స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన విజయాలన్నిటినీ గూగుల్ వీడియో రూపంలోకి తీసుకొచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఇండియా కా ఉడాన్ అనే పేరుతో వీడియో రిలీజ్ చేసింది. రాజ్యాంగ రూపకల్పన, ఎన్నికల నిర్వహణ నుంచి స్పేస్ లోకి శాటిలైట్లు పంపడం, క్రికెట్ లో ప్రపంచ కప్ గెలవడం వరకు అనేక అచీవ్ మెంట్స్ ను వీడియోలో పొందుపరిచింది. వీడియోలు, ఫొటోలు, డ్రాయింగ్స్, కథనాలతో స్వతంత్ర భారత విశేషాలను పొందుపరిచింది. ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం.. ఇప్పడు డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉందంటూ తీసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
గత 75 సంవత్సరాల్లో దేశం సాధించిన గొప్ప విజయాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ అత్యంత ఆకర్షణీయంగా తెలుపుతోంది. 2 నిమిషాల వీడియో మరింత ప్రత్యేకంగా ఉంది. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగం ఈ ఇండియా కీ ఉడాన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, తీసుకొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈనెల 15వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా గత ఏడాది నుంచే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 1947 నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో, విజయాల్లో కీలకమైన ఘట్టాలను, సందర్భాలతో కూడిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రజలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని వెల్లడించింది.
