డీబీటీతో రూ.2.73 లక్షల కోట్లు ఆదా : నిర్మలా సీతారామన్​

డీబీటీతో రూ.2.73 లక్షల కోట్లు ఆదా :   నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: డైరెక్ట్​ బెనిఫిట్ ​ట్రాన్స్‌‌‌‌ఫర్​(డీబీటీ) విధానం ద్వారా నిజమైన లబ్దిదారులకు డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేయడం, బోగస్​ ఖాతాలను ఏరేయడం వల్ల గత తొమ్మిదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేశామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ డబ్బును అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో దిశా భారత్​ అనే ఎన్జీఓ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డీబీటీ వల్ల లీకేజీలను తొలగించామని, అర్హులకే పథకాల ఫలాలు దక్కేలా చేశామని అన్నారు.

 గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పాలనలో సమర్థత పెరిగిందని, విద్య, వైద్యానికి మరింత ఖర్చు చేయగలుగుతున్నామని ఆమె వివరించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పోటీ పెరగడం వల్ల 2014లో ఒక జీబీకి రూ.308గా ఉన్న డేటా ధర ఇప్పుడు రూ.2.73లకు పడిపోయిందని అన్నారు. ‘‘ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 11.72 కోట్ల టాయిలెట్లను, మూడు కోట్ల ఇండ్లను నిర్మించాం. పీఎం స్వనిధి కింద 39.76 లక్షల మంది వీధి వ్యాపారాలకు తనఖా లేకుండా లోన్లు ఇచ్చాం. 

ఉజ్వల యోజన కింద 9.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం. స్టాండప్ ​ఇనీషియేటివ్​లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.7,351 కోట్ల విలువైన లోన్లు మంజూరు చేశాం. చాలా రాష్ట్రాలు ఉచిత పథకాలను ఇష్టపడుతున్నాయి. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు చాలదు. పైగా మిడిల్​క్లాస్ ​జనంపై భారం ఎక్కువ అవుతుంది. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇందుకు ఉదాహరణలు” అని ఆమె వివరించారు.