జీహెచ్ఎంసీలో జనం నాడి తెలుస్తలేదు

జీహెచ్ఎంసీలో జనం నాడి తెలుస్తలేదు

 

హైదరాబాద్, వెలుగుజీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం నాడి అంతు చిక్కడం లేదని రాష్ట్ర మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. దుబ్బాక ఎఫెక్ట్ హైదరాబాద్​లోనూ  కనిపిస్తోందని, ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అని వారు లోలోపల ఫీలవుతున్నారు. ప్రగతిభవన్ లో ఉంటూ సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలను రచిస్తుంటే.. కేటీఆర్ వాటిని అమలు చేయడంలో బిజీగా ఉంటున్నారు. మీడియా మీటింగ్​లు, ప్రకటనలన్నింటా వీరిద్దరి హడావుడే కనిపిస్తోంది. అయితే గ్రౌండ్​ లెవల్​లో పర్యటిస్తున్న మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మాత్రం.. జనం నాడి తెలుసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. –

ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్​ఎస్​ పెద్ద లీడర్ల నుంచి చోటామోటా లీడర్ల వరకు హైదరాబాద్ కు తరలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు లీడర్లందరికీ ఒక్కో డివిజన్ బాధ్యతలు పార్టీ అప్పగించారు.వీరంతా తమకు అప్పగించిన డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఎక్కడికి పోయినా జనం మాత్రం తమ మనసులో మాట బయటపెట్టడం లేదు. ‘‘మా ముఖం చూసి కొందరు ప్రజలు దగ్గరికి వస్తున్నరు. ఓటేస్తామని ఏదో మొహమాటానికి చెప్తున్నరు. కానీ టీఆర్​ఎస్​కే ఓటేస్తరా? అనేది డౌటే. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ దండుగ. దాన్ని నమ్ముకుంటే మునిగిపోతం’’ అని ఓ మంత్రి అన్నారు. మొన్నటివరకు ‘జై తెలంగాణ’ అంటూ పార్టీ చుట్టూ తిరిగినోళ్లు ఇప్పుడు ‘జై శ్రీరాం’ అంటున్నారని మరో మంత్రి అన్నారు. పదేండ్ల తర్వాత రావాల్సిన నెగెటివ్ ఇప్పుడే వచ్చిందని, దీన్ని అంచనా వేయలేదని ఇంకో మంత్రి చెప్పారు.

ఇటుక, ఇసుక, కంకర బ్యాచ్

ప్రస్తుతం టీఆర్ఎస్​లో ‘ఇటుక, ఇసుక, కంకర బ్యాచ్’ అనే ట్యాగ్ లైన్ ఎక్కువగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఎవరైనా చెప్తే.. ‘ఇటుక, ఇసుక, కంకర బ్యాచ్’లో సదరు క్యాండిడేట్​ఉన్నారో లేదో ఇతర లీడర్లు ఇట్టే చెప్పేస్తున్నారు. హైదరాబాద్​లో ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు ఇటుక, ఇసుక, కంకర తెప్పించుకుంటే.. వెంటనే సదరు క్యాండిడేట్​ అనుచరులు అక్కడికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసే రకమని లీడర్లు అంటున్నారు. ఎక్కువ మంది అవినీతి పరులకే టికెట్లు దక్కాయని, ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోందని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ‘‘చాలా మందికి అవినీతి మరక ఉంది. మేం ప్రజల్లోకి వెళ్తే..  పైసలు ఇయ్యనిదే ఇల్లు కట్టనియ్యలేదని, ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నిస్తున్నారు” అని ఓ లీడర్ చెప్పారు. కొత్త వారికి టికెట్ ఇస్తే ఫలితాలు మరోలా వచ్చేవి అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ను వీక్ చేసి తప్పు చేసినమా?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి చాలా తప్పుచేశామని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అన్నారు. ‘‘12 మంది కాంగ్రెస్  ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని తప్పు చేసినం. వాళ్లు అట్లనే ఉంటే కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉండేది. కాంగ్రెస్ వీక్ అవడంతో  ఆ గ్యాప్ ను బీజేపీ భర్తీ చేసింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ సోషల్ వింగ్ యాక్టివ్

బీజేపీకి చెందిన సోషల్ వింగ్ చాలా యాక్టివ్ గా ఉందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘మా పార్టీ ఐటీ వింగ్ చాలా డల్ గా ఉంది. జనాలకు కనెక్ట్ అయ్యాలా పోస్టింగ్ లేవు. ఎప్పుడు ఎలా స్పందించాలో వాళ్లకు తెలియదు. మా ఐటీ వింగ్ ఇన్​చార్జ్​ జనం నుంచి రాలేదు. అలాంటి ఆయనకు ఏం తెలుస్తది. కేటీఆర్ వెంట ఉండగానే సరిపోదు’’ అని సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

జై తెలంగాణ అన్నోళ్లే జై శ్రీరాం అంటున్నరు

ఉద్యమ కాలంలో ‘జై తెలంగాణ’ అని స్లోగన్ ఇచ్చినోళ్లే ఇప్పుడు ‘జై శ్రీరాం’ అంటున్నరు. యూత్ అంతా టీఆర్​ఎస్​కు నెగెటివ్ గా మారారు. మిగతావాళ్లు ఎటు వైపు ఉన్నరో సమజైతలేదు. మొహమాటం కోసం టీఆర్ఎస్ కు ఓటేస్తమని చెబుతున్నా చివరికి ఎటేస్తరో.

– ఇదీ ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మినిస్టర్ ఫీలింగ్

మనసులో మాట బయటకు చెప్తలేరు

ఈ ఎన్నికల్లో జనం నాడి పట్టుకోలేకపోతున్నం. మనసులోని మాటను బయటికి చెప్తలేరు. ఎవరికి ఓటేస్తారని అడిగితే..  ఎవరికో ఒకరికి ఏస్తం అంటున్నరు. గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఇట్ల అనేటోళ్లు కాదు.

– ఇదీ దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఆవేదన