
- భూమిలోంచి తోడే ప్రతి లీటర్ వాటర్‌కూ లెక్క చెప్పాల్సిందే
- బోర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందే
- ఇండస్ట్రీస్, అపార్ట్మెంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, బల్క్ వాటర్ సప్లయర్స్‌పై కొరడా
- ఇప్పటికే పలు జిల్లాల్లో నోటీసులిస్తున్న ఆఫీసర్లు
- క్రమంగా అన్ని ఇండ్లకూ వర్తింపజేసే ఆలోచన
- తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ –2023 రెడీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తామంటే ఇకపై కుదరదు. ‘తెలంగాణ స్టేట్ గ్రౌండ్‌వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్–2023’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనలతో గ్రౌండ్‌వాటర్ విచ్చలవిడి వినియోగానికి చెక్ పడనుంది. కొత్త రూల్స్ ప్రకారం.. బోర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి, రోజుకు వెయ్యి లీటర్లు మించితే స్లాబులవారీగా ఫీజులు గుంజుతారు. దశల వారీగా ఇండస్ట్రీస్, అపార్ట్మెంట్స్, హౌసింగ్ సొసైటీలు, బల్క్‌వాటర్ సప్లయర్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లయర్స్, వాటర్ ట్యాంకర్స్ యాజమానుల నుంచి వాటర్సెస్ వసూలు చేయనున్నారు. మొదట పలు పరిశ్రమల్లో ఈ నెల నుంచే అమలు చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. గ్రౌండ్‌వాటర్ కంట్రోల్ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సర్కారు చెప్తుండగా, భగీరథ వాటర్ ఫ్రీగా ఇస్తున్న సర్కారు, ఆ లోటును పూడ్చుకునేందుకు వాటర్సెస్ను తెరపైకి తెస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జీవో 15లో మార్గదర్శకాలు
బోర్ల ద్వారా నీళ్లను ఇష్టమున్నట్టు వాడుకోకుండా సర్కారు ఇటీవల జీవో నెంబర్ 15 ద్వారా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే, ఆదాయం పెంచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవోను ఒక్కసారే అమలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని భావించిన ప్రభుత్వం దశల వారీగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మొదట ASఅండర్గ్రౌండ్వాటర్ఉపయోగించే పరిశ్రమలపై దృష్టి సారించారు. సింగరేణి, ఐటీసీ, గ్రానైట్స్‌తో పాటు ఇతరత్రా భారీ పరిశ్రమల నుంచి వాటర్ సెస్ వసూలు చేసేందుకు ఇప్పటికే ఆఫీసర్లు నోటీసులు పంపించినట్టు సమాచారం.
ఇవీ రూల్స్
గ్రౌండ్ వాటర్ఎక్స్ట్రాక్షన్ రూల్స్‌లో భాగంగా బోర్ల ద్వారా వచ్చే భూగర్భ జలాలను కొలిచేందుకు టెలిమెట్రీ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేస్తారు. వీటికి స్మార్ట్ మీటర్లను కూడా బిగిస్తారు. జీవో ప్రకారం 25 క్యూబిక్ మీటర్ల (క్యూబిక్ మీటర్వెయ్యి లీటర్లు) వరకు ఫ్రీగా వినియోగించుకోవచ్చు. రెసిడెన్షియల్అపార్ట్మెంట్లు, హౌసింగ్సొసైటీలైతే 26 నుంచి 50 క్యూబిక్ మీటర్ల వరకు లీటర్‌కు రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. 50 క్యూబిక్ మీటర్లు దాటితే లీటర్‌కు రూ. 2 కట్టాలి. ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్యూనిట్లకైతే 50 క్యూబిక్ మీటర్ల వరకు రూపాయి చొప్పున, అంతకంటే ఎక్కువ దాటితే వాడే నీటిని బట్టి రూ.10వరకు వసూలు చేస్తారు.
అండర్ గ్రౌండ్‌వాటర్ లభ్యతను బట్టి చార్జీలను రూ. 2 నుంచి రూ. 60 వరకు తీసుకుంటారు. ఇందులో సెమీక్రిటికల్, క్రిటికల్ డ్రింకింగ్ వాటర్యూనిట్ల వారీగా బోర్లు వాడే ప్రాంతాలను అధికారులు విభజించనున్నారు. ట్యాంకర్ల ద్వారా అండర్ గ్రౌండ్‌వాటర్ సప్లయ్ చేసే వారి దగ్గరి నుంచి ట్యాంకర్ల కెపాసిటీని బట్టి లీటర్‌కు రూ.10, రూ. 20, రూ. 25చొప్పున తీసుకోనున్నారు. ప్రతి రోజు వంద క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ వినియోగించుకునే పరిశ్రమలు..గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ప్రతి ఏడాది వాటర్ ఆడిట్ నిర్వహించి నివేదికలను భూగర్భజల శాఖకు అందజేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చెల్లించే సెస్‌లో మార్పులు చేర్పులుంటాయి. ప్రతి మూడు నుంచి ఐదేండ్ల కోసారి ఎన్వోసీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఓవర్ ఎక్స్ట్రాక్షన్ జోన్లో ఉన్న వారు ప్రతి రెండేండ్లకోసారి ఎన్ఓసీని రెన్యూవల్ చేయించుకోవాలి.
సింగరేణి కాలనీలకు నీటి కోత తప్పదా
సింగరేణి తమ అవసరాలకు ప్రధానంగా గ్రౌండ్వాటర్పై ఆధారపడి ఉంది. కోల్ మైన్స్‌తో పాటు సింగరేణి కార్మిక వాడల్లో ఇప్పటి వరకు మైనింగ్ తవ్వకాలు, బోర్ల ద్వారా వచ్చే నీటినే వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి చార్జీలు లేకపోవడంతో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి కార్మిక వాడల్లో కొన్ని చోట్ల ఉదయం, సాయంత్రం, మరి కొన్ని చోట్ల ప్రతి రోజు సింగరేణి నీటిని సప్లై చేస్తోంది. ఇక నుంచి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండడంతో నీటిని పొదుపుగా వాడుకోవాల్సి ఉన్నందున, కాలనీలకు వాటర్ సప్లైలో కొంత మేర కోత విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలకు మున్సిపాలిటీ వాటర్ సప్లై సరిగ్గా లేదు. దీంతో వీరంతా సింగరేణి సరఫరాచేసే నీటి పైనే ఆధారపడుతున్నారు. వాటర్ సెస్ పుణ్యమా అని ఇక నుంచి సింగరేణి వాసులకు కష్టాలు తప్పకపోవచ్చు.
వాటర్ప్లాంట్ల యజమానులు, అపార్ట్మెంట్ల వాసుల ఆందోళన
ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల నుంచి వాటర్సెస్ వసూలు చేసే నిర్ణయంపై వాటర్ప్లాంట్ల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు లేక జీవనోపాధి కోసం వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని బతుకుతుంటే చార్జీలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాలతో పాటు పట్టణాల్లో కూడా అపార్ట్ మెంట్ కల్చర్పెరిగింది. వీరు కూడా వాటర్సెస్ చెల్లించాల్సి ఉంటుంది. బోర్వేసుకునేందుకు అధికారికంగా పర్మిషన్ తీసుకున్నామని, ఇప్పుడేమో కొత్తగా వాటర్సెస్ అంటూ చార్జీలను వసూలు చేయడం అన్యామమని వీరు వాపోతున్నారు.