ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్..నేటి నుంచి మార్చి 9వ వరకు నిర్వహణ

 ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్..నేటి నుంచి మార్చి 9వ వరకు నిర్వహణ
  • పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
  • కలెక్టర్లతోపాటు ఆర్డీవోలు, ఎమ్మార్వోలకూ అధికారాలు
  • ప్రతి మండలంలో 23 టీమ్స్, హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు
  • కొత్తగా సమస్యలున్నా పరిష్కారం 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​లో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలిపింది. ధరణిలో పెండింగ్ లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ఈ తొమ్మిది రోజుల్లో పరిశీలించి, భూసమస్యలను పరిష్కరించాలని చెప్పింది. 

అదే విధంగా ప్రతి మండలంలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎవరైనా భూసమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించాలని సూచించింది. ఈ మేరకు ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి గురువారం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సీసీఎల్ఏ, కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలకు అధికారాలు అప్పగించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని, ఒక్క అప్లికేషన్ కూడా పెండింగ్ లో ఉండొద్దని ఆదేశించింది. 

అన్ని రికార్డులు పరిశీలించే అధికారం..  

ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రతి మండలంలో 2-3 టీమ్స్ ను నియమించనున్నారు. ఈ టీమ్స్ తహసీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో పని చేస్తాయి. వీళ్లు ప్రతి దరఖాస్తును పరిశీలించి, అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. పారాలీగల్స్, డీఆర్డీఏలో పని చేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, ఏఈవోలు, పంచాయతీ సెక్రటరీలు కూడా స్పెషల్ డ్రైవ్ లో పాలుపంచుకుంటారు. గ్రామాల వారీగా, మాడ్యూళ్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి టీమ్స్ కు తహసీల్దార్ అందజేస్తారు. ప్రతి దరఖాస్తుదారుడికి వాట్సాప్ ద్వారా సమాచారం అందజేస్తారు. వీళ్లు ఏవైనా డాక్యుమెంట్లు అవసరమైతే అడుగుతారు. సేత్వార్, ఖాస్రా, సెస్సాలా పహానీలు, పాత పహానీ, 1బి రిజిస్టర్, ధరణి డేటాను పరిశీలిస్తారు. అవసరమైతే అసైన్ మెంట్, ఇనాం, పీవోటీ రిజిస్టర్స్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ ల్యాండ్ రికార్డులు కూడా పరిశీలించే అధికారం ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎవరెవరికి ఏ అధికారాలు ఇచ్చారంటే.. 

కలెక్టర్ లెవెల్: మ్యుటేషన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, సెమీ అర్బన్ ఏరియాలో పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాసు పుస్తకాల జారీ, ఇండ్లు లేదా నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్ వంటివి కలెక్టర్ చూస్తారు. అన్ని మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను రిపోర్టుల ఆధారంగా అప్రూవల్ చేయాలి. -టీఎం 33 కింద వచ్చిన పాస్ బుక్ డేటా కరెక్షన్ లో పేరు మార్పు, ధరణి రాకముందే చదరపు గజాల్లో అమ్మేసిన భూములు. ఎకరం రూ.5 లక్షలకు పైగా ఉన్న భూముల్లో విస్తీర్ణం, సర్వే నెంబరు మిస్సింగ్ వంటి సమస్యలను కలెక్టర్లు పరిష్కరించారు. కాగా, కలెక్టర్ 7 రోజుల్లోగా తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను పరిష్కరించారు. అదనపు కలెక్టర్ మూడ్రోజుల్లోగా చేయాలి.  

సీసీఎల్ఏ లెవెల్: టీఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్సఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువజేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి సీసీఎల్ఏ చేస్తారు. ఎమ్మార్వో లెవెల్: టీఎం4–విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టీఎం10– జీపీఏ, ఎస్పీఏ, టీఎం14– స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టీఎం 32–ఖాతా మెర్జింగ్ వంటివి ఎమ్మార్వో చూస్తారు. వీటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. ఆర్డీవో లెవెల్: టీఎం 7–పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్,  టీఎం 16–ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టీఎం 20–ఎన్ఆర్ఐ లకు సంబంధించిన సమస్యలు, టీఎం 22–సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టీఎం 26–కోర్టు కేసులు, సమాచారం, టీఎం 33–డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, విస్తీర్ణం, సర్వే నెంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో మాత్రమే) లాంటివి పరిష్కరిస్తారు. కాగా, ఆర్డీవో తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను మూడ్రోజుల్లోగా పరిష్కరించాలి. 

2019 కీసర మోడల్​లో.. 

2019లో కీసరలో నిర్వహించిన ‘మీ భూమి–మీ పత్రాలు’ కార్యక్రమంలో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించారు. అప్పుడు  ఇలాగే స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. భూసమస్యలపై ఫిర్యాదులు తీసుకుని వెంటనే పరిష్కరించారు. అప్పుడు కీసర ఆర్డీఓగా ఉన్న లచ్చిరెడ్డినే  ప్రస్తుత సీఎంఆర్​ఓగా ఉన్నారు. ధరణి కమిటీలో లచ్చిరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్​కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. 

రాష్ట్ర స్థాయిలో సీఎస్, రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ కూడా రోజువారీగా ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపారనేది తెలుసుకునేలా స్పెషల్ డ్రైవ్​ను డిజైన్​చేశారు. అదే సమయంలో ఇప్పటికే ఎమ్మార్వో, ఆర్డీఓల నుంచి రిపోర్ట్​లు వచ్చి కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కావాల్సిన వాటికి వెంటనే ఆమోదం తెలపనున్నారు. అన్ని రిపోర్ట్​లు పూర్తి చేసుకుని సీసీఎల్ఏకు అప్రూవల్​ కోసం వచ్చిన అప్లికేషన్లకు రోజు వారీగా ఆమోదం తెలపనున్నారు. 

త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం: పొంగులేటి 

ధరణికి సంబంధించి 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా, దురుద్దేశంతో తీసుకొచ్చిన ధరణితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ధరణితో ప్రజల జీవితాలను గత ప్రభుత్వం ఆగం చేసింది. రెవెన్యూ వ్యవస్థను కొల్లగొట్టింది. లక్షలాది ఎకరాలు మాయం చేసింది. గత ప్రభుత్వ పెద్దలే భూదందాలకు అండగా నిలిచారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఈ సదస్సులు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంచేసిన తప్పులు మేం సరిదిద్దుతున్నం. ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నం” అని పేర్కొన్నారు. త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్టు.. 

అవసరమైతే దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విజిట్​ చేయాలని ప్రభుత్వం సూచించింది. మండలాల్లో ఏర్పాటు చేసే టీమ్స్​ క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత అప్లికేషన్లపై రిపోర్ట్ అందజేస్తాయి. ప్రతి రిపోర్ట్ తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీకి పంపిస్తాయి. ఆ అథారిటీ వాటిని నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉన్నతాధికారులను తెలియజేస్తుంది. కాగా, స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్​ను ధరణి కమిటీనే డిజైన్ చేసింది. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఈ డ్రైవ్ పూర్తి చేయాలని గైడ్ లైన్స్​లో పేర్కొన్నారు.