తుంగభద్ర వరద బాధితులను పట్టించుకోని సర్కారు

తుంగభద్ర వరద బాధితులను పట్టించుకోని సర్కారు

గద్వాల, వెలుగు: తుంగభద్ర వరద బాధితులను సర్కారు పట్టించుకోవడం లేదు. 2009లో వచ్చిన వరదలకు అలంపూర్ టౌన్‌‌‌‌తో పాటు మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో నీట మునిగింది.  ఇందులో నిర్వాసితులైన వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సర్కారు ఇండ్ల జాగాల పట్టాలు ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు ప్లేసులు చూపించడం లేదు. పైగా పట్టాలిచ్చిన జాగాలో ఆఫీసులు కడుతోంది. దీంతో బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. 13 ఏండ్లు గడుస్తున్నా జాగాలు చూపించరా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

నిర్వాసితులైన 1,032 కుటుంబాలు 

2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరదలకు అలంపూర్ అతలాకుతలమైంది. ప్రజలు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.  వరదలు తగ్గాక అలంపూర్ టౌన్‌‌‌‌లో నష్టపోయిన 882 కుటుంబాలకు 43 ఎకరాల్లో ఇండ్ల పట్టాలు ఇచ్చారు.  అలాగే  మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో 150 కుటుంబాలకు 34 ఎకరాల్లో  పట్టాలు ఇచ్చారు.  కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా ప్లేసులు చూపించలేదు.  

పట్టాల జాగాలో ప్రభుత్వ ఆఫీసులు

ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో అధికారులు  ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారు.   ఇప్పటికే రైతు వేదిక కట్టారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ ఆఫీసు కట్టేందుకు పునాదులు తీశారు.  దీంతో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ ఆఫీసుల వద్ద ధర్నాలు చేపట్టారు. వరదల్లో నిండా మునిగి తీవ్రంగా నష్టపోయామని,  పాత ఇండ్లు కూలిపోయినా తమకు పరిహారం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. 
ఇండ్ల పట్టాలు ఇచ్చిన జాగాలో సర్కారు ఆఫీసులు ఎలా కడతారని మండిపడుతున్నారు. తమకు వెంటనే ప్లేసులు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.  

అడ్డుగా కొత్త రెవెన్యూ చట్టం !

రాష్ట్ర సర్కారు 2020లో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ప్లాట్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.  ప్రభుత్వం పట్టా ఇచ్చిన  ఏడాదిలోగా నిర్మాణం జరగాలని,  లేదంటే ఆటోమెటిక్‌‌‌‌గా పట్టా రద్దవుతుందని అంటున్నారు. అయితే తుంగభద్ర బాధితులపై విషయం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోఉందని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో చెబుతున్నారు. 

స్థలం చూపించాలి

వరదలతో తీవ్రంగా నష్టపోయినం.  అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు వెంటనే స్థలాలు చూపించాలె.  దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకుంటలేరు. సర్కారు స్పందించి మాకు న్యాయం చేయాలి.

–పల్లె వసంత, అలంపూర్

జాగ చూపిస్తే గుడిసెలు వేసుకుంటం

చిన్న ఇంట్లో ఉండలేకపోతున్నం.  గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల కు జాగలు చూపిస్తే గుడిసెలు వేసుకొని బతుకుతం. 13 ఏండ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

–మాసాని నరసమ్మ, అలంపూర్

గైడ్‌‌లైన్స్‌‌ లేవు

కొత్త రెవెన్యూ చట్టంలో పట్టాలు, ప్లాట్ల పంపిణీకి గైడ్‌‌లైన్స్‌‌ లేవు. అందువల్ల ఈ సమస్యలు పరిష్కరించలేకపోతున్నం.  విషయాన్ని ఉన్నత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తం. 

–యాదగిరి, ఏవో, కలెక్టరేట్