ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన

జగిత్యాల, వెలుగు: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ గురువారం పీఆర్ టీయూ, తపస్  ఆధ్వర్యంలో జగిత్యాలలోని ఓల్డ్ హై స్కూల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ లతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు నరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి దేవయ్య, పీ ఆర్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

మెట్ పల్లి: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన విధానం వల్ల కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే వారికి రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత లేకుండా పోతోందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అందజేశారు. కార్యక్రమంలో టి.ఆగమయ్య, బి.మురళి, రవీందర్, చంద్ర శేఖర్, తాహెర్, సత్యనారాయణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ముత్తారం: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని కోరుతూ ముత్తారం మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కి  వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ రావు, శ్రీనివాస్, కోమల, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

బండలింగాపూర్ ను మండలం చేయాలి 
ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతి

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం సంస్థాన్ బండలింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సర్పంచ్​జంగిటి అంజయ్య, గ్రామస్తులు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం బండలింగాపూర్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండలింగపూర్ మండల కేంద్రం చేయడానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పంచాయతీ పాలక వర్గాలు ఏకీభవిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, వైస్ ఎంపీపీ రాజేందర్,  సింగిల్​విడో చైర్మన్ శంకర్ రెడ్డి,  ఎంపీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి
కరీంనగర్​ కలెక్టర్ కర్ణన్

కరీంనగర్‍ సిటీ, వెలుగు :  కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‍లో రెవెన్యూ, ఆర్అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పనులపై సమీక్షించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. వంతెన వద్ద వీయూపీ(వెహికిల్ అండర్ పాస్) పనులు సదాశివపల్లె, బొమ్మకల్ వద్ద పనులు పూర్తిచేయాలన్నారు. 24 గంటల పాటు పనులు నడిచేలా అవసరమైన లేబర్ ను నియమించుకోవాలని సూచించారు. అప్రోచ్ రోడ్డు మధ్యలో ఉన్న విద్యూత్ స్తంభాలను తొలగించే పనుల కోసం టెండర్లను పిలవాలన్నారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు, ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసిల్దార్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. 

నాటిన మొక్కలన్నీ బతకాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి

వేములవాడ, వెలుగు : అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్ల వెంట నాటిన మొక్కలన్నీ బతికేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన వేములవాడ మున్సిపాలిటీ ఆఫీస్, – కోరుట్ల బస్టాండ్ రోడ్డు, చెక్కపెల్లి  కాశాయపల్లి,  అయ్యోరుపల్లి, మల్లారం – జయవరం, నంది కమాన్ రోడ్ల వెంట నాటుతున్న మొక్కలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం  మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో రోడ్ల వెంట 6,500 మొక్కలు నాటుతామన్నారు. మొక్కల పర్యవేక్షణ బాధ్యత జిల్లా అధికారులకు అప్పగించామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు, తహశీల్దార్ రాజు ఉన్నారు. 

భరోసా యాత్రను విజయవంతం చేద్దాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

కరీంనగర్‍ సిటీ, వెలుగు: మానకొండూరు నియోజకవర్గ పరిధిలో శుక్రవారం చేపట్టనున్న ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మానకొండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, లీడర్లు జయచందర్, మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, వెంకట్‍రెడ్డి, కార్యదర్శి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

‘పోడు రైతులను ఇబ్బంది పెడుతుండ్రు’

వీర్నపల్లి, వెలుగు : పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు రైతులను ఇబ్బంది పెడుతోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి అన్నారు. గురువారం ఆయన వీర్నపల్లి మండలం కంచర్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గోగుల రమేశ్​అనే రైతును పరామర్శించారు. రమేశ్​సాగు చేసుకుంటున్న పత్తి పంటపై ఫారెస్ట్ ఆఫీసర్స్ గడ్డి మందు స్ప్రే చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ఉన్నారు.

రెండో విడత రుణాలు ఇవ్వాలి
అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్  

               
కరీంనగర్ టౌన్, వెలుగు: వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడతలో రూ.10వేలు తీసుకుని చెల్లించిన చిరు వ్యాపారులకు రెండో విడతలో రూ.20వేలు చెల్లించాలని ఆదేశించారు. పూర్తయిన రుణాల సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న స్ట్రీట్ వెండింగ్ జోన్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మెప్మా పీడీ రవీందర్, జిల్లా లీడ్ మేనేజర్ ఆంజనేయులు, కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు  పాల్గొన్నారు.

నక్కవాగుపై బ్రిడ్జి కోసం రిలే దీక్షలు

వేములవాడ రూరల్, వెలుగు : మండలంలోని హన్మాజీపేట నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ విద్యార్థి పరివార్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల మోహన్ హన్మాజీపేటలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వస్తే హన్మాజీపేట నక్కవాగు దాటడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలాసార్లు ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు వాగులో బోల్తా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే హన్మాజీపేటకు వచ్చి బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని అన్నారు. దీక్షలో గంగపుత్ర సంఘం సభ్యులు పల్లికొండ నారాయణ, తోకల కాశయ్య, పల్లికొండ హరీశ్, తోకల రాజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.