
- కూరగాయలు సరిపోతలేవ్
- రాష్ట్రంలో ఏటా 18.29 లక్షల టన్నుల కొరత
- హార్టికల్చర్ స్టడీలో వెల్లడి
- ఏటా కూరగాయల అవసరాలు 41.75 లక్షల టన్నులు
- దిగుబడి 23.46 లక్షల టన్నులు దాటట్లేదు
- రాష్ట్ర అవసరాల్లో 60 శాతం బయటి నుంచి దిగుమతే
- రోజుకు తినాల్సింది 325 గ్రాములు.. తింటున్నది 250 గ్రాములే
- కనీసం లక్ష ఎకరాల్లో సాగు పెంచాలని సూచనలు
హైదరాబాద్, వెలుగు: జనాభా అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో కూరగాయల సాగు జరగడం లేదు. పైగా ప్రతి ఏటా గణనీయంగా పడిపోతున్నది. రాష్ట్రంలో ఏడాదికి కూరగాయల అవసరాలు 41.75 లక్షల టన్నులు కాగా, 23.46 లక్షల టన్నుల పంట సాగు మాత్రమే జరుగుతున్నది. 18.29 లక్షల టన్నుల కొరత ఉంటున్నది. రాష్ట్ర అవసరాల్లో 60 శాతం బయటి నుంచి దిగుమతి జరుగుతున్నట్లు ఇటీవల హార్టికల్చర్ శాఖ చేసిన స్టడీలో వెల్లడైంది. రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు వేయాలని టార్గెట్ పెడుతున్న సర్కారు.. కూరగాయల సాగును మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 11 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు జరుగుతున్నట్లు హార్టికల్చర్ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సిఫార్సుల మేరకు రోజు వారీగా తలసరి కూరగాయల వినియోగం 325 గ్రాములు ఉండాలి. కానీ రాష్ట్రంలో 250 గ్రాములకు మించి తినడం లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ తేల్చింది. అన్నింటికీ కొరతేరాష్ట్రంలో టమాట, వంకాయ వంటి ప్రధాన వెజ్ క్రాప్స్ మాత్రమే సాగు చేస్తున్నరు. అది కూడా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పంట ఎక్కువ వస్తోంది. మళ్లీ మే నుంచి ఆగస్టు వరకు ఇవి కూడా షార్టేజ్ ఉంటున్నాయి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కాకరకాయ, బీరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, సొరకాయ, బీన్స్, క్యాప్సికమ్ తగినంత సాగు చేయడం లేదు. 4 లక్షల టన్నులకు పైగా ఇవే క్రాప్స్ కొరత ఉండడం గమనార్హం. ఆకుకూరలు ఏడాదికి 1.61 లక్షల టన్నులు అవసరం కాగా.. ఇప్పుడు 89 వేల టన్నులు మాత్రమే పండుతున్నాయి. అంటే ఆకుకూరలే 72 వేల టన్నుల షార్టేజ్ ఉంటున్నాయి. ఆకుకూరలు రాష్ట్ర అవసరాలకు 39 వేల ఎకరాల్లో వేయాల్సి ఉండగా.. 21 వేల ఎకరాల్లోనే సాగవుతున్నాయి. ఫలితంగా 52 శాతం ఆకుకూరల కొరత వేధిస్తోంది. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల షార్టేజీ 48 శాతం దాకా ఉంటున్నది.
సగానికి పైగా దిగుమతే
ఇప్పుడు రాష్ట్రంలో వినియోగిస్తున్న కూరగాయల్లో దాదాపు 60 శాతం ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సరఫరా కొరతను గట్టెక్కించేందుకు అదనంగా కనీసం మరో లక్ష ఎకరాల కూరగాయల సాగు అవసరమని చెబుతున్నాయి. వేసవిలో అన్‌సీజన్‌లో 60 శాతం నుంచి 70 శాతం కూరగాయాలు ఇతర రాష్ట్రాల నుంచే సరఫరా అవుతున్నాయి. సాగు ఎక్కువగా జరిగే అక్టోబరు నుంచి మార్చి వరకు మాత్రమే 50 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో డిమాండ్ ఉండడంతో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వెజిటబుల్స్ దిగుమతి జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువగా ఆలుగడ్డ దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ల నుంచి ఉల్లిగడ్డ, కర్నాటక నుంచి క్యాప్సికమ్, టమాటా సరఫరా అవుతున్నాయి.
ఇవీ కారణాలు
కూరగాయలు పండించేందుకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ రైతులకు ప్రోత్సాహం లేకే సాగు తగ్గుతున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు రాష్ట్రంలో కూలీల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్క జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ పెరగడంతో సాగు తగ్గుతూ వస్తున్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రైతులు కూరగాయ పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కోతుల బెడద వేధిస్తోంది. దీంతో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో గతంలో కూరగాయలు వేసే రైతులు వరి పంటకు మళ్లుతున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో కూరగాయలు పండించడం కాకుండా ప్రభుత్వం, రైతులు సమన్వయంతో మార్కెట్ లింకేజీ అందించి పండిస్తే ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కూరగాయల పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మార్కెటింగ్ మెలకువలపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. పంటలు గిట్టుబాటయ్యేలా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశాలు కల్పిస్తే ఇక్కడి మార్కెట్‌లతో పాటు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో సాగు వివరాలు (ఎకరాల్లో)
కూరగాయలు ప్రస్తుత సాగు అదనంగా వేయాల్సింది
- ఆలుగడ్డ 6,606 16,504
- ఉల్లిగడ్డ 37,410 23,059
- ఆకుకూరలు 21,208 18,063
- కాకరకాయ 11,114 4,970
- బీరకాయ 14,387 4,727
- బెండకాయ 28,005 3,298
- సొరకాయ 5,913 3,193
- బీన్స్ 14,718 2,814
- టమాట 90,714 --
- వంకాయ 26,103 --