గోల్ కొట్టేదెవరో? .. గోషామహల్ సెగ్మెంట్​లో హోరాహోరీ పోరు

గోల్ కొట్టేదెవరో? .. గోషామహల్ సెగ్మెంట్​లో హోరాహోరీ పోరు
  • బీజేపీ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని రాజాసింగ్ ​ముమ్మర ప్రచారం
  • కాంగ్రెస్ నుంచి బరిలోకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావు 
  • బీఆర్ఎస్ నుంచి పోటీలో  నందకిషోర్ వ్యాస్ బిలాల్ 
  • ఈసారి టికెట్ స్థానికులకు ఇవ్వాలని పట్టుబట్టిన గులాబీ లోకల్ లీడర్లు  
  • అధిష్టానం ఇవ్వకపోవడంతో కొందరు నేతలు రాజీనామా
  • గెలుపోటములను నిర్ణయించేది సెటిలర్లే

హైదరాబాద్, వెలుగు : దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే సెగ్మెంట్ గోషామహల్. వ్యాపార, వాణిజ్య పరంగా పలు రాష్ట్రాలకు అన్నిరకాల వస్తు సామగ్రి పంపించే హోల్‎సేల్ మార్కెట్లకు నెలవైన బేగంబజార్ ఈ సెగ్మెంట్​లోనే ఉంది. ఇక్కడ వ్యాపారంతో పాటు రాజకీయాలు సైతం అదే రేంజ్‌‌‌‌లో ఉంటాయి.  ఎక్కువ మంది సెటిలర్లే ఉంటారు. గెలుపోటములను కూడా వారే నిర్ణయిస్తారు. మహరాజ్‌‌‌‌‎గంజ్‌‌‌‌‎ సెగ్మెంట్ నుంచి 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా గోషామహల్‌‌‌‌గా ఏర్పడింది. బేగంబజార్, గన్ ఫౌండ్రీ, జాంబాగ్, గోషామహల్, మంగళ్‌‌‌‌హట్, దత్తాత్రేయనగర్ ఆరు డివిజన్లతో సెగ్మెంట్ ఉంది. 

రాజాసింగ్ అడ్డాపై గురి..

ఒకప్పుడు రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలదే హవా కొనసాగింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్​ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత  జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. దీంతో ఆయనపాలిటిక్స్‌‌‌‌కు కేరాఫ్‌‌‌‌గా మారిపోయారు. కార్పొరేటర్‌‌‌‌గా పొలిటికల్‌‌‌‌ కెరీర్‌‌‌‌ ప్రారంభించిన రాజాసింగ్‌‌‌‌ తక్కువ కాలంలోనే స్థానికంగా పట్టు సాధించారు.  ఈ సెగ్మెంట్​లో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు, ఒక మజ్లిస్‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌ ఉండగా మరోసారి బీజేపీ నుంచి రాజాసింగ్ బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా బలంగానే ఉండగా...

గతంలో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన నంద కిశోర్ వ్యాస్ బిలాల్ బీఆ
ర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు మొదటిసారి బరిలోకి దిగారు.  హ్యాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ ముమ్మర ప్రచారం చేస్తుండగా.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాజాసింగ్‎ అడ్డాలో జెండా పాతాలని గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. 

సెటిలర్లవే ఎక్కువ ఓట్లు 

సెగ్మెంట్ పరిధిలో 59 మురికి వాడలు, 32 దళిత బస్తీలు ఉండగా 2,66,909 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో  ముస్లింలు 60 వేలు, క్రిస్టియన్లు 17 వేలు, ఎస్సీ, బీసీలు 73 వేల మంది ఓటర్లు ఉండగా.. మిగతా ఓటర్లు సెటిలర్లవే. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు లక్షకుపైగానే ఉంటాయి. ఉత్తర భారత్ నుంచి వచ్చి  స్థిరపడిన లోథి వంశస్తుడు రాజాసింగ్​కు సెగ్మెంట్ పరిధిలో తన వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ దాదాపు 30 వేలు ఉంది. ఇక రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆఫీసులు కూడా ఇక్కడే ఉండగా.. ఇప్పటివరకు మజ్లిస్ ఇక్కడి నుంచి పోటీ చేయలేదు.  

స్థానికుడికే ఇవ్వాలని పట్టుబట్టినా.. 

బీఆర్ఎస్​ నుంచి టికెట్ ఆశించిన ఆశావహులు పార్టీలు మారారు. 2018లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీలో చేరారు. ఇక్కడి టికెట్​ను స్థానికులకే ఇవ్వాలని కొందరు నేతలు పట్టుపట్టారు. గడ్డం శ్రీనివాస్, ఆర్వీ మహేందర్​తో పాటు అధికార పార్టీలో ఇంకొందరు టికెట్ ఆశించినా దక్కలేదు. వీరు పార్టీ మారనప్పటికీ, వీరి వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్​కు కాస్త ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.