చంద్రుడిపై ల్యాండ్ కొన్న తెలంగాణ అమ్మాయి

చంద్రుడిపై ల్యాండ్ కొన్న తెలంగాణ అమ్మాయి

గోదావరిఖని, వెలుగు :  ‘‘చందమామ రావే..జాబిల్లి రావే...”అని చిన్నతనంలో గోరుముద్దలు తినిపించిన ఆ తల్లి  ప్రేమకు గుర్తుగా కూతురు ఊహించని బహుమతి అందించింది.  ఏకంగా చంద్రుడిపై తల్లి, తన కూతురు ఇద్దరి పేరుతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసింది.  వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీలో నివాసముంటూ సింగరేణి ఓసీ 5 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా డ్యూటీ  చేసే రాంచందర్‌‌‌‌‌‌‌‌, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సాయివిజ్ఞతను ఖమ్మం జిల్లాకు చెందిన నాగపురి గోపికి ఇచ్చి పెండ్లి చేశారు. పదేండ్ల కింద వీరు అమెరికా వెళ్లారు. బీటెక్‌‌‌‌‌‌‌‌ చేసిన సాయివిజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ కిమ్‌‌‌‌‌‌‌‌ రెనాల్డ్స్‌‌‌‌‌‌‌‌ వద్ద ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా, గోపి అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు  చెందిన మ్యాన్యూఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌  హెడ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. 

అయితే ప్రతీ మదర్స్‌‌‌‌‌‌‌‌ డేకు తల్లికి ఏదో ఒక గిఫ్ట్​ ఇచ్చే కూతురుకు తనతో పనిచేసే కొలిగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సమాచారంతో చంద్రుడిపై స్థలం కొనాలనే ఆలోచన వచ్చింది. చంద్రుడిపై  స్థలం కొనాలనుకునే వారికోసం అమెరికా ఎంబసీ ‘లూనార్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రీ’ అనే వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురాగా  సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, కూతురు ఆర్హా సుద్దాల నాగపురి పేరుతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేయడానికి 2022 మేలో రిజిస్ట్రేషన్ చేశారు. కాగా వీరి పేరుపై చంద్రమండలం మీద ఎకరం స్థలం కేటాయింపులు జరిగినట్టు ఈ నెల 23న డాక్యుమెంట్లు అందాయి. 

దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం గోదావరిఖనిలో ఉన్న సాయి విజ్ఞత మాట్లాడుతూ.. చంద్రమండలంపైకి వెళ్లడానికి వీలులేకపోయినా.. తల్లిపై ఉన్న ప్రేమతో స్థలాన్ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లోనైనా తమ కుటుంబంలో ఎవరైనా ఈ స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుందనే  ధీమా వ్యక్తం చేశారు. కాగా చంద్రమండలంలో ఎకరం స్థలం రూ.35 లక్షలకు పైనే ధర ఉండే అవకాశం ఉండగా, ఇప్పటి వరకు సెలబ్రిటీలైన బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నటులు షారూఖ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, సుశాంత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌ చంద్రుడిపై స్థలం కొన్న వారిలో ఉన్నారు.