ఆర్డినెన్స్ పై పీటముడి!..అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్

ఆర్డినెన్స్ పై పీటముడి!..అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్
  • గవర్నర్​ ఆమోదించగానే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్​
  • అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్​
  • ఈ నెల 14న గవర్నర్​ వద్దకు పంచాయతీరాజ్​ చట్ట సవరణ ఆర్డినెన్స్​ బిల్లు
  • నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని భావించిన ప్రభుత్వం
  • ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వొచ్చని ఆలోచన
  • ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్​ 
  • గవర్నర్​ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కారు అనుమానం
  • ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో రెండు బీసీ బిల్లులు
  • కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర సర్కార్​ పోరాటం
  • ఆగస్టు 15 వరకు వేచి చూసి.. పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్​ బిల్లును గవర్నర్​ రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో రిజర్వేషన్ల ఖరారు, స్థానిక ఎన్నికల ప్రక్రియపై పీటముడి పడింది. రాజ్యాంగ, న్యాయనిపుణుల సలహాలు, సూచనలతో పకడ్బందీగా చట్ట సవరణ చేసి పంపినందున బిల్లుకు గవర్నర్​ ఆమోదముద్ర వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, ఆయన రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్​ పడ్డట్టయింది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్డినెన్స్​లను సాధారణంగా గవర్నర్లు ఆమోదించడం ఆనవాయితీ. 

ఈ నెల 14న గవర్నర్‌ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్​ బిల్లు వెళ్లగా, నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత వారం రోజుల్లో (జులై 25వ తేదీలోగా) హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి, తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వాలని ప్రణాళికలు వేసుకుంది. అయితే.. ఆర్డినెన్స్ ఫైల్​పై గవర్నర్  తీసుకున్న  అనూహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కారు అనుమానిస్తున్నది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే  పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మరోవైపు సెప్టెంబర్​30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులతోపాటు గవర్నర్​ పంపిన ఆర్డినెన్స్​ బిల్లును ఆమోదించుకోవడంపై రాష్ట్ర సర్కారు ఫోకస్​ పెట్టింది. 


ఇందుకోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ పేరుతో కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లోపు కేంద్రం స్పందించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఆగస్టు 15వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 

రిజర్వేషన్ల పెంపు కోసమే చట్ట సవరణ

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285ఏ గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి స్థానిక సంస్థ ల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని ఈ సెక్షన్​చెప్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్తే  బీసీలకు 22 నుంచి 23 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ముందుగా ఈ నిబంధనను సవరించాలని కాంగ్రెస్​ సర్కారు భావించింది. ఇందుకోసం సమగ్ర కులగణన సర్వే చేపట్టింది. అందులో వచ్చిన ఎంపిరికల్ డేటా ప్రకారం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బీసీలు ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారో సమగ్ర నివేదిక తీసుకున్నది. దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించి, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ ఆర్డినెన్స్‌ను ముందుకు తెచ్చింది. 1992లో ఇంద్రా సాహ్నీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ‘‘అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చని.. అత్యంత జాగ్రత్తగా, ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇది సమర్థనీయం” అని సుప్రీం కోర్టు స్పష్టం చేయగా.. ఆ ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది. అందులో భాగంగానే 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ఏలో రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధనను తొలగించి, ఆ స్థానంలో ‘కుల గణన సర్వేలోని ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి’ అని మార్పుచేసింది.  ఈ ఆర్డినెన్స్​ను గవర్నర్​కు పంపగా.. గవర్నర్​ దాన్ని రాష్ట్రపతికి పంపారు.  

ఆంతర్యం ఏమిటి?

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు  రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చే ఆర్డినెన్స్​లను గవర్నర్లు ఆమోదిస్తుంటారు. ఆయా ఆర్డినెన్స్​లను ఆరు నెలల్లోగా చట్టసభలు ఆమోదిస్తే సరిపోతుంది. కానీ, పంచాయతీరాజ్​ చట్టసవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్​ బిల్లును గవర్నర్​ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు. ఆర్డినెన్స్​ బిల్లులో ఏమైనా అనుమానాలు ఉంటే న్యాయసలహాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవచ్చు. అప్పటికీ ఏదైనా అంశంపై క్లారిటీ రాకపోతే గవర్నర్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించవచ్చు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించాకే కేబినెట్​ఆమోదంతో ఆర్డినెన్స్ ఫైల్​ సిద్ధం చేసి గవర్నర్​కు పంపించింది. గవర్నర్  కూడా అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నదని.. ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్​ ఆమోదముద్ర వేస్తారని ప్రభుత్వం భావిస్తున్న టైంలో గవర్నర్​ అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్ర హోం శాఖకు పంపారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకు రాజ్​భవన్​అధికారులు ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు.  పంచాయతీరాజ్​చట్టంలో 50శాతం రిజర్వేషన్లపై క్యాపింగ్ ఉన్న కీలకమైన​నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలనుకోవడం, దానిపై ఇప్పటికే సుప్రీంకోర్టు  తీర్పులు ఉండడంతో గవర్నర్​ఈ అంశాన్ని సీరి యస్​గా తీసుకున్నారని అంటున్నారు.  అసలు రిజ ర్వేషన్లపై క్యాపింగ్​ ఎత్తివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే సందేహం గవర్నర్‌కు వచ్చిందని చెప్తున్నారు. అదీగాక ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోటా కల్పించే రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లి పెండింగ్‌లో ఉండడం వల్లే గవర్నర్ ఆర్డినెన్స్‌ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్లు రాజ్​భవన్​ అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్​ఆర్డినెన్స్​ బిల్లును రాష్ట్రపతికి పంపించారనే వాదనలు కాంగ్రెస్​ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఆగస్టు 15 దాకా వేచిచూసి..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నది. ఇప్పటికే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. అంతకంటే పెద్ద సమస్య నిధుల కొరత వేధిస్తున్నది. పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. ఇప్పటికే దాదాపు రూ.1,600 కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. మరోవైపు సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం కోర్టు విధించిన నెల రోజుల గడువు కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్​ను గవర్నర్​ ఆమోదించగానే  రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ, గవర్నర్​ ఆర్డినెన్స్​ను రాష్ట్రపతికి పంపించడంతో తొలుత పంపిన బీసీ బిల్లులతో పాటు ఈ ఆర్డినెన్స్​ బిల్లు కూడా కేంద్రం వద్దే పెండింగ్​ పడినట్లయింది. ఈ నేపథ్యంలో బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 7 వరకు ఢిల్లీ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నది. ఆగస్టు 15 దాకా కేంద్రం నిర్ణయం కోసం వేచి చూసి, అప్పటికీ ఎలాంటి స్పందన లేకుంటే పార్టీపరంగానైనా బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.