ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం: పీయుష్​ గోయల్

ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం:  పీయుష్​ గోయల్

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం పేర్కొన్నారు. ఆహార వస్తువుల ధరలు అదుపులో ఉంటే దేశ ఆర్థిక వృద్ధికి భరోసా ఉంటుందని, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుందని చెప్పారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. "నేడు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 

 మా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. ఆర్థిక వృద్ధిని కూడా కొనసాగిస్తాం" అని గోయల్ చెప్పారు. తాజా అధికారిక లెక్కల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌‌‌‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 5.55 శాతానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌‌‌‌లో 4.87 శాతంగా ఉంది. ఆగస్టు నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ 6.83 శాతానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మంత్రి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల హోల్‌‌‌‌సేల్,  రిటైల్ ధరలను నిశితంగా పరిశీలించడానికి 140 కొత్త ధరల పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

కొన్ని వస్తువుల ధరలు పెరగడం ప్రారంభించినప్పుడల్లా, ప్రభుత్వం అనుకూల చర్యలు చేపట్టి నియంత్రించిందని వివరించారు. ఎన్​సీసీఎఫ్​, నాఫెడ్​, కేంద్రీయ భండార్‌‌‌‌ల రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లతో పాటు మొబైల్ వ్యాన్‌‌‌‌ల ద్వారా ప్రభుత్వం టమోటాలను,  ఉల్లిపాయలను విక్రయించింది. ఉల్లి బఫర్ స్టాక్‌‌‌‌ను సృష్టించి, వారి ఉత్పత్తులకు సరైన ధర లభించేలా ప్రభుత్వం రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తుందన్నారు.

 సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కిలో పప్పును రూ.60కి, భారత్ పిండిని రూ.27.50కి విక్రయిస్తోందని గోయల్​ వివరించారు. గోధుమలు, నూకలు, నాన్ బాస్మతి వైట్ రైస్,  ఉల్లిపాయల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. దేశీయ సరఫరాను పెంచడానికి,  ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఇది వంటనూనెలు,  పప్పులపై దిగుమతి సుంకాలను కూడా తగ్గించింది.  ఈ మినహాయింపులు 2025 వరకు కొనసాగుతాయి.