గీతా ప్రెస్కు గాంధీ బహుమతి ఇవ్వడంపై .. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..

గీతా ప్రెస్కు గాంధీ బహుమతి ఇవ్వడంపై .. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్‌కి 2021 ఏడాదికి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. గీతా ప్రెస్‌ కు గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ గీతా ప్రెస్ ను  గాంధీ శాంతి బహుమతికి ఎంపిక చేయడం అపహస్యంగా పేర్కొన్నారు.  దీనిని హిందుత్వ విగ్రహావిష్కర్త వీడీ సావర్కర్, మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేలకు ప్రదానం చేయడం వంటిదన్నారు. 

దేశ వారసత్వంపై దాడి..

గీతా ప్రెస్ కు శాంతి బహుమతి కేటాయింపును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ  విమర్శించారు. కర్ణాటకాలో విజయం సాధించిన తర్వాత దేశ వారసత్వంపై కాంగ్రెస్ బహిరంగంగానే దాడి చేస్తోందని ఆరోపించారు. ఇందుకు కర్ణాటకలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తొలగించడమే నిదర్శనమన్నారు. తాజాగా  గీతా ప్రెస్ కు  గాంధీ శాంతి బహుమతి కేటాయింపును కూడా వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ..

గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతిని కేటాయింపును  కాంగ్రెస్ వ్యతిరేకించడంపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ కు రామమందిరం నిర్మించడం ఇష్టం లేదన్నారు. హిందుత్వం, సావర్కర్ పై కాంగ్రెస్ దాడి చేస్తే ఉద్దవ్ ఠాక్రే అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు.  

నగదు వద్దు..అవార్డు చాలు..

గీతా ప్రెస్ ఏర్పడినప్పటి నుంచి లాభాపేక్ష కోసం, ఆదాయం కోసం అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం పనిచేయలేదు. అయితే గత కొద్ది కాలంగా గీతా ప్రెస్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని..త్వరలో దీన్ని మూసివేస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆ సంస్థ ఖండించింది. గీతాప్రెస్ మూతపడటం లేదంటూ ప్రకటించింది. ఈ క్రమంలో గాంధీ శాంతి బహుమతి ద్వారా వచ్చే రూ.కోటి ..గీతా ప్రెస్ సంస్థ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ అవార్డుకు గీతాప్రెస్‌ను ఎంపిక చేయడం వివాదానికి దారితీయడంతో గీతాప్రెస్  ప్రబ్లిషర్స్ కోటి రూపాయల పురస్కారాన్ని తిరస్కరించారు. తాము జ్ఞాపికను మాత్రమే తీసుకుంటామని.. అవార్డు సొమ్ము కేంద్రం ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరింది. 

గాంధీ శాంతి బహుమతిని 1995లో  కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ ఆదర్శాలకు నివాళిగా దీన్ని ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ అవార్డు విజేతలకు రూ. కోటి నగదు బహుమతి కూడా అందుతుంది. అయితే 2021 ఏడాదికిగానూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గల జ్యూరీ  గీతా ప్రెస్ ను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది.

ప్రధాని మోడీ అభినందనలు..

‘2021 ఏడాదికి  గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన గోరఖ్ పూర్ గీతా ప్రెస్ కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక, సామాజిక పరివర్తన కోసం 100 ఏళ్ల పాటు చేసిన సేవలు నిజంగా ప్రశంసనీయమని ట్వీట్ చేశారు.

యూపీలోని గోరఖ్ పూర్ లో 1923లో గీతాప్రెస్ సంస్థ ఏర్పడింది. ఇది  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.  మొత్తం 14 బాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి రికార్డు సాధించింది.  వీటిలో 16.21 కోట్లు భగవద్గీత పుస్తకాలే ఉండటం విశేషం.  ఈ సంస్థ హిందూ ధర్మానికి సంబంధించి పుస్తకాలను ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా వాటిని విక్రయిస్తుంటుంది.