ఘజియాబాద్ లో కరోనా పేపెంట్లకు సేవలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆక్సిజన్ అందక, ఆస్పత్రిలో బెడ్లు దొరక్క జనం రోడ్లపైనే మరణిస్తున్న విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ శివారు ఘజియాబాద్ లోని గురుద్వారా కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తూ మానవతను చాటుకుంటోంది. మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు గురుద్వారా వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఖల్సా హెల్ప్ ఇంటర్నేషనల్ సంస్థ గురుద్వార బయట రోడ్డు పక్కన వెహికల్స్ లోనే పేషెంట్లకు సేవలు అందిస్తోంది. చిన్న క్వాంటిటీలో ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి అవసరమైనవాళ్లకు ప్రాణవాయువు అందజేస్తోంది. కార్లు వ్యాన్లు, ఆటోల్లో వస్తున్న కరోనా పేషెంట్లు, వాళ్ల బంధువులు గురుద్వారా బయట క్యూలు కట్టారు. గురుద్వారా ప్రెసిడెంట్, ఖల్సా హెల్ప్ ఇంటర్నేషనల్ ఫౌండర్ రమ్మి మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి కరోనాపేషెంట్లకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. 36 గంటల్లో సుమారు 700 మంది పేషెంట్లను తాము కాపాడినట్టు చెప్పారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో వస్తున్నపేషెంట్లకు వెహికల్స్ లోనే ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగి బెడ్లు, ట్రీట్ మెంట్ దొరక్క జనం వీధుల్లోనే చనిపోతుండటంతో ఆక్సిజన్ సప్లయ్ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
