ఆండ్రాయిడ్​ ఫోన్​లలో చొరబడే వైరస్

ఆండ్రాయిడ్​ ఫోన్​లలో చొరబడే వైరస్

న్యూఢిల్లీ : దేశంలోని మొబైల్​ బ్యాంకింగ్​ కస్టమర్లకు కొత్త ట్రోజాన్​ వైరస్ ​ముప్పు వచ్చి పడింది. ఆండ్రాయిడ్​ ఫోన్​లలోకి చొరబడే ఈ వైరస్​ను అన్​ ఇన్​స్టాల్​ చేయడం కష్టతరమని సైబర్​ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. జులై నెలలో మొదటిసారిగా ఈ సోవా వైరస్​ మన దేశంలో కనిపించిందని, ఇప్పుడు అయిదో వెర్షన్​కు అప్​గ్రేడ్​ అయిందని తెలిపింది. ఈ వైరస్​పై సెర్ట్​కు రిపోర్టు చేశారు కూడా. యూజర్​ నేమ్స్​, పాస్​వర్డ్స్​ను తెలుసుకునే శక్తి ఈ సోవా వైరస్​కు ఉందని, కీ లాగింగ్​, స్టీలింగ్​ కుకీస్​, ఫాల్స్​ ఓవర్​లేస్​ వంటి టెక్నిక్స్​తో ఈ వైరస్​ మన డేటా దోచుకుంటోందని సైబర్​ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సెప్టెంబర్​ 2021 నుంచి అండర్​ గ్రౌండ్‌​ మార్కెట్లలో ఈ సోవా వైరస్​ను అమ్ముతున్నట్లు పేర్కొంది. గతంలో యూఎస్​, రష్యా, స్పెయిన్​ వంటి దేశాలపైనే ఈ సోవా వైరస్​ ఫోకస్​ ఉండేదని, కానీ జులై 2022 నుంచి మన దేశంలోని మొబైల్​ బ్యాంకింగ్​ కస్టమర్లపైనా గురి పెట్టారని వివరించింది. ఫేక్​ ఆండ్రాయిడ్​ అప్లికేషన్స్​లో సోవా వైరస్​ దాక్కుంటుంది. క్రోమ్​, అమెజాన్​, ఎన్​ఎఫ్​టీ వంటి ఫేమస్​ అప్లికేషన్ల తరహాలోనే ఈ సోవా వైరస్​ లోగో ఉంటుందని సైబర్​ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. యూజర్లను ఇన్​స్టలేషన్​కు ప్రేరేపించడం కోసమే ఫేమస్​ అప్లికేషన్ల మాదిరిగా లోగోను వైరస్​కు వాడుతున్నట్లు హెచ్చరించింది. బ్యాంక్​ అకౌంట్లను చూసుకోవడానికి కస్టమర్లు నెట్​ బ్యాంకింగ్​లోకి లాగ్​ ఇన్​ అయినప్పుడు ఆ డేటాను ఈ మాల్​వేర్​ దొంగిలిస్తుంది. మొత్తం 200 మొబైల్​ అప్లికేషన్స్​ను సోవా వైరస్​ టార్గెట్​ చేసినట్లు సమాచారం ఉంది. బ్యాంకింగ్ యాప్స్​తోపాటు​, క్రిప్టో ఎక్స్చేంజీలు, వాలెట్లను సైతం ఈ వైరస్​ వదిలి పెట్టడం లేదు. ఈ హెచ్చరికలను దేశంలో సైబర్​ ఎటాక్స్​ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జన్సీ రెస్పాన్స్​ టీమ్​ (సెర్ట్​) జారీ చేసింది. ఇంటర్​నెట్​ ఫిషింగ్​, హ్యాకింగ్​ ప్రయత్నాలను, ఇతర ఆన్​లైన్​ అటాక్స్​ నుంచి దేశంలోని ప్రజలను  రక్షించేందుకు సెర్ట్​ ప్రయత్నిస్తోంది. 

ఎస్​ఎంఎస్ (స్మిషింగ్​) ద్వారానే ఈ మాల్​వేర్​ డిస్ట్రిబ్యూట్​ అవుతున్నట్లు గుర్తించారు. చాలా ఆండ్రాయిడ్​ బ్యాంకింగ్​ ట్రోజన్లు ఈ తరహాలోనే డిస్ట్రిబ్యూట్​ అవుతున్నట్లు సమాచారం. ఈ ట్రోజాన్​ వైరస్​ ఒకసారి ఆండ్రాయిడ్​ అప్లికేషన్​లోకి చొరబడిన తర్వాత ఆ ఫోన్​లోని అన్ని అప్లికేషన్ల వివరాలనూ సీ2 (కమాండ్​ అండ్​ కంట్రోల్​ సర్వర్)కి అంటే మోసగాళ్లకు  పంపిస్తుంది.  సోవా వైరస్​ను కొంత మంది మోసగాళ్లు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నట్లు కూడా సెర్ట్​ చెబుతోంది. సోవా వైరస్​ చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తున్న నేపథ్యంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. యూజర్లు ఈ సోవా వైరస్​ మాల్​వేర్​ యాప్​ను గుర్తించి, అన్​ ఇన్​స్టాల్​ చేయడానికి ప్రయత్నిస్తే ఆ విషయం వెంటనే హోమ్​ స్క్రీన్​కి తీసుకెళ్లిపోతుందని, తద్వారా యూజర్ల ప్రయత్నాలను అడ్డుకుంటుందని వివరించింది.