బీసీలను మోసం చేస్తున్నప్రభుత్వాలు

బీసీలను మోసం  చేస్తున్నప్రభుత్వాలు

మనదేశంలోని బీసీలను తరతరాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురి చేస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు 56% ఉన్న  బీసీలకు రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లుగానే చూస్తూన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం ప్రవేశపెట్టిన  బడ్జెట్లో కూడా బీసీలకు న్యాయం జరగలేదు. మనదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను స్థాపించిన వాళ్ళు, పార్టీలను నడిపించేవాళ్ళు కూడా అగ్రకులాలవాళ్ళే.  అటు కులాల ఆధిపత్యం ఓ వైపు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు మధ్యలో నలుగుతూ బీసీ కులాలు ఏండ్ల తరబడి హక్కులను పొందలేక, అభివృద్ధి సాధించేలేక సతమతమవుతూనే ఉన్నారు.

దేశంలో జంతువులు ఎన్ని ఉన్నాయో, ఏ ఏ రకానికి చెందిన  చెట్లు, పక్షులు ఎన్ని ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లెక్కలున్నాయి కాని దేశంలో సగభాగమైన బీసీలకు సంబంధించి  ఇప్పటి వరకు ఎలాంటి లెక్కలు లేకపోవడం బాధాకరం.  తరతరాలుగా  బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనేక రకాలుగా అణచివేతకు గురి అవ్వడానికి ప్రధాన కారణం వీళ్ళకు విద్య లేకపోవడమే. ఫలితంగా వీరికి జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు వెంటనే పసిగట్టలేకపోయారు. మనదేశం స్వాతంత్ర్యం సంపాదించుకుని దేశంలోని ప్రజలందరికీ స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వంగా ఉండాలని వేల సంవత్సరాలుగా అనేక అణచివేతలకు గురి అవుతున్న వాళ్ళకోసం రాజ్యంగ నిర్మాతలు  కొన్ని ప్రత్యేక హక్కులను, రిజర్వేషన్లను అందించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను అమలు చేయడానికి, ఆర్టికల్ 340 ప్రకారం దేశంలోని వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను  తెలుసుకోవడం కోసం 1978 సంవత్సరం డిసెంబర్​లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 5మంది సభ్యులతో కూడిన ఒక కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్‌‌‌‌‌‌‌‌కు చైర్మన్ గా బి.పి మండల్​ను నియమించారు. మండల్ కమిషన్ భారతదేశంలో మొత్తం 3743 హిందూ/ హిందూయేతర కులాలున్నాయని, వీరి అభివృద్ధి కోసం40 అంశాలతో ఒక నివేదికను తయారు చేసింది.  భారత రాజ్యాంగంలో ఆర్టికల్15 (4), 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారికి జాతీయ బ్యాంకుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వం నుండి సాయం అందుకుంటున్నా ప్రయివేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో   27% రిజర్వేషన్లను అమలు చేయాలని  బి.పి మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31నాటికి తన నివేదికను  కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ కమిషన్ నివేదికను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పరిశీలనలోకి వచ్చింది, కాని అమలు జరుగలేదు. పది సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఈ సిఫార్స్ లను అమలు  చేసింది. 1990 నుండి ఉద్యోగాలలో, 2008 నుండి కేంద్రీయ విద్యాసంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 

బీసీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం..
మండల్ కమిషన్ తమ నివేదికను ఇచ్చి, 2020 డిసెంబర్ 31వ తేదికి 40 సంవత్సరాలు పూర్తి అయినా, ఇంకా బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో ఇంకా రిజర్వేషన్లను అమలు చేయడం లేదు.  భారత దేశ జనాభాలో 56% ఉంటే కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలలో వీరి ఉద్యోగ భాగస్వామ్యం 21% మాత్రమే. 1993 సం. జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ వేసి, ఈ కమిటీ ద్వారా ఓబీసీలలోని ఉన్నత వర్గ శ్రేణులను రిజర్వేషన్ల నుండి తొలగించి, ఓబీసీల వార్షికాదాయం లక్ష రూపాయల పరిమితిని పెట్టారు. ఈ ఆదాయ పరిమితిని ప్రతి మూడేండ్లకు ఒకసారి  పెంచాలని ఈ కమిటీ సూచించింది.  ఈ రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 30 ఏండ్లు పూర్తయ్యాయి. కమిటీ సూచనల ప్రకారం ఓబీసీల ఆదాయ పరిమితి 30 లక్షలుండాలి. కానీ 2017 ఓబీసీల ఆదాయ పరిమితి ప్రకారం  8 లక్షలు మాత్రమే ఉంది. ఈ  బలవంతపు క్రిమిలేయర్ విధానం ఏర్పాటు చేసి బీసీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే చేస్తోంది.  రాష్ర్ట జనాభాలో 65% ఉన్న బీసీలకు ప్రత్యేక పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసి విద్యార్థులకు, మేథావులకు ఎలాంటి సబ్సిడీలు, రుణాలు మంజూరు చేయడంలో, కుటీర పరిశ్రమల ఏర్పాట్లు, కుల వృత్తుల వారికి శిక్షణ, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు బీసీ
 స్టడి సర్కిల్స్‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యింది.  

