కేరళలో సుపరిపాలన బీజేపీతోనే సాధ్యం.. రాష్ట్రంలో మార్పు అనివార్యమన్న ప్రధాని మోదీ

కేరళలో సుపరిపాలన  బీజేపీతోనే సాధ్యం.. రాష్ట్రంలో మార్పు అనివార్యమన్న ప్రధాని మోదీ
  • ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌, యూడీఎఫ్​ జెండాలు వేరైనా.. వారి అజెండా ఒక్కటే
  • శబరిమల గోల్డ్ చోరీపై 
  • విచారణకు హామీ
  • కేరళ, తమిళనాడులో 
  • నిర్వహించిన సభల్లో మోదీ ప్రసంగం

తిరువనంతపురం: 
కేరళ రాజకీయాల్లో మార్పు అనివార్యమని, రాష్ట్రంలోని ‘లెఫ్ట్ ఎకో సిస్టమ్’కు టైం దగ్గరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. అధికార ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్ , ప్రతిపక్ష ‘యునైటెడ్‌‌‌‌‌‌‌‌ డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌’ (యూడీఎఫ్)  కూటములపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ, కేరళలో అవినీతికి చరమగీతం పాడుతామని తెలిపారు. గుజరాత్​లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్‌ కేరళలో కూడా రిపీట్‌ అవుతుందని అన్నారు. శబరిమల ఆలయ బంగారం చోరీ వ్యవహారంపైనా ప్రధాని స్పందించారు. కేరళలోని అధికార ‘లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ డెమోక్రటిక్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌’ (ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌) ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలను కాలరాస్తున్నదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రకటించారు.

అభివృద్ధి వైపు మూడో ప్రత్యామ్నాయం

రాబోయే ఎన్నికలు కేరళ పరిస్థితిని, దిశను మారుస్తాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేరళలో ఇప్పటివరకు మీరు ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్, యూడీఎఫ్‌‌‌‌‌‌‌‌  అనే రెండు పక్షాలనే చూశారు. ఈ రెండు కూటములు కేరళను నాశనం చేశాయి. కానీ ఇప్పుడు అభివృద్ధి, సుపరిపాలన అందించే మూడో పక్షం ఉంది.. అదే బీజేపీ” అని వ్యాఖ్యానించారు.  కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) నేతృత్వంలోని ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రధాన శక్తులుగా ఉండగా.. క్షేత్రస్థాయిలో బలోపేతమవుతున్న బీజేపీ ఇప్పుడు బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించిందని పేర్కొన్నారు.

 ‘‘ఎల్‌‌‌‌‌‌‌‌డీఎఫ్, యూడీఎఫ్ జెండాలు వేరైనా, ఎజెండా మాత్రం ఒక్కటే.. అది పూర్తి అవినీతి, సున్నా జవాబుదారీతనం. ప్రతి ఐదేండ్లకు ప్రభుత్వం మారుతుంది తప్ప వ్యవస్థ మారదు. కానీ ఇప్పుడు మీకు ప్రజాపక్ష, అభివృద్ధి అనుకూల ప్రభుత్వం అవసరం. బీజేపీ, ఎన్డీయే ఆ లోటును భర్తీ చేస్తాయి” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కేరళను వంచించిందని, ఆ పార్టీ మావోయిస్టుల కంటే ఎక్కువ కమ్యూనిస్టుగా, ముస్లిం లీగ్ కంటే ఎక్కువ మతతత్వంగా మారిందని మండిపడ్డారు. కేరళ  ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలని మోదీ పిలుపునిచ్చారు.

చిన్నారి చిత్రానికి ప్రధాని ఫిదా

సభలో ఓ చిన్నారి  చేతితో గీసిన తన చిత్రపటాన్ని పట్టుకుని ఉండటాన్ని మోదీ గమనించారు. ‘అంతసేపు నిల్చుంటే అలసిపోతావు. దానిమీద నీ అడ్రస్​ రాసివ్వు. నేను లేఖ రాస్తాను. ఆ చిత్రం బాలుడి ప్రేమకు నిదర్శనం. దానిని జాగ్రత్తగా తెండి’’ అని  తన సిబ్బందికి చెప్పారు.

తమిళనాడులో డీఎంకేకు కౌంట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. జయలలిత హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ అద్భుతంగా ఉండేవని  కొనియాడారు. డీఎంకే హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. 

డీఎంకే అంటే  ఒకప్పుడు ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ అని అర్థం ఉండేదని, కానీ ఇప్పుడు అది సీఎంసీ అంటే కరప్షన్​, మాఫియా, క్రైంగా మారిందని అన్నారు. ‘‘తమిళనాడులో ఇప్పుడు ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం లేని ప్రభుత్వం ఉంది. ఇది కేవలం ఒక కుటుంబం కోసమే పని చేస్తున్నది. డీఎంకేలో ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలను లేదా సంస్కృతిని అవమానించడం అనే మార్గాలనే ఎంచుకోవాలి” అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటేనే భారీ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.