పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి

పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్ల నుంచి భారీ గిరాకీ కారణంగా మనదేశంలో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74 వేలను దాటింది. దీంతో బంగారం,  వెండి ధరలు శుక్రవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ ప్రకారం, ఢిల్లీలో బంగారం ధర రూ. 400 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.74,100కి చేరుకుంది. గురువారం 10 గ్రాముల ధర రూ.73,700 వద్ద ముగిసింది. వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.86,600 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఢిల్లీ మార్కెట్లలో స్పాట్ బంగారం ధరలు (24 క్యారెట్లు) రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ.74,100 వద్ద ట్రేడవుతున్నాయి. 

హైదరాబాద్​లో శుక్రవారం పసిడి ధర రూ.74,340లకు చేరింది. విదేశీ మార్కెట్లలో సానుకూల ధోరణి కారణంగా పుత్తడి ధర రూ. 400 పెరిగిందని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌లోని కమోడిటీస్ సీనియర్ ఎనలిస్టు సౌమిల్ గాంధీ తెలిపారు.  విదేశీ మార్కెట్లలో కమోడిటీ ఎక్స్ఛేంజ్​ వద్ద స్పాట్ బంగారం ఔన్సుకు (28 గ్రాములు) డాలర్ల 2,390 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 15 డాలర్లు పెరిగింది. సిరియాలోని తన కాన్సులేట్‌‌‌‌‌‌‌‌పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసింది. అయితే ఇరాన్ గడ్డపై ఇజ్రాయెల్ లక్ష్యాలను ఛేదించిందన్న వార్తల కారణంగా శుక్రవారం గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బంగారం రికార్డు స్థాయిలో పెరిగింది.  వెండి ఔన్సు ధర 28.29 డాలర్లకు పెరిగింది. క్రితం ముగింపులో, ఇది ఔన్స్‌‌‌‌‌‌‌‌కు 28.25 డాలర్ల వద్ద ముగిసింది.