింగ్​ తీయించుకోమన్నాడు. తీయించుకున్నాం. ‘బొమ్మ’లో అంతా బాగానే ఉంది. ఏం లేదు.. హ్యాపీ. పెద్ద యాక్సిడెంట్​ అయింది. హాస్పిటల్​లో చేరగానే ఎక్స్​రే తీశారు.కొన్ని చోట్ల ఎముకలు విరిగిపోయాయి. చాలా బాధ.కంట్లో చిన్న ప్రాబ్లం. కంటి డాక్టర్​ దగ్గరకు వెళ్లాం. కంటికి దగ్గరగా ఏదో మెషీన్​ పెట్టి చూశాడు డాక్టర్​. ఏం కాదులే అన్నాడు.

అన్ని టెస్టులూ మనం హాస్పిటల్​ మీద నమ్మకంతో చేయించుకుంటున్నాం. మరి, అలా టెస్టులు చేయించుకున్న డేటా భద్రంగానే ఉందా? అంటే లేనే లేదు అంటోంది జర్మనీకి చెందిన సైబర్​ సెక్యూరిటీ సంస్థ గ్రీన్​బోన్​. అవును, ఒకటి కాదు.. రెండు కాదు.. 12.1 కోట్ల మంది ఇండియన్​ పేషెంట్ల వివరాలు, వారి టెస్టుల ఫొటోలు ఆన్​లైన్​లో లీకయ్యాయని తేల్చింది. పేషెంట్లకు సంబంధించిన సీటీ స్కాన్​, ఎంఆర్​ఐ స్కాన్​, ఎక్స్​రే ఫొటోలు ఆన్​లైన్​లో ‘ఫ్రీ’గా యాక్సెస్​కు ఉన్నాయని చెప్పింది. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్​ ప్లేస్​లో ఉంది. 3,08,451 డేటా చోరీలతో 6 కోట్ల 97 లక్షల 89 వేల 685 మంది రోగుల వివరాలు ఆన్​లైన్​లో లీకయ్యాయి. ఇక, 1,26,160 డేటా చోరీలతో 59 లక్షల 97 వేల 360  మంది రోగుల వివరాలు ఆన్​లైన్​లో లీకై తెలంగాణ నాలుగో స్పాట్​లో ఉంది. మొత్తంగా దేశమంతటా 10.2 లక్షల డేటా చోరీలు జరిగినట్టు రిపోర్ట్​ చెప్పింది.

పీఏసీఎస్​ సర్వర్లలోనే ప్రాబ్లమ్​

ఈ డేటా లీక్​ సమస్యంతా పిక్చర్​ ఆర్కైవింగ్​ అండ్​ కమ్యూనికేషన్స్​ సిస్టమ్స్​ (పీఏసీఎస్​) సర్వర్లలోనే ఉందని గ్రీన్​బోన్​ తేల్చింది. ఆ సర్వర్లు అంత సేఫ్​ కాదని పేర్కొంది. డేటా స్టోర్​ చేసిన ఆ సర్వర్లు ఎలాంటి ప్రొటెక్షన్​ లేకుండానే ఇంటర్నెట్​లో పబ్లిక్​కు ఫ్రీగా అందుబాటులో ఉందని తేల్చి చెప్పింది.

నిజానికి దీనిపై నిరుడు అక్టోబర్​లోనే గ్రీన్​బోన్​ ఫస్ట్​ రిపోర్ట్​ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో పేషెంట్ల రికార్డులు, సీటీస్కాన్​, ఎంఆర్​ఐ స్కాన్​, ఎక్స్​రేల ఫొటోలు లీకయ్యాయని చెప్పింది. ఆ తర్వాత నవంబర్​లో ఆ డేటా లీక్​కు సంబంధించి వివిధ దేశాలకు, గుడ్​(మంచి), బ్యాడ్​ (బాలే), అగ్లీ (అస్సలు బాలే) కేటగిరీలుగా విభజించి మరో రిపోర్ట్​ ఇచ్చింది. రిపోర్ట్​ తర్వాత దేశాలు చేపట్టిన చర్యలకు తగ్గట్టు ఆ కేటగిరీలు ఇచ్చింది. ఇందులో ఇండియా.. అగ్లీ కేటగరిలో నిలిచింది. ఫస్ట్​ రిపోర్ట్​ విడుదల చేసిన నాటికి 6.27 లక్షల డేటా చోరీలు జరిగితే, ఇప్పుడు తాజా రిపోర్ట్​లో మాత్రం ఆ సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటేసింది. పేషెంట్ల స్కానింగ్​ ఫొటోలు అప్పుడు 10.5 కోట్లుగా ఉంటే, ఇప్పుడది 12.1 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 9.04 లక్షల లీకులకు సంబంధించి 11.47 కోట్ల ఫొటోలు నెట్​లో ఫ్రీగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. 97 సర్వర్ల నుంచి డేటా లీక్​ కాగా, అందులో 20 కొత్త పీఏసీఎస్​ సర్వర్లున్నట్టు పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డేటా ప్రైవసీ బిల్లునూ గ్రీన్​బోన్​ ప్రస్తావించింది.

లీక్​లో అమెరికానే టాప్​

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 119 కోట్ల మంది రోగుల వివరాలు ఆన్​లైన్​లో లీకైనట్టు రిపోర్ట్​ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్​తో పోలిస్తే రోగుల డేటా లీక్​ 60 శాతం పెరిగిందని చెప్పింది. అక్టోబర్​లో 73.7 కోట్ల మంది పేషెంట్ల డేటా ఆన్​లైన్​లో లీకైతే ఇప్పుడు అది చాలా ఎక్కువ పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించింది. దాదాపు 3.5 కోట్ల డేటా లీకులు జరిగాయని చెప్పింది. అక్టోబర్​లో డేటా లీకుల సంఖ్య 2.45 కోట్లు. ఇప్పుడది 40% పెరిగింది. ఇక, పేషెంట్ల డేటా లీక్​లో అమెరికా టాప్​లో ఉంది. 1.37 కోట్ల డేటా లీకులతో 30.3 కోట్ల మంది పేషెంట్ల వివరాలు ఆన్​లైన్​లో ఉన్నట్టు తేల్చింది. అందులో 4.58 కోట్ల మంది వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని వివరించింది.