ప్రతీ ఏటా నష్టపోతున్న సీట్లు..
ఉద్యోగ భాగస్వామ్యం కేవలం 21% మాత్రమే. పారిశ్రామిక రంగంలో బీసీ కులాల ప్రాతినిధ్యం 2% మాత్రమే.  మరోవైపు తెలంగాణ  రాష్ర్ట ప్రభుత్వం ఐదు కొత్త  ప్రయివేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు, ఫీజ్ రీయంబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండదని రాష్ర్ట ప్రభుత్వం స్పష్టం చేసింది.  తెలంగాణలో చాలా ప్రభుత్వ బడులను, కాలేజీలలో ఖాళీగా ఉన్న పోస్ట్‌‌‌‌‌‌‌‌లను భర్తీ చేయకుండా, పరోక్షంగా ప్రయివేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తోంది.  నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్‌‌‌‌‌‌‌‌, రీసెర్చ్ యూనివర్శిటీ చట్టం1998 ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో 23 లా కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలు ఏర్పడినప్పటి నుండి నేటి వరకు కూడా ఇందులో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేదు. అంతే కాకుండా 
స్థానికంగా రావాల్సిన రిజర్వేషన్లను కూడా అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఐఐటీ, ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీ, ఏయిమ్స్‌‌‌‌‌‌‌‌, వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలలో రిజర్వ్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తోంది.  మెడికల్ సీట్లలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌లో, స్లైడింగ్​లో  మిగిలిన సీట్లను భర్తీ చేశాకే, సెకండ్  ఫేజ్ కౌన్సిలింగ్ చేపట్టాలి. కాని  ప్రభుత్వం మాత్రం రిజర్వుడ్ సీట్లను భర్తీ చేసి, ఆ తర్వాత ఓపెన్ సీట్లను భర్తీ చేయాలని కుట్ర చేస్తోంది. ఫలితంగా బీసీ విద్యార్థులు  ప్రతి సంవత్సరం సుమారు ఎంబీబీఎస్ లో-1427, బీడీఎస్-102, మెడికల్ పీజీ సీట్లు 222 నష్ట పోతున్నారు.

ప్రయివేటు వ్యవస్థలను ప్రోత్సహిస్తున్న సర్కారు..
రాష్ర్టంలో 11 రాష్ర్ట స్థాయి యూనివర్సిటీలు, 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 2 జాతీయ స్థాయి ఎన్‌‌‌‌‌‌‌‌టీ,  ట్రిఫుల్ ఐటిలు, ఒక డిమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి. దాదాపు రాష్ర్ట స్థాయిలో ఉన్న ఏ ఒక్క  యూనివర్శిటీలో కూడా వైస్ చాన్సులర్స్  లేరు. ఫలితంగా అసిస్టెంట్, అసోసియేట్,  ప్రొఫెసర్ పోస్టులన్నీ  ఖాళీలుగానే ఉన్నాయి. ఈ ఖాళీల ఫలితంగా పరిశోధన రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇదొక గొడ్డలిపెట్టుగా మారింది. పర్యవేక్షకులు లేకుంటే పరిశోధనలో నాణ్యత పడిపోతుంది. ఫలితంగా యూజీసీ రాష్ర్ట ప్రభుత్వాలను నుండి రావాల్సిన గ్రాంట్స్ నిలిచిపోతాయి. మరోవైపు దేశంలో దాదాపు 40 సెంట్రల్ యూనివర్శిటీలు ఉంటే, వాటిలో 90% ఓబీసీ ప్రొఫెసర్ల ఖాళీలున్నాయి. కేంద్ర, రాష్ట్రస్థాయిలలోని  యూనివర్శిటీలు రిజర్వేషన్లను,  యూజీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ, బీసీ విద్యార్థులకు సంబంధించిన పీహెచ్డీ, ఎంఫిల్ సీట్లను భర్తీ చేయకుండా తమ కులాలకు చెందిన టాలెంట్ లేని విద్యార్థులకు సీట్లు ఇస్తూ, నిజమైన ప్రతిభ ఉన్న  బీసీ కులాలకు చెందిన విద్యార్థులను మానసికంగా వేదనకు గురిచేస్తున్నారు. అంతే కాకుండా యూనివర్శిటీ స్థాయి మహిళా ఉద్యోగులపై, నాన్ టీచింగ్ ఉద్యోగులను కూడా ఉన్నత వర్గాలకు చెందిన అధికారులు అనేక ఇబ్బందులకు, దాడులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ప్రవర్తిస్తున్న వివక్షలను ఆపేసి, ప్రైవేట్ రంగంలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు  చేస్తూ,  వారిపై దాడులు అరికట్టేందుకు సామాజిక భద్రతా చట్టం తీసుకువచ్చి బీసీలను దేశ అభివృద్ధిలో, పాలనలో భాగస్వామ్యం చేయకుంటే , దేశంలోని అన్ని  బీసీ సంఘాలు, నాయకులు, పార్టీలు, ప్రజలందరూ  ఐక్యం అయ్యి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

ఎంపీలు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఎమ్మెల్యేలు కూడా
ఇది మాత్రమే కాకుండా తెలంగాణలో బీసీల జనాభా 65 % ఉంటే, దాదాపు 65 మంది ఉండాల్సిన ఎమ్మెల్యేల స్థానంలో  కేవలం 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 17 ఎంపీ స్థానాలుంటే, ఇందులో ఏడుగురు ఎంపీలు ఉండాల్సిన స్థానంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1952 నుండి నేటి వరకు  అగ్ర కులాలకు చెందిన ఎమ్మెల్యే లు 976 మంది ఉన్నారు. బీసీలు కేవలం 260 మంది మాత్రమే ఉన్నారు.  ఎస్సీలు 274, ఎస్టీలు 104 మంది ఉన్నారు.   బీసీలను తరతరాలుగా అణచివేతకు గురి చేస్తూ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురి చేస్తున్నారు.   మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత వర్గాల జనాభా 7.6 % మాత్రమే. వీళ్ళలో కేవలం 1.8-2% మాత్రమే నిరుపేదలున్నారు. 2% కూడా లేని ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించి దేశ జనాభాలో 52% ఉన్న బీసీలకు మాత్రం 27% తెలంగాణలో 65% ఉన్న బీసీలకు 29% అందిస్తూ వారిని మరింత పేదరికంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.