ఫిఫా వరల్డ్‌‌కప్‌‌ : గెలిచినా.. జర్మనీ ఇంటికే

ఫిఫా వరల్డ్‌‌కప్‌‌ : గెలిచినా.. జర్మనీ ఇంటికే

అల్‌‌‌‌ ఖోర్‌‌: ఒకప్పుడు సాకర్‌‌ ప్రపంచాన్ని శాసించిన జర్మనీ... ఫిఫా వరల్డ్‌‌కప్‌‌లో మరోసారి నిరాశపర్చింది. కీలకమైన మ్యాచ్‌‌లో నెగ్గినా.. ఇతర మ్యాచ్‌‌ల సమీకరణాల వల్ల ప్రిక్వార్టర్స్‌‌ బెర్త్‌‌ను సాధించలేకపోయింది. దీంతో నాలుగు సార్లు టైటిల్‌‌ నెగ్గిన జర్మనీ...ఈసారీ గ్రూప్‌‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. గ్రూప్‌‌–ఇలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌లో జర్మనీ 4–2తో కోస్టారికాపై గెలిచింది. జర్మనీ తరఫున సెర్గీ గాన్‌‌బ్రే (10వ ని.), కాయ్‌‌ హవర్టెజ్‌‌ (73వ, 85వ ని), నిక్లాస్‌‌ ఫులెకార్గ్‌‌ (89వ ని.) గోల్స్‌‌ సాధించారు. కోస్టారికా ప్లేయర్‌‌ మాన్యూయెల్‌‌ న్యూయెర్‌‌ (70వ ని.) ఓన్‌‌ గోల్‌‌ చేయగా, ఎల్టిసిన్‌‌ తెజెడా (58వ ని.) మరో గోల్‌‌ అందించాడు. తొలి మ్యాచ్‌‌లో జపాన్‌‌ చేతిలో 2–1తో ఓడిన జర్మనీ.. రెండో మ్యాచ్‌‌లో 1–1తో స్పెయిన్‌‌ను నిలువరించి డ్రా చేసుకుంది. కానీ లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో నెగ్గి 4 పాయింట్లతో థర్డ్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. అయితే ఇన్నే పాయింట్లు ఉన్న స్పెయిన్‌‌ రెండో ప్లేస్‌‌తో నాకౌట్‌‌కు అర్హత సాధించగా, గోల్స్‌‌ డిఫరెన్స్‌‌ (1) కారణంగా జర్మనీ వెనకబడిపోయింది. 

ఓటమితోనే దెబ్బ..

ఎప్పుడైనా ఫిఫా టోర్నీలో జర్మనీ ఆరంభం నుంచే తనదైన మార్క్‌‌ను చూపిస్తుంటుంది. స్టార్లతో పాటు సంచలనాలు చేసే యంగ్‌‌స్టర్స్‌‌ను టీమ్‌‌లోకి తీసుకుని అద్భుతాలు చేస్తుంటుంది. కానీ లెజెండ్స్ రిటైర్మెంట్‌‌తో గత రెండు వరల్డ్‌‌కప్స్‌‌ (2014, 2018) నుంచి క్రమంగా జర్మనీ ప్రాభవం తగ్గడం మొదలైంది. జపాన్‌‌ను తక్కువ అంచనా వేసి తొలి మ్యాచ్‌‌లో ఓడటంతో జర్మనీ పతనం ఆరంభమైంది. అయితే దీని నుంచి బయటపడేందుకు స్పెయిన్‌‌పై గెలిచినా కొద్దోగొప్పో చాన్సెస్‌‌ ఉండేవి. కానీ స్పెయిన్‌‌ బలమైన డిఫెన్స్‌‌ ముందు జర్మనీ ఫార్వర్డ్స్‌‌ తేలిపోవడంతో మ్యాచ్‌‌ డ్రాగా ముగిసింది. ఇక కోస్టారికా మ్యాచ్‌‌లో అందరూ కలిసి కట్టుగా ఆడినా విధి మరోలా తలచింది. కోస్టారికాతో మ్యాచ్‌‌లో జర్మనీ ప్లేయర్లు 61 శాతం బాల్‌‌ను ఆధీనంలో ఉంచుకుని గోల్స్‌‌ చేసే అవకాశాలను సృష్టించుకున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌‌ల్లో ఇది జరగలేదు. అలాగే ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో ఈసారి బాగా దూసుకుపోయారు. దీంతో 32సార్లు అపోనెంట్‌‌ గోల్‌‌ పోస్ట్‌‌పై దాడి చేసే అవకాశాలను సృష్టించుకున్నారు. 11సార్లు అయితే టార్గెట్‌‌ను ఫినిష్‌‌ చేసినట్లుగానే కనిపించినా కోస్టారికా సకాలంలో అడ్డుకుంది. మొత్తానికి మ్యాచ్‌‌ మొత్తం సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసినా ప్రిక్వార్టర్స్‌‌ బెర్త్‌‌ మాత్రం దక్కలేదు. 

స్పెయిన్‌‌ ఓడినా..

ఈ గ్రూప్‌‌లో అదృష్టమంటే స్పెయిన్‌‌దే. కీలకమైన ఆఖరి మ్యాచ్‌‌లో 1–2 తేడాతో జపాన్‌‌ చేతిలో ఓడినా నాకౌట్‌‌ బెర్త్‌‌ దక్కింది. జర్మనీతో సమానంగా పాయింట్లు (4) ఉన్నా..గోల్స్‌‌ డిఫరెన్స్‌‌ (6) కారణంగా స్పెయిన్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించింది. జపాన్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఆరంభంలో దూకుడుగా ఆడిన స్పెయిన్‌‌ 11వ నిమిషంలోనే అల్వారో మొరాటా గోల్‌‌ చేసి టీమ్‌‌ను ఆధిక్యంలో నిలిపాడు. తొలి హాఫ్‌‌ మొత్తం ఈ లీడ్‌‌ను సూపర్‌‌గా కాపాడుకున్న స్పెయిన్‌‌.. రెండో హాఫ్‌‌లో మాత్రం జపాన్‌‌ అటాకింగ్‌‌ను అడ్డుకోలేకపోయింది. రెండు ఫ్లాంక్‌‌ల నుంచి ఎదురుదాడులు ఎక్కువ కావడంతో స్పెయిన్‌‌ డిఫెన్స్‌‌ చెల్లాచెదురైంది. దీంతో జపాన్‌‌ ప్లేయర్లు రిట్సూ డోయాన్‌‌ (48వ ని.), అవో తనాకా (51వ ని.) గోల్స్‌‌ కొట్టి మ్యాచ్‌‌ గెలిపించారు. ఒకవేళ ఈ మ్యాచ్‌‌లో జపాన్‌‌ ఓడి ఉంటే స్పెయిన్‌‌తో పాటు జర్మనీ నాకౌట్‌‌కు అర్హత సాధించేవి.