జన్‌ ఔషధి కేంద్రాలు సూపర్ సక్సెస్‌

జన్‌ ఔషధి కేంద్రాలు సూపర్ సక్సెస్‌
  • 2022‑23 లో  రూ.1,236 కోట్ల విలువైన అమ్మకాలు
  • 50–90‌ శాతం తక్కువ ధరకే మెడిసిన్స్‌ 
  • జనాల్లో పెరుగుతున్న అవగాహన..సెంటర్లలో సేల్స్ జూమ్‌
  • ప్రభుత్వం  సవరించిన టార్గెట్‌ను కూడా చేరుకున్నామన్న పీఎంబీఐ

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు : ప్రజలకు తక్కువ ధరకే  మెడిసిన్స్ అందుబాటులో ఉంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) స్కీమ్ పెద్ద సక్సెస్ అయ్యింది. జన్‌‌ ఔషధి కేంద్రాల ద్వారా బ్రాండెడ్ మెడిసిన్స్ కంటే 50–90 శాతం తక్కువ ధరకే జనరిక్  మెడిసిన్స్‌‌ను ప్రభుత్వం అమ్ముతోంది. 20‌‌‌‌22–23 లో ఈ సెంటర్లు రూ.1,236 కోట్ల విలువైన మెడిసిన్స్‌‌ను అమ్మాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 38 శాతం ఎక్కువ. 2021–22 లో  జన్‌‌ ఔషది కేంద్రాలు రూ.893 కోట్ల విలువైన అమ్మకాలు జరిపాయి.

‘ప్రభుత్వం సవరించిన టార్గెట్‌‌ రూ.1,200 కోట్ల మార్క్‌‌ను కూడా క్రాస్ చేశాం. ప్రభుత్వ ఐదేళ్ల ప్లాన్ ప్రకారం సేల్స్ టార్గెట్  రూ.775 కోట్లుగా ఉంది’ అని ఫార్మాస్యూటికల్స్‌‌ అండ్ మెడికల్ డివైజెస్‌‌ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ)  సీఈఓ రవి దధిచ్‌‌ పేర్కొన్నారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజెర్స్‌‌ మినిస్ట్రీ కింద పనిచేస్తున్న ఈ సంస్థ పీఎంబీజేపీని నడుపుతోంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ఫలితంగా  జన్‌‌ ఔషధి సెంటర్లలో సేల్స్ ఊపందుకున్నాయని చెప్పారు. ఈ  సెంటర్లను పెంచామని, మెడిసిన్స్ సరిపడినంత అందుబాటులో ఉండేలా  చర్యలు తీసుకుంటున్నామని,  ఈ సెంటర్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచామని వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో 9,300 జన్ ఔషధి కేంద్రాలను ఆపరేట్ చేస్తున్నారు. వీటిలో  జీవితాలను కాపాడే 1,800 రకాల మెడిసిన్స్‌‌, 280 సర్జికల్‌‌, న్యూట్రాసిటికల్స్, మెడికల్ డివైజ్‌‌లు అందుబాటులో ఉన్నాయి.  కాగా, ఈ సెంటర్లను చిన్న ఎంటర్‌‌‌‌ప్రెనూర్లు నడుపుతున్నారు. వీటికి  పీఎంబీఐ  మెడిసిన్స్ సప్లయ్ చేస్తోంది.  టెండర్ల ద్వారా ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి జనరిక్ మెడిసిన్స్‌‌ను పీఎంబీఐ సేకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10 వేలకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుందని దధిచ్ పేర్కొన్నారు.  

తెలంగాణలో..

రాష్ట్రంలో మొత్తం  పెద్ద మొత్తంలో జన్ ఔషధి కేంద్రాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 18, అదిలాబాద్‌ జిల్లాలో 7, భద్రాద్రి కొత్తగూడెంలో 2, హన్మకొండలో  6, జగిత్యాలలో 11, జనగాంలో 8, జయశంకర్ భూపాలపల్లిలో 4, జోగులాంబ గద్వాల్‌లో 6, ఖమ్మంలో 2 సెంటర్లు ఉన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌లో 3, మహబూబాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌‌లో 8, మంచిర్యాలలో 6, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో 19, మేడ్చల్‌ మల్కజ్‌గిరిలో 24, నిజామబాద్‌లో 7, వరంగల్‌లో 7, పెద్దపల్లిలో 5, నల్గొండలో రెండు సెంటర్ల చొప్పన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా జన్ ఔషధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

పేషెంట్లపై భారం తగ్గించేందుకు..

ఆర్థికంగా పేషెంట్లపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం జనరిక్ మెడిసిన్స్ వాడకాన్ని  పెంచుతోంది. ప్రస్తుతం పేషెంట్లు చేస్తున్న హెల్త్‌‌కేర్ ఖర్చుల్లో 63 శాతం తమ సొంత జేబుల్లో నుంచి  జరుగుతోంది. ఈ ఖర్చుల్లో కూడా మెజార్టీ వాటా మెడిసిన్స్ కోసం చేస్తున్నారు.  ఇండియాలో అమ్ముడవుతున్న మెడిసిన్స్‌‌లో 95 % జనరిక్సే ఉన్నాయి. కానీ, ఇందులో 90 % మెడిసిన్స్‌‌ను కంపెనీలు  తమ మెడికల్ రిప్రజెంటేటివ్‌‌లు,  భారీ ప్రమోషన్లు, బ్రాండ్‌‌ బిల్డింగ్‌‌ ద్వారా ఎక్కువ రేటుకే అమ్ముతున్నాయి. మిగిలిన 10 శాతం జనరిక్‌‌ మెడిసిన్స్ ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి జనాల్లోకి వెళ్లడం లేదు.

వీటి క్వాలిటీ, సామర్ధ్యంపై అనుమానాలు ఉండడమే కారణం. తక్కువ ధర జనరిక్ మెడిసిన్స్ దొరకడం లేదన్న  ఆరోపణలపై దధిచ్ స్పందించారు. విదేశాలకు మందులు ఎక్స్‌‌పోర్ట్ చేసే కంపెనీలూ జన్‌‌ ఔషధి సెంటర్లకు మెడిసిన్స్ సప్లయ్ చేస్తున్నాయన్నారు. ఈ కేంద్రాల్లోని మెడిసిన్స్‌‌ కఠినమైన  క్వాలిటీ కంట్రోల్‌‌ రూల్స్‌‌కు  తగ్గట్టు ఉంటాయని,  డబ్ల్యూహెచ్‌‌ఓ జీఎంపీను ఫాలో అయ్యే కంపెనీల నుంచే మెడిసిన్స్‌‌ను సేకరిస్తున్నామని చెప్పారు.