రంగు, ఎత్తుతో వివక్ష ఎదుర్కొన్నా: గవర్నర్ తమిళిసై

రంగు, ఎత్తుతో వివక్ష ఎదుర్కొన్నా: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌‌, వెలుగు: తాను రంగు, ఎత్తు కారణంగా జీవితంలో వివక్ష ఎదుర్కొన్నానని, అవరోధాలను అధిగమించి విజయం సాధించానని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ వెల్లడించారు. మహిళలు లేకుండా పురుషులు జీవితంలో మనుగడ సాగించలేరని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో  మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లోని బిట్స్ పిలాని  క్యాంపస్ లో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని, మాట్లాడారు.   అన్ని రంగాల్లో మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. 

గృహహింస, వైవాహిక వివాదాల్లో బాధితులైన మహిళలకు కౌన్సెలింగ్, అన్ని రకాల విధులను నిర్వహిస్తున్న  మహిళా పోలీసులను గవర్నర్ అభినందించారు. స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌‌‌‌ అభిలాష బిస్త్  మాట్లాడుతూ.. గతంలో మహిళలు బయటకు వచ్చి పని చేసేవారు కాదని, పరిస్థితులు మారాయని అన్నారు. అన్నిరంగాల్లోనూ సత్తాచాటుతున్నారని చెప్పారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. మహిళా అధికారులు, సిబ్బంది పురుషుల కంటే తక్కువ కాదని పేర్కొన్నారు. ఈ సదస్సులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి తనాజ్ ఇరానీ, మహిళా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.