Anil Ambani: అనిల్ అంబానీకి మరో శుభవార్త.. వెనక్కి తగ్గిన కెనరా బ్యాంక్!

Anil Ambani: అనిల్ అంబానీకి మరో శుభవార్త.. వెనక్కి తగ్గిన కెనరా బ్యాంక్!

Reliance Communications: అనిల్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్‌కామ్ తీసుకున్న రుణాలను కెనరా బ్యాంక్ 'మోసపూరితమైనది' (fraudulent)గా వర్గీకరించిన నిర్ణయాన్ని కెనరా బ్యాంక్ తాజాగా ఉపసంహరించుకుంది. బ్యాంక్ తన నిర్ణయాన్ని నేడు బాంబే హైకోర్టుకు తెలియజేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ పరిణామం ఆర్‌కామ్ తో పాటు దాని అనుబంధ సంస్థలకు కొంత ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.

కెనరా బ్యాంక్ నవంబర్ 8, 2024న ఆర్‌కామ్ రుణ ఖాతాను 'ఫ్రాడ్'గా ప్రకటించింది. 2017లో మూలధన వ్యయం, రుణ చెల్లింపుల కోసం ఇచ్చిన రూ.1,050 కోట్ల రుణాలను సంస్థ దుర్వినియోగం చేసిందని.. అంతర్గత లావాదేవీల ద్వారా నిధులను మళ్లించిందని బ్యాంక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిధులు మ్యూచువల్ ఫండ్‌లు, స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టబడ్డాయని, వాటిని ఇతర సంబంధిత, సంబంధం లేని పార్టీలకు చెల్లింపులు చేయడానికి ఉపయోగించారని బ్యాంక్ పేర్కొంది. దీంతో ఆర్‌కామ్ రుణ ఖాతాలు మార్చి 9, 2017న నిరర్ధక ఆస్తులుగా మారినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఆ తర్వాత ఆర్బీఐ మోసపూరిత ఖాతాలకు సంబంధించి జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ఆధారంగా తమ వర్గీకరణ జరిగినట్లు బ్యాంక్ తెలిపింది.

ALSO READ : అదరగొట్టిన టీసీఎస్.. అంచనాలకు మించి క్యూ1 లాభాలు, డివిడెండ్ ప్రకటన..

అయితే రుణ ఖాతాలను ఫ్రాడ్ అని ట్యాగ్ చేయటంపై.. కెనరా బ్యాంక్ నిర్ణయాన్ని అనిల్ అంబానీ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. రుణ ఖాతాను 'మోసపూరితమైనది'గా ప్రకటించే ముందు తమకు విచారణ అవకాశం కల్పించలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అంబానీ తరపు న్యాయవాదులు వాదించారు. RBI మాస్టర్ సర్క్యులర్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రుణగ్రహీతలకు విచారణ అవకాశం కల్పించకుండా వారి ఖాతాలను 'ఫ్రాడ్'గా ప్రకటించకూడదని అంబానీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాంబే హైకోర్టు ఫిబ్రవరి 2025లో కెనరా బ్యాంక్ 'ఫ్రాడ్' వర్గీకరణ ఉత్తర్వుపై స్టే విధించింది.

కెనరా బ్యాంక్ 'ఫ్రాడ్' ట్యాగ్‌ను ఉపసంహరించుకోవడానికి ప్రధాన కారణం బొంబాయి హైకోర్టు జోక్యం, విచారణ అవకాశం కల్పించాలనే న్యాయపరమైన ఆదేశాలని తెలుస్తోంది. రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా ప్రకటించే ముందు రుణగ్రహీతలకు విచారణ అవకాశం ఇవ్వడం తప్పనిసరి అనే అంశంపై కోర్టు పదేపదే నొక్కి చెప్పింది. అయితే ఆర్‌కామ్ 2018 నుండి దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. దివాలా ప్రక్రియలోకి వెళ్లకముందే ఈ రుణాలు తీసుకున్నందున, కంపెనీకి దావాల నుంచి రక్షణ ఉందని ఆర్‌కామ్ వాదించింది. 'ఫ్రాడ్'గా వర్గీకరించడం వల్ల జరుగుతున్న దివాలా ప్రక్రియపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ వెల్లడించింది. 

మెుత్తానికి కెనరా బ్యాంక్ 'ఫ్రాడ్' ట్యాగ్‌ను ఉపసంహరించుకోవడం ఆర్‌కామ్ కు స్వల్పకాలిక ఉపశమనం. కానీ ఈ కేసు పూర్తిగా ముగిసినట్లు కాదు. ప్రస్తుతం బాంబే హైకోర్టు తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులను బ్యాంకులు ఎలా హ్యాండిల్ చేస్తాయో అన్న దానిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రుణగ్రస్తుల హక్కులను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ పాత్ర ఎంత ముఖ్యమో ఈ కేసు చెబుతోంది.