
జలందర్.. గుజరాత్‌లోని జునాగడ్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లె. సమయం ఉదయం సుమారు ఏడు అవుతుంది.ఆ ఊరి జనమంతా హడావుడిగా పరుగులు తీస్తున్నారు.
వాళ్లంతా ఊరి చివర తవ్వుతున్న బావి దగ్గరకు వెళ్లారు. అక్కడంతా గందరగోళంగా ఉంది. ఒకరిని తోసుకుంటూ ఒకరు లోపలికి తొంగి చూస్తున్నారు. లోపల ఒక చిరుత నిస్సహాయ స్థితిలో ఉంది. అందరిలో ఒకటే చర్చ దాన్ని ఎవరు పైకి తీస్తారని. తీయాలని ప్రయత్నిస్తే చంపేస్తుందేమోనని భయం. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ వెళ్లింది. రసిల వాధేర్ వెంటనే తన కుర్చీలో నుంచి లేచి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ తీసుకుని టీంతో బయలుదేరింది. ఆమే రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ టీంలో ఉన్న ఏకైక మహిళా ఆఫీసర్.తన టీంతో జలందర్ చేరుకోగానే సహాయక చర్యలు మొదలుపెట్టింది. పంజరంలో కూర్చుని ధైర్యంగా యాభై అడుగుల బావిలోకి దిగింది. డార్ట్‌గన్‌తో చిరుతను కాల్చి, అది అపస్మారక స్థితిలోకి వెళ్లగానే పంజరం నుంచి బయటకు వచ్చింది. చిరుతను తీసుకెళ్లి గిర్ అడవిలో వదిలేసింది. ఇదంతా 2013లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి రెండు కాదు సుమారు వెయ్యికి పైగా జంతువులను కాపాడిందామె.
రసిల వాధేర్‌ది రాజస్థాన్‌లోని బంధూరి గ్రామం. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు. తల్లి ఎన్నో కష్టాలు పడి రసిలను చదివించింది. రసిల హిందీ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ సాధించడమే లక్ష్యంగా చదివింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే ఇష్టం. రసిలది చాలా పేద కుటుంబం. డిగ్రీ పూర్తయ్యాక అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. చివరకు 2007లో గుజరాత్ ప్రభుత్వం గిర్ అభయారణ్యం రెస్క్యూ టీమ్‌లో మొదటిసారిగా ఆడవాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్కు రెస్క్యూ టీమ్‌లో మొదటి మహిళా గార్డ్‌గా చేరింది. ఆ అడవి సుమారు 1400 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. చాలా పెద్ద అడవి కావడంతో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఏదో జంతువుకు ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే రెస్క్యూ టీం అక్కడికి వెళ్లి వాటిని రక్షించాలి. రసిల ఉద్యోగంలో చేరిన్పటినుంచి ఇప్పటివరకు సుమారు 1100 జంతువులను కాపాడింది. అందులో 400 చిరుత పులులు, 200 సింహాలు, మొసళ్లు, కొండచిలువలు ఉన్నాయి. జంతువు ఎంత క్రూరమైనది అయినా రసిల ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. అంత ధైర్యవంతురాలు కాబట్టే ఆమె ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోనే ప్రమోషన్ వచ్చింది.
సివంగితో..
రసిల ఉద్యోగంలో చేరిన మొదట్లో తోటి ఉద్యోగులు ఆమెను చిన్నపిల్లలా చూసేవాళ్లు.
అడవిలోకి ఆడపిల్లలు వెళ్లడం రిస్కని ఫీల్ అయ్యేవాళ్లు. అందుకే ఆమెను ఎప్పుడూ అడవిలోకి పంపేవాళ్లు కాదు. కానీ రసిల తన ధైర్యాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూసింది. ఒకరోజు దెదాకడీ ఏరియాలో ఒక ఆడ సింహం(సివంగి) గాయాలతో తిరుగుతున్నట్టు ఇన్‌ఫర్మేషన్ వచ్చింది. ఆ టైమ్‌కు రసిల డ్యూటీలో ఉంది. వెంటనే తన టీంతో వెళ్లింది. కంటిమీద కునుకు లేకుండా ఆ రాత్రంతా కష్టపడి సింహాన్ని గుర్తించి.. మత్తు ఇచ్చి పట్టుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ అధికారులకు ‘ఆమె ఆడపిల్ల కాదు సివంగి’ అని. ఆమె సాహసాన్ని గుర్తించిన అధికారులు ఆ తర్వాత 150 మంది మహిళా గార్డులను రిక్రూట్ చేసుకోవడం విశేషం.