బాలికపై గ్యాంగ్ రేప్.. తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత ఫైల్ చేసిన FIR

బాలికపై గ్యాంగ్ రేప్.. తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత ఫైల్ చేసిన FIR

ఓ వైపు యూపీలోని హ‌త్రాస్ ఘ‌ట‌నపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతుండ‌గానే ఛత్తీస్‌గడ్ లో మ‌ర దారుణ సంఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. కొండగావ్ జిల్లాలో అత్యాచార ఘ‌ట‌న క‌ల‌కలం రేపుతుంది. మైనర్ బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. జ‌రిగిన అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆ బాలిక‌ ఆత్మహత్యకు పాల్ప‌డింది. జులై 20 న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పొరుగు గ్రామంలో బంధువుల వివాహానికి స్నేహితుడితో క‌లిసి వెళ్ళి వ‌స్తున్న బాలికను ఇద్ద‌రు వ్య‌క్తులు అడ్డ‌గించారు. బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అట‌వీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్క‌డికి మ‌రో ఐదుగురితో క‌లిసి ఏడుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రాత్రంతా బాలిక‌తోనే గ‌డిపిన నిందితులు తెల్ల‌వారుజామున ఆమెను వ‌దిలేశారు. అవ‌మాన భారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఆమె కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించ‌డంతో ఏం చేయాలో తోచ‌క మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. అయితే ఆ త‌ర్వాత కూడా నిందితుల‌ను శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌ను ఆశ్ర‌యించినా ప‌ట్టించుకోలేదు. దీంతో త‌న కూతురుకు న్యాయం జ‌రగ‌‌లేద‌న్న మ‌నోవేద‌నతో అక్టోబ‌ర్ 6న ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు.

ఈ విష‌యం మీడియా దృష్టికి వెళ్ల‌డంతో స్థానిక మీడియా సంస్థ‌ల‌న్నీ జ‌రిగిన ఘోరం గురించి తెలుసుకుని ప‌తాక శీర్షిక‌ల్లో ప్ర‌చురించాయి. ఈ ఘోరం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ దారుణానికి పాల్ప‌డ్డ ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు. బాలిక మృత‌దేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. అయితే ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్న బాధిత కుంటుంబం ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. ఈ విష‌యమై గ‌తంలో త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని చెబుతున్నారు.