అమ్మకానికి అలయన్స్ ఎయిర్ కూడా

అమ్మకానికి అలయన్స్ ఎయిర్ కూడా

న్యూఢిల్లీ: ఎయిర్‌‌ ఇండియా అమ్మకాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం, దీనికి చెందిన నాలుగు సబ్సిడరీ కంపెనీలనూ అమ్మకానికి పెట్టనుంది. వీటిలో అలయన్స్‌‌ ఎయిర్‌‌ వంటి కంపెనీలతోపాటు రూ.14,700 కోట్ల విలువైన భూములు, భవనాల వంటి స్థిరాస్తులు ఉన్నాయని డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ పబ్లిక్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (దీపమ్‌‌) కార్యదర్శి తుహిన్‌‌కాంత పాండే చెప్పారు. టాటా గ్రూప్‌  రూ.18 వేల కోట్లకు బిడ్ వేసి ఎయిర్‌‌ ఇండియాను దక్కించుకున్నట్టు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. దాదాపు 68 ఏళ్ల తరువాత సొంత గూటికే ఎయిర్‌‌ ఇండియా చేరుకుంది. దీనివల్ల ఎయిర్‌‌ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌, గ్రౌండ్ హ్యాండింగ్‌‌ విభాగం ఏఐఎస్‌‌ఏటీఎస్‌‌ వంటివి కూడా టాటాకు దక్కుతాయి. ఎయిర్‌‌ ఇండియాను నడపడం వల్ల ప్రభుత్వానికి రోజుకి దాదాపు రూ.20 కోట్లు నష్టం వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఎయిర్‌‌ ఇండియాకు  రూ.61 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. వీటిలో రూ.15,300 కోట్ల అప్పులను టాటా గ్రూప్ డబ్బుతో తీరుస్తారు. మిగతా రూ.46 వేల కోట్ల అప్పులు, మరికొన్ని బకాయిలు, రూ.14 వేల కోట్ల విలువైన ఆస్తులు  ఎయిర్‌‌ ఇండియా అసెట్స్‌‌ హోల్డింగ్‌‌ లిమిటెడ్‌‌ (ఏఐఏహెచ్‌‌ఎల్‌‌)కు బదిలీ అవుతాయి.

అన్ని రకాల ఆస్తులూ ప్రైవేటుకే..

ఇక నుంచి ఏఐఏహెచ్‌‌ఎల్‌‌ సబ్సిడరీల అమ్మకానికి ఏర్పాట్లు మొదలుపెడతామని ‘దీపమ్’ వర్గాలు తెలిపాయి. ఏఐఏహెచ్‌‌ఎల్‌‌కు చెందిన గ్రౌండ్‌‌ హ్యాండ్లింగ్‌‌, ఇంజనీరింగ్‌‌, అలయన్స్‌‌ ఎయిర్‌‌లను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారు. ఎయిర్‌‌ ఇండియా గ్రూపు అప్పులు, నాన్‌‌ కోర్‌‌ అసెట్స్‌‌ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2019 లో ఏఐఏహెచ్‌‌ఎల్‌‌ను ఏర్పాటు చేసింది. నాలుగు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలు -ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌‌ఎల్‌‌), ఎయిర్‌‌లైన్ అలైడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌‌ఎల్‌‌), ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌‌ఎల్‌‌),  హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌‌సీఐ)- నాన్-కోర్ ఆస్తులతో పాటు, పెయింటింగ్, కళాఖండాలు, మరికొన్ని నాన్‌‌ కోర్‌‌ అసెట్లను స్పెషల్ పర్పస్‌‌ వెహికల్‌‌ (ఎస్పీవీ)కు బదిలీ అయ్యాయి.

ఎయిర్‌‌బస్‌‌తో ఆకాశ చర్చలు

ప్రముఖ ఇన్వెస్టర్‌‌ రాకేశ్‌‌ జున్‌‌జున్‌‌వాలా, ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌‌ ఆదిత్య ఘోష్‌‌కు చెందిన ఆకాశ ఎయిర్‌‌లైన్స్‌‌ వచ్చే ఏడాది కమర్షియల్‌‌ సర్వీసులను నడిపించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది.  విమానాల కొనుగోలు కోసం అమెరికా ఎయిర్​లైన్స్​ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ కంపెనీ ఎయిర్‌‌బస్‌‌తో చర్చలు మొదలుపెట్టింది. ఏ320 వంటి  విమానాలను కొనాలని ఆకాశ చూస్తోంది. వీటిలో ఒకే వరుసలో సీట్లు ఉంటాయి. అయితే,  బోయింగ్ బీ737 విమానాల కొనుగోలు కోసం ఎయిర్‌‌బస్‌‌ ప్రత్యర్థి కంపెనీ బోయింగ్‌‌తోనూ ఆకాశ సంప్రదింపులు జరిపింది.

న్యారో బాడీ విమానాలు కొంటాం..

తాము న్యారో బాడీ (చిన్న) విమానాలతో వచ్చే వేసవి నుంచి సేవలు మొదలుపెడతామని, నాలుగేళ్లలో విమానాల సంఖ్యను 70కి పెంచుతామని ఆకాశ ప్రకటించింది. మనదేశంలోనే అతిపెద్ద ఎయిర్‌‌లైన్స్‌‌ కంపెనీ ఇండిగోకు డొమెస్టిక్​ ఏవియేషన్​ మార్కెట్‌‌లో 50 శాతం వాటా ఉంది. దీనివద్ద మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఎయిర్‌‌బస్ న్యారో బాడీ ఎయిర్‌‌క్రాఫ్టులు ఉన్నాయి.  స్పైస్‌‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్ కూడా  ఇలాంటి బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి. వీటిలో చిన్న ఇంధన ట్యాంక్ ఉంటుంది కాబట్టి తక్కువ దూరమే ప్రయాణిస్తుంది.  ఎయిర్‌‌బస్‌‌ ఏ350, బోయింగ్‌‌ బీ777 విమానాలు మాత్రం ఎక్కువ దూరం వెళ్తాయి.